Share News

టార్గెట్‌ టీడీపీ

ABN , Publish Date - Apr 24 , 2024 | 01:45 AM

‘నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కనివ్వను’ అని మగధీర సినిమాలో విలన్‌ అనే డైలాగ్‌ అప్పట్లో బాగా పాపులర్‌ అయింది. ‘నా మీద కేసులెక్కువ ఉన్నాయి. మిగిలినవారి మీదా పెడుతాను’ అంటున్న సీఎం జగన్‌ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టార్గెట్‌ టీడీపీ

ఫ వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున అక్రమ కేసులు

ఫ చంద్రబాబు, అమరనాథరెడ్డిపై 22 చొప్పున

ఫ చల్లా బాబుపై 17, గాలి భానుపై 15

చిత్తూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ‘నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కనివ్వను’ అని మగధీర సినిమాలో విలన్‌ అనే డైలాగ్‌ అప్పట్లో బాగా పాపులర్‌ అయింది. ‘నా మీద కేసులెక్కువ ఉన్నాయి. మిగిలినవారి మీదా పెడుతాను’ అంటున్న సీఎం జగన్‌ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను జైల్లో ఉన్నానని, తన మీద ఎన్నో అవినీతి కేసులున్నాయని భావించిన సీఎం జగన్‌ ప్రత్యర్థుల మీద కక్ష పెంచుకున్నారు. ప్రత్యర్థి, టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఈ ఐదేళ్లలో పెద్దఎత్తున అక్రమ కేసులు పెట్టారు. జైల్లో కూడా ఉంచారు. అలాగే జిల్లాలోని టీడీపీ నేతల మీద పెద్దఎత్తున అక్రమ కేసులు నమోదు చేసి వైసీపీ నేతలు ఆనందం పొందారు. టీడీపీ అభ్యర్థులు వేసిన నామినేషన్లలోని అఫిడవిట్లను పరిశీలిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక నమోదు చేసిన కేసుల వివరాల గురించి తెలుస్తుంది. కుప్పం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు మీద మొత్తం 24 కేసులుంటే అందులో 22 వైసీపీ పెట్టినవే. అలాగే పలమనేరు నుంచి బరిలో ఉన్న అమరనాథరెడ్డి మీద 24 కేసులుండగా, వాటిలో 22 కేసులు 2019 తర్వాత నమోదైనవే. ఇక పెద్దిరెడ్డి అక్రమాల మీద పోరాడిన చల్లా రామచంద్రారెడ్డి మీద ఏకంగా 17 కేసులను వైసీపీ నమోదు చేసింది. నగరి నుంచి పోటీ చేస్తున్న గాలి భానుప్రకాష్‌ మీద కూడా 15 కేసులు ప్రభుత్వం నమోదు చేసింది.

ఫ చంద్రబాబుపై హత్యాయత్నం కేసులు

చంద్రబాబుపై 24 కేసులున్నాయి. 2010లో చంద్రబాబు మహారాష్ట్రలోని బాబ్లి ప్రాజెక్టును సందర్శించడానికి వెళితే అక్రమంగా ప్రవేశించారని ధర్నాబాద్‌ పోలీసులు కేసు పెట్టారు. 2012లో ఆళ్లగడ్డ ఉప ఎన్నిక సమయంలో కోడ్‌ ఉల్లంఘించారని కేసు నమోదైంది. మిగిలిన 22 కేసులూ వైసీపీ ఈ ఐదేళ్లలో పెట్టింది. 2020లో 5, 2021లో 9, 2022లో 2, 2023లో 6 కేసులు పెట్టారు. మంగళగిరిలో సీఐడీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 8 కేసులున్నాయి. 2023లో 2, 2022లో 1, 2021లో 3, 2020లో 2 కేసుల్ని సీఐడీ పోలీసులు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా ముదివేడు, విజయనగరం జిల్లా నెల్లిమర్ల స్టేషన్లలో హత్యాయత్నం కేసులున్నాయి. ముదివేడు స్టేషన్‌ పరిధిలో టీడీపీ శ్రేణులను వైసీపీ కార్యకర్తలపై చంద్రబాబు రెచ్చగొట్టి పంపించారని హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రోడ్‌షో సందర్భంగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని ములకలచెరువు స్టేషన్‌లో కేసు పెట్టారు.

ఫ కొవిడ్‌ వ్యాక్సిన్లు లేవన్నందుకూ కేసులు

కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో చంద్రబాబు 440కే వేరియెంట్‌ గురించి మాట్లాడి ప్రజల్లో భయాందోళన కలిగించారని గుంటూరు టౌన్‌ అరండల్‌పేట, పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్‌, కర్నూలు 1 టౌన్‌లో ఒక్కోటి చొప్పున మూడు కేసులు నమోదు చేశారు. కొవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులో లేవని చెప్పినందుకు విజయవాడ నగరంలోని సూర్యాపేట స్టేషన్‌లో ఓ కేసు పెట్టారు.

ఫ అమర్‌పై 15 స్టేషన్లలో 22 కేసులు

జిల్లా టీడీపీలో కీలక నేత, మాజీ మంత్రి అమరనాథరెడ్డి మీద 2020 నుంచి 22 కేసులు నమోదయ్యాయి. నారా లోకేశ్‌ జిల్లాలో యువగళం పాదయాత్ర ప్రారంభించగా పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. జిల్లావ్యాప్తంగా అన్ని స్టేషన్లలో కేసులు పెట్టారు. లోకేశ్‌ వెంట నడిచిన అమర్‌ మీద కూడా కేసులు పెట్టారు. అలాగే ముదివేడు, ములకలచెరువు ప్రాంతాల్లో చంద్రబాబుతోపాటు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతేడాది అక్కడ ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. చంద్రబాబుతోపాటు ఆయన మీదా కేసులు పెట్టారు. చంద్రబాబు కుప్పం వచ్చినప్పుడు జరిగిన కార్యక్రమాల్లోనూ అమర్‌ను కేసుల్లో చేర్చారు. ఇలా అన్నమయ్య జిల్లా ముదివేడు స్టేషన్‌లో 2, ములకలచెరువులో 1, చిత్తూరు జిల్లాలోని పలమనేరులో 4, వి.కోటలో 2, బంగారుపాళ్యం, ఎన్‌ఆర్‌పేట, పూతలపట్టు, బైరెడ్డిపల్లె, చిత్తూరు 2 టౌన్‌, గుడుపల్లె, కుప్పం అర్బన్‌, రాళ్లబుదుగూరు, చిత్తూరు 1 టౌన్‌ స్టేషన్లలో ఒక్కోటి చొప్పున.. తిరుపతి జిల్లాలోని తిరుచానూరులో 2, అలిపిరిలో 1 మొత్తం 22 కేసులు నమోదయ్యాయి.

ఫ పుంగనూరులోనే అత్యధిక కేసులు

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలను అడ్డుకుంటూ చల్లా రామచంద్రారెడ్డి ఏళ్లుగా పోరాడుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల మీద పెట్టిన అక్రమ కేసులు, తెరిచిన రౌడీషీట్లు రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోనూ ఉండకపోవచ్చు. టీడీపీలో యాక్టివ్‌గా ఉండే ప్రతి నాయకుడు, కార్యకర్త మీద కేసులు పెట్టారు. టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి మీద వైసీపీ వచ్చాక ఏకంగా 17 కేసులు పెట్టారు. గతేడాది ఆగస్టులో పుంగనూరులోకి చంద్రబాబు రాకను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం.. పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం తెలిసిందే. ఆ ఘటనలో ఏకంగా 598 మంది మీద కేసులు పెట్టారు. చల్లా కూడా కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత నేరుగా లొంగిపోయి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈయన మీద పుంగనూరులో 8 కేసులు, రొంపిచెర్లలో 4, సోమల, కల్లూరు, చౌడేపల్లె, ముదివేడు, ములకలచెరువులో ఒక్కోటి చొప్పున మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. 2023 అత్యధికంగా 8 కేసులు పెట్టారు.

ఫ గాలి భానుపైనా 15 కేసులు

నగరి నుంచి రెండోసారి బరిలో నిలిచిన గాలి భానుప్రకాష్‌ మీద కూడా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసింది. ఈయన మీద ఈ ఐదేళ్లలో 15 కేసులు నమోదయ్యాయి. 2019లో అత్యధికంగా 8 కేసులు, 2023లో 4, 2021లో 2, 2022లో ఓ కేసు పెట్టారు. అన్నీ నగరి, పుత్తూరు, నిండ్ర, విజయపురం, రేణిగుంట, తిరుచానూరు స్టేషన్లలో ఉన్నాయి.

Updated Date - Apr 24 , 2024 | 01:45 AM