Share News

కవ్విస్తున్న వైసీపీ

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:38 AM

జనసేన అభ్యర్థి ప్రచారానికి అడ్డంకులు కయ్యానికి కాలుదువ్వుతున్న వైసీపీ శ్రేణులు

కవ్విస్తున్న వైసీపీ
ఎన్డీఏ కూటమి పార్టీల కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల ముష్టిఘాతాలు

తిరుపతి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : తిరుపతిలో 2019 వరకు ఒకటి, రెండు సమస్యాత్మక ప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు జరిగేవి. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తిరుపతిలో ఎన్నికలంటేనే సగటు ఓటరుకు వెగటు, భయం పుట్టేలా పరిస్థితిని మార్చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి జరిగిన ఎన్నికలన్నీ గొడవలు, రాళ్లదాడులు, దొంగ ఓటర్లను అడ్డుకోవడం వంటి సంఘటనల నడుమఉద్రిక్త వాతావరణమే కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలకుని ఎంపీ ఉప ఎన్నిక, టౌన్‌బ్యాంకు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయో దేశం మొత్తం చూసింది. అలాంటి వాతావరణానికి అలవాటుపడి పైచేయిగా నిలిచిన వైసీపీ శ్రేణులు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే పంథాను అనుసరించే వ్యూహంతో ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నామినేషన్‌ వేసినప్పటినుంచి వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఆరణి ర్యాలీలో వేలాదిగా తరలివచ్చిన జనవాహినిని చూసి వైసీపీ నాయకులు కుట్రకు తెరలేపినట్టుగా ప్రచారం జరుగుతోంది. జనసేన అభ్యర్థి ప్రచారం చేపట్టే ప్రాంతాల్లో ముందుగా వైసీపీ శ్రేణులు వాలిపోయి కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి.

గిరిపురంలో ఉద్రిక్తత

ఆరణి ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు

తిరుపతిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన అభ్యర్థి ప్రచారం చేపట్టే ప్రాంతాల్లో ముందుగా వైసీపీ శ్రేణులు వాలిపోయి కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. నాలుగు రోజుల క్రితం 27వ డివిజన్లోని జబ్బార్‌ లేఅవుట్‌లో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారానికి వెళుతుంటే వైసీపీ కార్యకర్తలు కూడా ప్రచారం పేరిట రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి పార్టీ కార్యకర్తలు పట్టించుకోకుండా ప్రచారం చేపడుతూ దొడ్డాపురం వీధిలోకి వెళ్లిపోయారు. తాజాగా శనివారం గిరిపురంలో జనసేన అభ్యర్థి ప్రచారం చేసుకుంటూ వెళుతుంటే దారివ్వకుండా వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు. ప్రచారానికి వెళ్లకూడదంటూ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య పిడిగుద్దులు, తోపులాటలతో ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో సమాచారం అందుకుని అక్కడకు చేరుక్ను పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో టీడీపీ నేత మబ్బు దేవనారాయణ రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆరణి శ్రీనివాసులుతో పాటు టీడీపీ నాయకులు సుగుణమ్మ, నరసింహయాదవ్‌, ఊకా విజయకుమార్‌, దంపూరి భాస్కర యాదవ్‌, ఆర్సీ మునికృష్ణ, జనసేన నేతలు కిరణ్‌రాయల్‌, రాజా రెడ్డి, సుభాషిణి, ఆర్కాట్‌ కృష్ణప్రసాద్‌ తదితరులను తోపులాటల నడుమ పోలీసులు అనంత వీధివైపు పంపారు. అక్కడ వైసీపీ కార్యకర్తలు కొందరు గుంపులుగా చేరుకుని నినాదాలు చేయడం, ఇళ్లపైకి ఎక్కి జెండాలు ఊపుతూ కవ్వింపులకు దిగారు.అయితే మబ్బు యువసేన కార్యకర్తలు దీటుగా ప్రతిఘటించడంతో అక్కడినుంచి పలాయనం చిత్తగించారు.

పోలీసులు ప్రేక్షకపాత్ర

ఎన్నికల ప్రచారంలో నాలుగైదు ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తిరుపతిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలంటే ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించాల్సివుంది.

భూమనా...ఇది కడపకాదు

రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందనడానికి తిరుపతిలో వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలే నిదర్శనం. నాలుగు రోజులుగా ఎంత కవ్విస్తున్నా శాంతియుతంగా వెళ్తున్నాం. 99సార్లు శాంతియుతంగా ఉండమనే మా నాయకుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. పరిస్థితి చేయిదాటిపోతే యుద్ధంలో దిగడమే. ఎన్నికల అధికారుల దగ్గర అనుమతి తీసుకుని ముందుగా ప్రచారానికి వెళుతుంటే, మేం వెళ్లే దారిలో అడ్డంవచ్చి దారివదలకుండా రౌడీమూకలు అడ్డుకుంటున్నాయి. గంజాయి మూకలతో బెదరగొట్టాలని చూస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడం. తిరుపతి వాళ్ల అబ్బసొత్తుకాదు. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి మాత్రమే. కడప సంస్కృతి తీసుకొస్తామంటే కుదరదు.

- ఆరణి శ్రీనివాసులు, జనసేన అభ్యర్థి

సౌమ్యులమైన మాపై నిందలా

తిరుపతిలో భయోత్పాతం సృష్టించేందుకు ఎన్డీఏ కూటమి కుట్ర చేస్తోంది. చిత్తూరు, వేలూరు నుంచి రౌడీలను తీసుకొచ్చేశారు. 25మంది బయటిప్రాంతంవారు పోటీలో ఉండారంటే పరిస్థితి ఏంటో తెలియడంలేదు. సౌమ్యులుగా ఉన్న మా మీద ఏదో ఒక నెపం నెట్టే కుట్ర కూటమి చేస్తోంది.

- భూమన కరుణాకర రెడ్డి, ఎమ్మెల్యే

Updated Date - Apr 28 , 2024 | 01:38 AM