Share News

మళ్లీ మరమ్మతులకు గురైన గామన్‌ బ్రిడ్జి

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:07 AM

రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య ఎక్స్‌ప్రెస్‌ హైవేకు అనుసంధానంగా ఉన్న గామన్‌ బ్రిడ్జి నెల రోజుల వ్యవధిలో మరోసారి మరమ్మతులకు గురైంది.

మళ్లీ మరమ్మతులకు గురైన గామన్‌ బ్రిడ్జి
గామన్‌ బ్రిడ్జి

నేటి నుంచి పది రోజుల పాటు ఒక వైపే రాకపోకలు

గామన్‌ బ్రిడ్జి కొవ్వూరు, ఏప్రిల్‌ 25: రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య ఎక్స్‌ప్రెస్‌ హైవేకు అనుసంధానంగా ఉన్న గామన్‌ బ్రిడ్జి నెల రోజుల వ్యవధిలో మరోసారి మరమ్మతులకు గురైంది. మార్చి 24న గామన్‌బ్రిడ్జి 52వ స్తంభం వద్ద వంతెనకు యాక్షన్‌ ఇచ్చే బాల్‌ మరమ్మతులకు గురి కావడంతో వంతెనపై ఒకవైపు రాకపోకలను నిలుపుదల చేశారు. మరమ్మతులు పూర్తిచేసి సుమారు నెల రోజుల తరువాత ఏప్రిల్‌ 23న రెండువైపులా వాహన రాకపోకలను అనుమతించారు. అయితే ప్రస్తు తం రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వైపు వచ్చే మార్గంలో 28వ స్తంభం వద్ద అమర్చిన బేరింగ్‌లో ఎటువంటి ప్రేజర్‌ రావడం లేదని గుర్తించారు. దీంతో ఈ నెల 26 నుంచి మే 3వ తేదీ వరకు ఈ మార్గంలో వాహన రాకపోకలను నిలుపుదల చేస్తున్నట్టు సమాచారం. బేరింగ్‌ మార్పు చేయడానికి 10 రోజుల పాటు వంతెనపై ఒక మార్గంలోనే వాహన రాకపోకలకు అనుమతించనున్నారు. ఎటు వంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో నిర్మించిన వంతెనలు వందేళ్లకు పైగా సేవలందించాయి. ఆధునిక సాంకేతికతతో నిర్మించిన గామన్‌ వంతెనపై రాకపోకలు ప్రారంభించిన పదేళ్లకే మరమ్మతులకు గురి కావడంపై ప్రజలు ఆం దోళన చెందుతున్నారు. ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకులు దోచుకున్నదే హద్దుగా నిబంధనలను తుంగలో తొక్కి వంతెనల చెంతనే ఇసుక డ్రెడ్జింగ్‌ చేసి గోదావరి నదిని గుల్ల చేశారు. గోదావరి తీరం వెంబడి ఏటిగట్టును కొల్లగొట్టి ఏర్పాటుచేసిన ఇసుక ర్యాంపులు, ఇసుక తవ్వకాలు జరుగుతున్నా రెవె న్యూ, మైనింగ్‌, పోలీసు, ఎస్‌ఈబీ అధికారులు సైతం ఫిర్యాదుచేసిన వారిని, ఇసుక తవ్వకాలు, రవాణా అడ్డుకున్న వారిని అరెస్టులు చేశారు తప్ప ఇసుక అక్ర మ తవ్వకాలు, అనధికార డ్రెడ్జింగ్‌ను అరికట్టలేకపోయారు. దీని పర్యవసానమే గామన్‌బ్రిడ్జి మరమ్మతులకు కారణమని గోదావరి జిల్లా వాసులు వాపోతున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 12:07 AM