Share News

పంతాలకు పోతే శాంతిభద్రతలకు విఘాతం

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:12 AM

జిల్లాలో ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించమని, పంతాలకు పోతే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కే మాధవీలత, ఎస్పీ జగదీశ్‌ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం మిల్లు యాజమాన్య ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.

పంతాలకు పోతే శాంతిభద్రతలకు విఘాతం

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 25: జిల్లాలో ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించమని, పంతాలకు పోతే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కే మాధవీలత, ఎస్పీ జగదీశ్‌ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం మిల్లు యాజమాన్య ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇరువర్గాలు సంయమనంతో ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో సమ్మె నిర్ణయం అలాగే యాజమాన్యం లాకౌట్‌ ప్రకటనకు సంబంధించి బాధ్యులపై బైండోవర్‌ కేసులు నమోదుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. సమ్మె విరమణ, లాక్‌డౌన్‌ ఎత్తివేతపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 20-25 రోజుల్లో పేపరుమిల్లు కార్యకలాపాలు, ఉత్పత్తి యఽథాస్ధితికి చేరుకున్న వెంటనే కార్మిక సంఘాలతో వారి డిమాండ్ల పరిష్కారం కోసం యాజమాన్యం బేషరతుగా చర్చలకు పిలిచి నివేదిక అందజేయాలని ఆదేశించారు. కార్మికులు కూడా కంపెనీ ఉత్పత్తి సాధారణ స్థాయికి చేరుకునేలా తోడ్పాటు అందచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ఎస్పీ జగదీష్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. మిల్లు యాజమాన్యం లాకౌట్‌ ను ఎత్తివేయాలని, కార్మికులు విధులకు హాజరు కావాలని కోరారు. జాయింట్‌ కార్మిక కమిషనర్‌ ఏ.రాణి మాట్లాడుతూ పేపరుమిల్లు ఉత్పత్తి యథాస్థితికి చేరుకున్నాక కార్మికుల డిమాండ్లపై చర్చలకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో సహాయ లేబర్‌ కమిషనర్‌ ఏఎస్‌ఎల్‌ వల్లీ, డీఎస్పీ రామకృష్ణ, యాజమాన్య ప్రతినిధులు వి.శ్రీనివాస్‌, జి.గణేష్‌, ఎస్‌.విజయకుమార్‌, కార్మిక సంఘం ప్రతినిధులు, సీఐటీయూ నాయకులు టి.అరుణ్‌, ఎస్‌.వెంకటేశ్వరరావు, ఏజీటీయూసీ నాయకులు ఏ.సత్యనారాయణ, ఐఎన్‌టీయూసీ నాయకులు జేవై దాసు, స్టాప్‌ వర్కర్స్‌ సంఘం నుంచి కె.రాజేష్‌, బి.మురళీకృష్ణ పాల్గొన్నారు.

తెరుచుకున్న పేపరుమిల్లు

కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, లేబర్‌ కమిషనర్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో మిల్లు కార్మికులు, యాజమాన్య ప్రతినిధులు మధ్య సయోధ్య కుదరడంతో గురువారం రాత్రి 10 గంటల నుంచి మిల్లు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు, మిల్లు యాజమాన్య ప్రతినిధులు కలిసి జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Apr 26 , 2024 | 12:12 AM