Share News

కాలువలలేవీ అమాత్య?

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:50 PM

గత ఐదేళ్లలో పలాస-కాశీబుగ్గను గణనీయంగా అభివృద్ధి చేశామని మంత్రి అప్పలరాజు తరచూ గొప్పలు చెబుతుంటారు. కానీ, ఇక్కడ వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. ఇతర సౌకర్యాలు దేవుడెరుగా కనీసం మురుగు కాలువలు ఇక్కడ లేవు. జంట పట్టణాల్లోని ప్రతీ వీధిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి పలుచోట్ల కాలువలు పూర్తిగా కప్పబడిపోయాయి. ఐదేళ్లుగా మునిసిపాలిటీలో ఒక్కచోట కూడా కాలువ నిర్మించలేదు. దీంతో జనవాసాలు, రోడ్లపైకి మురుగునీరు చేరుతుంది.

కాలువలలేవీ అమాత్య?
కాశీబుగ్గ ఒడియా స్కూల్‌ వద్ద పిచ్చి మొక్కలతో నిండిన కాలువ :

గత ఐదేళ్లలో పలాస-కాశీబుగ్గను గణనీయంగా అభివృద్ధి చేశామని మంత్రి అప్పలరాజు తరచూ గొప్పలు చెబుతుంటారు. కానీ, ఇక్కడ వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. ఇతర సౌకర్యాలు దేవుడెరుగా కనీసం మురుగు కాలువలు ఇక్కడ లేవు. జంట పట్టణాల్లోని ప్రతీ వీధిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి పలుచోట్ల కాలువలు పూర్తిగా కప్పబడిపోయాయి. ఐదేళ్లుగా మునిసిపాలిటీలో ఒక్కచోట కూడా కాలువ నిర్మించలేదు. దీంతో జనవాసాలు, రోడ్లపైకి మురుగునీరు చేరుతుంది.

(కాశీబుగ్గ)

పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల జనాభా గణనీయంగా పెరుగుతోంది. చుట్టుపక్కల మండలాల నుంచి ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వస్తోన్న వారిలో చాలామంది ఇక్కడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పట్టణ శివారు విస్తరిస్తోంది. అయితే ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా మునిసిపాలిటీలో జనాభా అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. ముఖ్యంగా అనేక వార్డుల్లో మురుగు కాలువలు లేవు. దీంతో తరచూ రోడ్లపైకి మురుగు చేరుతుంది. పారిశుధ్య నిర్వహణను సమర్థంగా చేపట్టేందుకు మునిసిపల్‌ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. ప్రధానంగా కాశీబుగ్గ మూడురోడ్ల జంక్షన్‌, పోస్టాఫీసు వీధి, పాతబస్టాండ్‌, అక్కుపల్లి రోడ్డు, పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌, ఉదయపురం తదితర ప్రాంతాల్లో కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. పారిశుధ్య పనులు కూడా ప్రధాన ప్రాంతాలకే పరిమితమయ్యాయనే విమర్శలు ఉన్నా యి. శివారు ప్రాంతాలు, రోడ్లు అధ్వానంగా ఉన్న ప్రాంతాల్లో చెత్త తొలగించడంలేదని పట్టణ వాసులు వాపోతున్నారు.

వైసీపీ పాలకుల నిర్లక్ష్యం..

జిల్లాలో విస్తీర్ణపరంగా అతిపెద్ద బి-గ్రేడ్‌ మునిసిపాలిటీగా పలాస గుర్తింపు పొందింది. 2000 సంవత్సరంలో ఏర్పడిన ఈ మునిసిపాలిటీలో 31 వార్డులు ఉన్నాయి. 57,507 మంది జనాభా, 44 వేల ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకూ నాలుగు పాలకవర్గాలు ఏర్పడ్డాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణ నిధులు సైతం ప్రభుత్వ అవసరాలకు వినియోగించడం లేదు. ఆర్థిక సంఘం నిధులను మళ్లించడంతో కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. వీధుల్లో కనీస మౌలిక వసతులు మృగ్యమయ్యాయి. రోడ్ల విస్తరణతోపాటు కాలువలు నిర్మిస్తామని ఆర్భాటమే తప్ప ఆచరణలో కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెరిగిన పట్టణ అవసరాలకు తగ్గట్లుగా జంట పట్టణాల్లో వసతులు కొరవడ్డాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. నగరపంచాయతీగా ఉన్న సమయంలో నిర్మించిన కాలువలు, వసతులే నేటికీ కనిపిస్తున్నాయి. అప్పట్లో 20 వేల మంది జనాభా ఉండేవారు. కాలువలు కూడా అప్పటి అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు జనాభా పెరగడంతో మురుగు కాలువల సామర్థ్యం సరిపోవడంలేదు.

రోడ్ల విస్తరణ పేరుతో కాలయాపన..

జంట పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. పట్టణ ప్రజల అవసరాలకు తగ్గట్లుగా కాలువలు లేవు. ఐదేళ్లుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. రోడ్ల విస్తరణ పేరుతో కాలయాపన చేశారు. మునిసిపాలిటీ లో ఇతర సమస్యలను గాలికొదిలేశారు. కాశీబుగ్గ మూడురోడ్ల జంక్షన్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

-లొడగల కామేశ్వరరావు యాదవ్‌, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్రకటనలతో కాలం గడిపేశారు..

పేరుకే బి-గ్రేడ్‌ మునిసిపాలిటీ. కానీ ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతులు ఇక్కడ లేవు. పాలకులు మాత్రం ఆర్భాట ప్రకటనలతో కాలం గడిపేశారు. ప్రధానంగా కాలువలు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇళ్లలోకి వరద వచ్చేస్తుంది.

-సవర రాంబాబు, టీడీపీ జిల్లా పార్లమెంట్‌ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు

Updated Date - Apr 27 , 2024 | 11:50 PM