Share News

జగనన్నా.. ‘తీపి’ హామీ ఏమైంది?

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:55 PM

జిల్లాలో రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమదాలవలస నియోజకవర్గం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. ఐదేళ్లకోసారి ఎన్నికల వేళ నేతల హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ప్రధానంగా దశాబ్దాల చరిత్ర కలిగిన చక్కెర కర్మాగారం మూతపడడంతో రైతులకు, కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

జగనన్నా.. ‘తీపి’ హామీ ఏమైంది?
ఆమదాలవలసలో మూతపడిన చక్కెర కర్మాగారం.. ఇన్‌సెట్‌లో పాదయాత్ర సమయంలో చక్కెర ఫ్యాక్టరీపై హామీనిస్తున్న జగన్‌(ఫైల్‌)

- తెరచుకోని చక్కెర కర్మాగారం

- నేతల మాటలు.. ప్రకటనలకే పరిమితం

- సమస్యల వలయంలో ఆమదాలవలస

(ఆమదాలవలస)

‘ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని తెరిపించడం సాధ్యం కాదని చంద్రబాబు అంటున్నారు. నేను అధికారంలోకి వస్తే నెలరోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాను. రైతులు, కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపుతాను’.

- ఇదీ 2019లో పాదయాత్ర సమయంలో సీఎం జగన్‌ హామీ.

....................

వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే..

హామీ ఇచ్చి ఐదేళ్లు గడిచిపోయింది. వైసీపీ పాలనలో కనీసం చక్కెర కర్మాగారం ప్రస్తావన లేదు. స్వయాన సీఎం జగన్‌ ఇచ్చిన హామీ కూడా ప్రకటనకే పరిమితిమైందని రైతులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

....................

జిల్లాలో రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమదాలవలస నియోజకవర్గం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. ఐదేళ్లకోసారి ఎన్నికల వేళ నేతల హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ప్రధానంగా దశాబ్దాల చరిత్ర కలిగిన చక్కెర కర్మాగారం మూతపడడంతో రైతులకు, కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2019లో ఆమదాలవలసలో పాదయాత్ర చేపట్టిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కానీ, నేటికీ నీటమూటగానే మిగిలింది. తీపికబురు లాంటి ఆ హామీ చేదు జ్ఞాపకంగానే మిగిలిపోయిందని రైతులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలసలో 1961లో బొడ్డేపల్లి రాజగోపాలరావు హయాంలో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 74 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కర్మాగారంలో 1962-63లో ఉత్పత్తి ప్రారంభించారు. చెరకు రైతులతోపాటు సుమారు 700 మంది ఉద్యోగులు, కార్మికులకు ఉపాధి కల్పించారు. ఊహించని నష్టాల కారణంగా 2004లో కర్మాగారం మూతపడింది. అదే ఏడాది బెంగళూరులో ఓ ప్రైవేటు సంస్థకు కర్మాగారాన్ని విక్రయించారు. కొందరు షేర్‌హోల్డర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కర్మాగారాన్ని సహకార సంఘాలు నడిపించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో 2021 ఆగస్టులో అప్పటి కలెక్టర్‌ కర్మాగారంపై నివేదిక కూడా ప్రభుత్వానికి అందించారు. అయినా వైసీపీ ప్రభుత్వం మౌనం వహించి.. జగన్‌ పాదయాత్ర హామీని తుంగలో తొక్కారని రైతులు వాపోతున్నారు. కర్మాగారం పునఃప్రారంభిస్తే ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సంతకవిటి, సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, నరసన్నపేట, జలుమూరు, శ్రీకాకుళం, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, పాతపట్నం ఇలా 15 మండలాల రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

అంతటా.. సమస్యలే

ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని ఏవార్డులో చూసినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. 23వార్డుల్లోనూ తాగునీటి సమస్య నెలకొంది. సప్తపురాలు, చింతాడ, తిమ్మాపురం, పార్వతీశంపేట, జగ్గుశాస్ర్తులపేటలో కేవలం మూడు ట్యాంకర్లతో మూడు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేయడంతో మహిళల కష్టాలు వర్ణణాతీతం. అలాగే 20వార్డు వెంగళరావు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేక స్థానికులు ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి కాలువల ద్వారా మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో నిత్యం దుర్వాసన, దోమల బెడద భరించలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైతులకు కూడా సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. 2017లో అప్పటి సీఎం చంద్రబాబు.. వంశధార, నాగావళి నదుల అనుసంధానంతో జిల్లాలో సుమారు 60వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు 70శాతం పనులు పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నదుల అనుసంధానం పనులు నిలిచిపోయాయి.

- సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో వెన్నెలవలస, బొమ్మిక జలాశయాల ద్వారా గతంలో సుమారు 900 ఎకరాలకు సాగునీరు అందించేవారు. వైసీపీ పాలనలో జలాశయాల నిర్వహణ, అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదు. దీంతో మదుమలు, కాలువలు మూసుకుపోయాయి. రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

- టీడీపీ ప్రభుత్వ హయాంలో వంశధార నది నుంచి కుడి ప్రధాన కాలువ ఏర్పాటు చేసి ఐదు మండలాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఆమదాలవలస రైల్వేట్రాక్‌ క్రాసింగ్‌ నుంచి గేదెలవానిపేట వరకు సాగునీరు ప్రవహించడానికి వయోడెక్ట్‌ ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించిన కొద్దినెలల తర్వాత లీకులు ఏర్పడింది. దీంతో ఈ రోడ్డులో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

మినీ స్టేడియం అభివృద్ధి ఏదీ

జగ్గుశాస్ర్తులపేట వద్ద మినీ స్టేడియాన్ని టీడీపీ హయాంలో చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లా క్రికెట్‌ సంఘ ఆధ్వర్యంలో పోటీల నిర్వహణకుగానూ ఈ స్టేడియాన్ని భారీస్థాయిలో నిర్మిస్తామని వైసీపీ పాలకులు హామీ ఇచ్చారు. ఈ మేరకు నిర్మాణాలు తొలగించినా.. ఇప్పటివరకూ పనులు చేపట్టలేదని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు.

గుంతల రహదారిలో ప్రమాదాలెన్నో..

శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారి గుంతలమయంగా మారి.. నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా అటు మంత్రి ధర్మాన ప్రసాదరావు కానీ, ఇటు స్పీకర్‌ తమ్మినేని సీతారాం కానీ ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ హయాంలో ఈ రహదారి అభివృద్ధికి రూ.40కోట్లు మంజూరు చేయగా 25 శాతం పనులు చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నిలిచిపోయాయి.

రాజకీయ లబ్ధికే..

పాదయాత్ర సమయంలో జగన్మోహన్‌రెడ్డి ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తారని హామీనిచ్చి.. ఇప్పుడు మరిచిపోయారు. నేటికి ఐదేళ్లు కావస్తున్నా ఆ ఊసే లేదు. కేవలం రాజకీయ లబ్ధికోసం హామీనిచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి రైతులు బుద్ధి చెబుతారు.

- ఎండ అప్పలనాయుడు, రైతు, వంజంగి

......................

రైతులను మోసం చేశారు

2019 ఎన్నికల్లో రైతులకు హామీనిచ్చి వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. వైసీపీకి ఈ ఎన్నికల్లో రైతుల ఉసురు తగలడం ఖాయం.

- కొంగరాపు మల్లేశ్వరరావు, రైతు, సుభద్రాపురం, సరుబుజ్జిలి

..................................

ఆశ నిరాశే

చక్కెర కర్మాగారంలో 1962 సంవత్సరం నుంచి.. ఫ్యాక్టరీ అమ్మేసిన వరకు అకౌంట్‌ సెక్షన్‌లో విధులు నిర్వహించేవాడిని. రాజకీయ నాయకులు హామీలు ఇచ్చేటప్పుడు కర్మాగారం మళ్లీ తెరుచుకుంటుందని ఆశ పడతాం. కానీ హామీలు నెరవేరకపోవడంతో నిరాశే మిగులుతోంది.

- మెట్ట కొండయ్య, ఆమదాలవలస

..................................

జీవనోపాధి కరువైంది

కర్మాగారంలో దినసరి వేతనంతో మెకానిక్‌గా విధులు నిర్వహించేవాడిని. మూతపడడంతో జీవనోపాధి లేక.. కర్మాగారం తెరుస్తారని ఎదురుచూపులే మిగిలాయి.

- బగాన అమ్మినాయుడు, ఆమదాలవలస

Updated Date - Apr 26 , 2024 | 11:55 PM