Share News

ముగిసిన నామినేషన్ల స్వీకరణ

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:31 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలిఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గానికి, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈనెల 18 నుంచి నామినేషన్లు స్వీకరించారు.

ముగిసిన నామినేషన్ల స్వీకరణ
శ్రీకాకుళంలో నామినేషన్‌కు ర్యాలీగా వెళ్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు.. (ఇన్‌సెట్‌లో) మేకపిల్లతో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రామ్మోహన్‌నాయుడు, శంకర్‌

- శ్రీకాకుళం పార్లమెంట్‌కు 33

- 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు 175 పత్రాలు దాఖలు

- నేటి నుంచి పరిశీలన

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ శ్రీకాకుళం అర్బన్‌/ రణస్థలం, ఏప్రిల్‌ 25: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలిఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గానికి, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈనెల 18 నుంచి నామినేషన్లు స్వీకరించారు. శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గానికి 33 మంది నామినేషన్లు వచ్చాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 175 నామినేషన్లు పడ్డాయి. మొత్తంగా 208 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ రెండు లేదా మూడు సెట్లను సమర్పించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి.. శ్రీకాకుళంలో 25, ఎచ్చెర్లలో 20, ఇచ్ఛాపురంలో 13, నరసన్నపేటలో 20, పలాసలో 25, పాతపట్నంలో 24, టెక్కలిలో 17, ఆమదాలవలసలో 31 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా ఆమదాలవలస అసెంబ్లీ స్థానానికి.. అత్యల్పంగా ఇచ్ఛాపురం నియోజకవర్గానికి నామినేషన్లు వేశారు. శుక్రవారం నుంచి నామినేషన్‌ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. సాంకేతిక పరంగా ఉన్న ఇబ్బందులు.. పత్రాల సమర్పణలో ఉన్న లోపాలను అధికారులు పరిశీలించి అన్నీ సరిగ్గా ఉన్నవాటిని ఆమోదిస్తారు. పత్రాలు సరిపోలనివి తిరస్కరిస్తారు. నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు ఈనెల 29వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్‌ జరగనుండగా.. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

సందడే సందడి..

నామినేషన్లకు చివరిరోజు కావడంతో గురువారం సందడి నెలకొంది. శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌.. ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆధ్వర్యంలో సుమారు 30వేల మంది పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అభ్యర్థులపై కార్యకర్తలు పూలవర్షాన్ని కురిపించారు. కొంతమంది సైకిల్‌ను, చేపలను, మరికొంతమంది మేక పిల్లలను బహుకరించారు. ఏడురోడ్ల కూడలి నుంచి జిల్లాపరిషత్‌ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని.. ఆర్డీవోకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం మాజీ ఎంపీపీ జగపతి, టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, జనసేన నాయకుడు దానేటి శ్రీధర్‌, బీజేపీ నాయకులు, పాల్గొన్నారు. అలాగే రణస్థలంలో కూటమి అభ్యర్థిగా బీజేపీ తరుపున నడుకుదుటి ఈశ్వరరావు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు సుమారు 40వేల మంది పాల్గొని.. ర్యాలీగా తరలివెళ్లారు. కోష్ఠ నుంచి సుభద్రాపురం జంక్షన్‌ వరకు అభిమాన సంద్రం కనిపించింది. కార్యక్రమంలో విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, కూటమి నాయకులు ముప్పిడి సురేష్‌, కిమిడి నాగార్జున, డీజీఎం ఆనందరావు, లంక శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:31 PM