Share News

తాగించి.. ఊగించి.. ఊడ్చేశారు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:35 PM

వైసీపీ పాలనలో మద్యం విషయంలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేశాకే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్న జగన్‌.. ఆ విషయాన్ని విస్మరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది షాపులు తగ్గించినా.. తర్వాత రకరకాల పేర్లతో పెంచేశారు.

తాగించి.. ఊగించి.. ఊడ్చేశారు

- ఐదేళ్లలో రూ.6,383 కోట్ల మద్యం విక్రయాలు

- మద్య నిషేధంపై అటకెక్కిన జగన్‌ హామీ

- దశలవారీ దుకాణాల తగ్గింపు ఉత్తిమాటే

- వైసీపీ తీరుపై మండిపడుతున్న మహిళలు

(రణస్థలం)

మద్యం పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతూ.. గొడవలకు కారణమవుతోంది. నీరు లేని గ్రామాన్ని చూస్తున్నా కానీ.. బెల్ట్‌ దుకాణం లేని ఊరు లేదు. అందుకే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మద్య నిషేధం అమలు చేస్తా. నా అక్కాచెల్లెళ్ల కళ్లల్లో ఆనందం చూస్తా. నవరత్నాల్లో సంపూర్ణ మద్య నిషేధం పొందుపరిచా. మహిళలు నాకు అండగా నిలవండి. ఓట్లు వేసి గెలిపించండి. మీ కళ్లల్లో ఆనందం నింపే బాధ్యత నాది.

- ఇదీ విపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు, గత ఎన్నికల్లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హామీ.

==================================

మద్య నిషేధం విషయంలో మీకు హామీ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇప్పటికిప్పుడు హామీ అమలుచేయడం కష్టం. అందుకే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలుచేస్తా. ఏటా 25 శాతం షాపులను తగ్గించుకొని.. 2024 నాటికి సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులేస్తా. నేను ఇచ్చిన మాటను తప్పను. కచ్చితంగా నా హామీని అమలుచేస్తా. నన్ను నమ్మండి. మద్య నిషేధం అమలు చేశాకే ఓట్లు అడుగుతా..

- ఇదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధంపై సీఎం జగన్‌ ప్రకటన.

=================================

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే..

సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల్లో పొందుపరిచిన మద్యనిషేధం హామీ అమలుకాలేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్నడూ లేని విధంగా రూ.కోట్లలో మద్యం విక్రయాలు సాగాయి. నూతన విధానంలో భాగంగా ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేపట్టి.. మందుబాబులతో తాగించింది. కొత్త బ్రాండ్ల పేరిట నాసిరకం మద్యం విక్రయించి.. మందుబాబులను ఊగిస్తోంది. వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. గతం కన్నా విపరీతంగా ధరలు పెంచేసి.. మొత్తం మందుబాబుల సొమ్మంతా ఊడ్చేస్తోంది. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తోంది.

==============

వైసీపీ పాలనలో మద్యం విషయంలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేశాకే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్న జగన్‌.. ఆ విషయాన్ని విస్మరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది షాపులు తగ్గించినా.. తర్వాత రకరకాల పేర్లతో పెంచేశారు. ప్రస్తుత ఎన్నికల వేళ మరింత జోరుగా మద్యం విక్రయాలు చేపడుతున్నారు. ఐదేళ్లలో కేవలం జిల్లాలోనే రూ.6,383 కోట్లు మేర మద్యం విక్రయించారు. ఈ నేపథ్యంలో జగనన్నా.. ఇదేనా మద్యనిషేధం అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 235 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండేవి. టెండరు ప్రక్రియ ద్వారా లైసెన్స్‌ ఇచ్చి మద్యం షాపులకు అనుమతిచ్చేవారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పాలసీ అమలు చేసి.. ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయాలు చేపడుతోంది. జిల్లాలో 178 మద్యం దుకాణాలు ఏర్పాటు చేసింది. ఇందులో ఏటా 25 శాతం దుకాణాలను తగ్గిస్తామని జగన్‌ చెప్పారు. ఈ లెక్కన 44 షాపులు తగ్గాలి. కానీ ఇప్పుడు 193 షాపులు నడుస్తున్నాయి. ఉన్న షాపులను తగ్గించకపోగా.. కొత్తగా టూరిజం ఔట్‌ లెట్ల పేరుతో మరికొన్నింటిని ఏర్పాటు చేశారు. ఇక బార్లు 18వరకూ కొనసాగుతున్నాయి.

- అన్నింటా వసూళ్లు

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సేల్స్‌మెన్లు ఇద్దరు, సూపర్‌వైజరు ఒకరిని నియమించారు. వీరి నియామకం విషయంలో వైసీపీ నేతలకు కాసులు ముట్టాయన్న ఆరోపణలున్నాయి. ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలు కలిసి ఒక్కో పోస్టును రూ.30వేల నుంచి రూ.50 వేల వరకూ అమ్ముకున్నట్టు బాధితులే ఆరోపించారు. ఇటీవల బదిలీల్లో కూడా భారీగా నగదు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపించాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ సమగ్ర కథనం రాయడంతో అవినీతి అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. షాపుల అద్దెల విషయంలో సైతం వైసీపీ నేతలు భారీగా సొమ్ము వెనుకేసుకున్నారు. ప్రతీ దుకాణం నుంచి అధికారులు కార్యాలయాల నిర్వహణ పేరుతో రూ.2వేల నుంచి రూ.3వేల వరకూ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గ్రామాల్లో బెల్టు దుకాణాలకు సరుకు పక్కదారి పట్టించడం, నకిలీ మద్యం విక్రయించడం వంటి వాటి విషయంలో కొందరు అధికారులు సిబ్బందిని సైతం తప్పుదోవ పట్టించినట్టు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబరులో కోటబొమ్మాళి ప్రభుత్వ మద్యం దుకాణంలో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలో ఏకంగా 1000 వరకూ కల్తీ మద్యం సీసాలు పట్టుబడ్డాయి.

- వేల కోట్ల ఆదాయం

మద్యం ధరలు పెంచి ప్రభుత్వం సొమ్ము చేసుకుంది. షాక్‌ కొట్టించేలా ధరలు ఉంటే మందుబాబులు అటువైపు చూడడం మానేస్తారని సీఎం జగన్‌ ప్రకటించారు. కానీ జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా ఐదేళ్లలో రూ.6,383 కోట్లు ఆదాయం రావడం గమనార్హం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1027కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,080 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1345 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,421కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,510 కోట్ల ఆదాయం సమకూరింది.

- సముద్ర మార్గంలో సారా, మద్యం

అక్రమ మద్యం, సారా గురించి చెప్పనవసరం లేదు. చివరకు పొరుగు జిల్లాల మద్యాన్ని తెచ్చి చలామణి చేశారు. పట్టణాల్లో సైతం సారా ప్రవాహం అధికమైంది. 2022 జనవరి 26న కవిటి మండలం కొత్తపాలెం తీరంలో పడవలపై తెస్తున్న 6000 సారా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని నువగాం నుంచి సముద్ర మార్గంలో బోట్లపై తెస్తుండగా.. ముందస్తు సమాచారం అందుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు పోలీస్‌ శాఖ సాయంతో పట్టుకున్నారు. అలాగే 2022 డిసెంబరు 3న రణస్థలం మండలం దన్నానపేట జాతీయ రహదారిపై 3 వేల మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ లేబుళ్లతో ఒడిశా నుంచి విజయనగరం వ్యాన్‌లో తరలిస్తుండగా ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదంతా నకిలీ మద్యంగా తేలింది. కానీ ఎందుకో ఆ కేసు వివరాలు మళ్లీ బయటకు రాలేదు. ఇలా ఎక్కడికక్కడ సారా, మద్యం విక్రయాలు జోరుగా సాగుతుండడంతో వైసీపీ పాలన తీరుపై మహిళలు మండిపడుతున్నారు. మద్య నిషేధం హామీ అటకెక్కినట్టేనని ఆరోపిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.

---------------

చాలా అన్యాయం

మద్య నిషేధం విషయంలో సీఎం జగన్‌ మహిళలను దారుణంగా వంచించారు. పాదయాత్ర చేసినప్పుడు, గత ఎన్నికల ప్రచారంలో మొసలి కన్నీరుకార్చారు. పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్న మద్యాన్ని నిషేధిస్తామని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. నాసిరకం మద్యంతో చాలామంది ప్రాణాలను తీశారు. ధరలు పెంచి సామాన్య కుటుంబాల్లో ఆర్థిక భారం పెంచారు.

- నడుకుదిటి రజిని, సర్పంచ్‌, బంటుపల్లి

................................

బుద్ధి చెబుతారు

జగన్‌ సంపూర్ణ మద్య నిషేధం చేస్తారని నమ్మాం. కానీ హామీ ఇచ్చి ఆయన మోసం చేశారు. మహిళలే కదా..అన్ని మరిచిపోతారని భావిస్తున్నారు. కానీ జరిగిన అన్యాయం మహిళలందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో వైసీపీకి తప్పకుండా ఓటుతో బుద్ధి చెబుతారు.

- ముప్పిడి సుజాత, రాష్ట్ర తెలుగు మహిళ కార్యదర్శి

Updated Date - Apr 25 , 2024 | 11:35 PM