Share News

జేఈఈ మెయిన్స్‌లో సిక్కోలు సత్తా

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:33 PM

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో సిక్కోలు కుర్రోడు సత్తా చాటాడు. జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్‌కుమార్‌.. జాతీయస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు.

జేఈఈ మెయిన్స్‌లో సిక్కోలు సత్తా

- 8వ ర్యాంకు సాధించిన సతీష్‌

జలుమూరు, ఏప్రిల్‌ 25: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో సిక్కోలు కుర్రోడు సత్తా చాటాడు. జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్‌కుమార్‌.. జాతీయస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. ఓబీసీలో రెండో ర్యాంకు పొందాడు. సతీష్‌ తల్లిదండ్రులు చింతు బుచ్చెన్న, రమాదేవి ఇద్దరూ ఉపాధ్యాయులే. వీరు ప్రస్తుతం పాలకొండలో నివాసం ఉంటున్నారు. సతీష్‌ పదోతరగతి వరకూ పాలకొండలోనే చదివాడు. వైజాగ్‌లోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేశాడు. జేఈఈ మెయిన్స్‌లో 8వ ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులతోపాటు గ్రామస్థులు సతీష్‌ను అభినందించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు కావడమే తన లక్ష్యమని సతీష్‌ కుమార్‌ తెలిపారు.

సాహితికి 508వ ర్యాంకు

నగిరికటకం గ్రామానికి చెందిన భేరి సాహితి ఐఐటీ జేఈఈ మెయిన్స్‌ జాతీయ స్థాయిలో 508వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 84వ ర్యాంకు సాధించింది. 10వ తరగతి వరకు గరివిడిలోని ఓ ప్రైవేటు స్కూలు, ఇంటర్మీడియెట్‌ విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదివింది. తండ్రి భేరి వెంకటరావు విజయవాడ అగ్నిమాపక కేంద్రంలో హెచ్‌సీగా, తల్లి అరుణ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరంతా ప్రస్తుతం విజయవాడలో నివాసం ఉంటున్నారు. సాహితీని గ్రామస్థులు అభినందించారు.

తనూజ్‌కు 815వ ర్యాంకు

గుజరాతీపేట: శ్రీకాకుళం పట్టణానికి చెందిన శిల్లా తనూజ్‌ 815వ ర్యాంకు సాధించాడు. పట్టణంలోని కోమటివీధికి చెందిన తనూజ్‌ తండ్రి ఎస్‌.రవికుమార్‌ మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నారు. తనూజ్‌ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతూ.. జేఈఈ మెయిన్స్‌కు కోచింగ్‌ తీసుకున్నాడు. అలాగే జిల్లాకు చెందిన మరికొందరు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. ఎం.మణికంఠ పృధ్వీరాజ్‌ 92వ ర్యాంకు, అల్లు రామలింగం నాయుడు 657 ర్యాంకుతో ప్రతిభను కనబరిచారు.

Updated Date - Apr 25 , 2024 | 11:33 PM