Share News

మమ్మల్నే ఎదిరిస్తార్రా?

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:52 PM

జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలు అధికార దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు, కూటమి సానుభూతిపరులపై భౌతికదాడులకు పాల్పడుతున్నారు. బాధితులు ఎవరైనా ప్రశ్నిస్తే.. మమ్మల్నే ఎదిరిస్తార్రా? అంటూ వారిపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు.

మమ్మల్నే ఎదిరిస్తార్రా?
గాయపడిన సత్తమ్మ, నూకయ్య

- కూటమి సానుభూతిపరులపై వైసీపీ నేతల దాష్టీకం

- మత్స్యకార గ్రామాల్లో దాడులకు తెగబడుతున్న వైనం

- పొరుగు గ్రామాలకు వెళ్లిపోతున్న బాధితులు

- తిరిగి బాధితులపైనే కేసులు

(రణస్థలం)

- రణస్థలం మండలం ఎన్‌జీఆర్‌పురం పంచాయతీ చీకటిపేటలో మూడు రోజుల కిందట కొమర నూకయ్య ఇంటిపై రాళ్లదాడి జరిగింది. ఇంట్లో సామాన్లు, తలుపులు ధ్వంసం చేశారు. దీంతో నూకయ్యతోపాటు ఆయన భార్య సత్తమ్మ గాయపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో టీడీపీ, జనసేన సానుభూతిపరులు ఆరుగురిపై, వైసీపీకి చెందిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు.

....................

జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలు అధికార దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు, కూటమి సానుభూతిపరులపై భౌతికదాడులకు పాల్పడుతున్నారు. బాధితులు ఎవరైనా ప్రశ్నిస్తే.. మమ్మల్నే ఎదిరిస్తార్రా? అంటూ వారిపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. తిరిగి వారిపైనే కేసులు నమోదు చేసేలా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా రణస్థలం మండలం ఎన్‌జీఆర్‌ పురం పంచాయతీ పరిధిలోని ఈ ఘటన వెలుగు చూడడం చర్చనీయాంశమవుతోంది. ఎన్‌జీఆర్‌పురం పంచాయతీ పరిధిలో చీకటిపేట, గురయ్యపేట, పాతయ్యపేట తదితర మత్స్యకార గ్రామాలున్నాయి. ఇక్కడ టీడీపీ, జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. సుమారు 1,450 మంది ఓటర్లు ఉండగా.. స్థానికంగా సరైన నాయకత్వం లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ సారి పొత్తులో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో కూటమి తరపున బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు ఎన్నికల ప్రచారానికి.. పార్టీ కార్యక్రమాలకు ఈ పంచాయతీ నుంచి జనసేన, టీడీపీ సానుభూతిపరులు హాజరవుతున్నారు. ఇటువంటి వారిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడుతూ.. భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. బాధితులు ప్రశ్నిస్తే.. మమ్మల్నే ఎదిరిస్తార్రా? అంటూ తిట్ల దండకాన్ని అందుకుంటున్నారు. దీంతో చాలా కుటుంబాలు పంచాయతీని విడిచిపెట్టి వేరే గ్రామాల్లో తలదాచుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పోలీసుపికెట్‌ ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. కాగా.. ఇక్కడ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాయి. దీనిపై ఎన్నికల కమిషన్‌కు, బీజేపీ అగ్రనాయకత్వానికి ఫిర్యాదు చేయనున్నట్టు కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. కలెక్టర్‌ తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 26 , 2024 | 11:52 PM