Share News

ఈ రెండు వారాలు.. కీలకం

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:49 PM

‘సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రానున్న రెండు వారాలూ అత్యంత కీలకం. నిబంధనల మేరకు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి. అధికారులంతా మరింత సమన్వయంతో పనిచేయాలి’ అని ఎన్నికల పరిశీలకుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శేఖర్‌ విద్యార్థి ఆదేశించారు.

ఈ రెండు వారాలు.. కీలకం
మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకులు

- అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి

- ఎన్నికల పరిశీలకుడు శేఖర్‌ విద్యార్థి

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 27: ‘సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రానున్న రెండు వారాలూ అత్యంత కీలకం. నిబంధనల మేరకు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి. అధికారులంతా మరింత సమన్వయంతో పనిచేయాలి’ అని ఎన్నికల పరిశీలకుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శేఖర్‌ విద్యార్థి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌, ఎస్పీ జీఆర్‌ రాధిక, ఎన్నికల పరిశీలకులతో కలిసి నోడల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి.. పోలింగ్‌ శాతం పెంచేలా కృషి చేయాలన్నారు. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో జాగ్రత్త వహించాలని తెలిపారు. ఒడిశా నుంచి అక్రమ మద్యం రవాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ మాట్లాడుతూ.. ఓటింగ్‌ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లను వివరించారు. పోలింగ్‌ కోసం 569 వాహనాలను సమకూర్చినట్లు తెలిపారు. ఎస్పీ జీఆర్‌ రాధిక మాట్లాడుతూ.. జిల్లాలో పటిష్ఠ బందోబస్తు అమలు చేస్తున్నామని తెలిపారు. 520 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు. ఇప్పటివరకూ రూ.4.32కోట్ల విలువైన మద్యం, బంగారం, గంజాయి సీజ్‌ చేశామని తెలిపారు. ఎన్నికల పరిశీలకులు సందీప్‌కుమార్‌, పర్వేజ్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ ఓటర్ల స్లిప్పులను పూర్తి వివరాలతో శతశాతం పంపిణీ చేస్తే.. పోలింగ్‌ శాతం పెరుగుతుందని తెలిపారు. పోలీసు పరిశీలకుడు సచింద్ర పటేల్‌ మాట్లాడుతూ శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జేసీ ఎం.నవీన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఏఎస్పీ ప్రేమ్‌కాజల్‌, డీఆర్వో ఎం.గణపతిరావు, ఆర్వోలు సీహెచ్‌ రంగయ్య, నూరుల్‌కమర్‌, భరత్‌నాయక్‌, లక్ష్మణమూర్తి, రామ్మోహన్‌, సుదర్శనదొర, అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:49 PM