Share News

Delhi: పెళ్లంటే పాటలు, డ్యాన్స్‌లు కాదు సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తేనే

ABN , Publish Date - May 02 , 2024 | 03:52 AM

హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే సముచిత ఆచార వ్యవహారాల మధ్య వివాహ క్రతువు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Delhi: పెళ్లంటే పాటలు, డ్యాన్స్‌లు కాదు  సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తేనే

  • హిందూ వివాహం చెల్లుబాటు

  • రిజిస్ట్రేషన్‌ రుజువు మాత్రమే చట్టబద్ధం కాదు: సుప్రీం కోర్టు

  • రిజిస్ట్రేషన్‌ రుజువు మాత్రమే.. చట్టబద్ధం కాదు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, మే 1: హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే సముచిత ఆచార వ్యవహారాల మధ్య వివాహ క్రతువు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహాన్ని పవిత్ర మతపరమైన తంతుగా అభివర్ణించింది. సప్తపది (పవిత్ర అగ్నిగుండం చుట్టూ 7 అడుగులు) ప్రాధాన్యాన్ని ప్రస్తావించింది. భవిష్యత్తులో వచ్చే వివాదాల సమయంలో ఇటువంటివి రుజువుగానూ ఉంటాయని పేర్కొంది. అంతేకానీ ఆటపాటలు.. విందు భోజనాల కోసం నిర్వహించే కార్యక్రమం పెళ్లి కాదని జస్టిస్‌ బీవీ నాగరత్నం నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.


సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోని ఓ యువ జంట.. విడాకుల కోసం ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ‘హిందూ వివాహం ఓ సంస్కారం.. పవిత్రమైన మతకర్మ. భారతీయ సమాజంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహమంటే ఆటపాటలు, విందువినోదాలు, కట్నకానుకలు ఇచ్చిపుచ్చుకునే సందర్భమో.. వాణిజ్యపరమైన లావీదేవీనో అస్సలు కాదు. ఇది కుటుంబ వ్యవస్థకు ఓ గంభీరమైన పునాది కార్యక్రమం’ అని వ్యాఖ్యానించింది. ‘హిందూ వివాహ చట్టం-1952లోని సెక్షన్‌ 8 ప్రకారం వివాహాన్ని నమోదు చేయడం వల్ల రుజువు లభిస్తుంది. అయితే సెక్షన్‌ 7 మేరకు ఆచార సంప్రదాయాలతో వివాహం నిర్వహించకపోతే చట్టబద్ధత లభించదు’ అని కోర్టు స్పష్టం చేసింది.

Updated Date - May 02 , 2024 | 03:52 AM