Share News

దైవమార్గం నమ్మకం చేసిన అద్భుతం

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:07 AM

కపెర్నహూము అనే ప్రాంతానికి ప్రధాన అధికారిగా ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు. అనారోగ్యంతో మంచం పట్టిన ఆ బాలుడు చావు బతుకుల్లో ఉన్నాడు.

దైవమార్గం నమ్మకం చేసిన అద్భుతం

ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం కనిపించలేదు. ఇంతలో... గెలెలియా తీరానికి ఏసు ప్రభువు వచ్చాడని ఆ అదికారికి తెలిసింది. ఉదయాన్నే ప్రభువును దర్శించుకున్నాడు. తన కుమారుడి దుస్థితి గురించి వివరించాడు. అతన్ని బతికించడానికి తన ఇంటికి రమ్మని వేడుకున్నాడు.


ఇది చూసి అక్కడ జనంలో గుసగుసలు బయలుదేరాయి. ‘ఏసు చేసిన మహత్కార్యాలేవీ చూడకుండానే అతన్ని తన ఇంటికి వచ్చి, తన కుమారుణ్ణి బతికించాలని ఈ అధికారి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? ఈ నమ్మకం ఎలా కలిగింది?’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అవన్నీ విన్న ఆ అధికారి ‘‘ప్రభువా! నీ శక్తిని నమ్ముతున్నాను.

నా బిడ్డ ప్రాణాలు పోవడానికి ముందే వచ్చి కాపాడండి’’ అని కోరాడు. అతను ప్రార్థనలో పరితాపాన్ని, తన పట్ల విశ్వాసాన్ని ఏసు గ్రహించాడు. ‘‘ఇక నువ్వు బయలుదేరు. ఈ రోజు ఒంటిగంటకల్లా నీ కుమారుడికి స్వస్థత కలుగుతుంది. అతను బతుకుతాడు’’ అని చెప్పాడు. అలా... తాను ఉన్న ప్రదేశం నుంచే జరగబోయే అద్భుతాన్ని ప్రభువు ప్రకటించాడు.


ప్రభువు సంకల్పిస్తే తన కుమారుడికి తప్పకుండా నయం అవుతుందనే ధైర్యంతో ఆ అధికారి ఇంటికి తిరుగుముఖం పట్టాడు. మార్గమధ్యంలో భటులు అతనికి ఎదురొచ్చి ‘‘అయ్యా! ఎలా జరిగిందో తెలీదు కానీ.. మీ అబ్బాయి పరిపూర్ణంగా కోలుకున్నాడు’’ అనే శుభవార్త అందజేశారు.

‘ఇది అద్భుతం. క్రీస్తు చేసిన అద్భుతం’ అనుకుంటూ ఆ అధికారి ఆనందంతో తన ఇంటివైపు పరుగులు పెట్టాడు. నమ్మకం ఎన్నడూ వమ్ముకాదనడానికి ఈ కథ ఉదాహరణ.

ఇది ఏసు ప్రభువు చేసిన రెండో అద్భుతం. నిజానికి ఆయన జీవితం ఇహలోకంలోనే ఒక మహాద్భుతం. అది దైవ, మానవ స్వభావాల సమ్మేళనం. ఈ అద్భుతాలన్నీ ఆయన దైవకుమారుడనే నిరూపణకు దోహదం చేశాయి.

డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు, 9866755024

Updated Date - Apr 26 , 2024 | 12:07 AM