Share News

కాలేయం కులాసాగా..

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:35 PM

కాలేయానికి సంబంధించిన సమస్య కామెర్లు అనే విషయం మనందరికీ తెలుసు. లక్షణాలను బట్టి కామెర్లను కనిపెట్టేసి, కొద్ది రోజుల పాటు జాగ్రత్తలు పాటించి నయమైపోయిందని అనుకుంటూ ఉంటాం. కానీ ఎన్నో రకాల కాలేయ వ్యాధులు కామెర్ల రూపంలోనే బయల్పడుతూ ఉంటాయి.

కాలేయం కులాసాగా..

సమతులాహారం, వ్యాయామం... ఇవి రెండూ కాలేయానికి ప్రాణ

స్నేహితులు. ఈ రెండింటి మీదా దృష్టి పెడితే కాలేయాన్ని దెబ్బతీసే ఫ్యాటీ లివర్‌, లివర్‌ కేన్సర్‌ లాంటి

శత్రువులు దరి చేరకుండా ఉంటాయంటున్నారు వైద్యులు.

ఈ లక్షణాలు గమనించాలి

తొలి దశలో

  • కళ్లు, చర్మం, మూత్రం

  • పచ్చబడడం

  • తల తిరగడం ఫ వాంతులు

  • ఆకలి మందగించడం

  • దురదలు ఫ నీరసం

  • తీవ్ర దశలో...

  • ఏకాగ్రత లోపించడం

  • ఆకలి లేకపోవడం

  • నీరసించిపోవడం

  • కాళ్లు, పొట్ట వాపు ఫ మైకం

  • మానసిక అసతులనం

  • కండరాల క్షీణత

కాలేయానికి సంబంధించిన సమస్య కామెర్లు అనే విషయం మనందరికీ తెలుసు. లక్షణాలను బట్టి కామెర్లను కనిపెట్టేసి, కొద్ది రోజుల పాటు జాగ్రత్తలు పాటించి నయమైపోయిందని అనుకుంటూ ఉంటాం. కానీ ఎన్నో రకాల కాలేయ వ్యాధులు కామెర్ల రూపంలోనే బయల్పడుతూ ఉంటాయి. కాబట్టి మూల కారణాన్ని కనిపెట్డడం అవసరం. ప్రధానంగా రెండు రకాల వైర్‌సల మూలంగా కామెర్లు వస్తూ ఉంటాయి. కలుషితాహారంతో సోకే హెపటైటిస్‌ ‘ఎ’వైరస్‌ పిల్లలకు సోకితే, హెపటైటిస్‌ ‘ఇ’ వైరస్‌ పెద్దలకు సోకుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల మందుల వల్ల కూడా కాలేయం దెబ్బతిని, కామెర్ల రూపంలో సమస్య బయల్పడుతూ ఉంటుంది. ఫైబ్రోసిస్‌ లేదా స్కార్‌ టిష్యూ కలిగి ఉన్న కాలేయ సమస్య క్రానిక్‌ హెపటైటిస్‌. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది సిర్రోసి్‌సగా మారి, అంతిమంగా లివర్‌ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంది. కాలేయ కేన్సర్‌ కూడా కామెర్లతోనే బయటపడుతుంది. కాబట్టి కామెర్లకు మూల కారణాన్ని కనిపెట్టి, తదనుగుణ చికిత్స తీసుకోవడం అవసరం.

  • అపోహలు వీడాలి

కామెర్లు సోకితే పత్యం ఉంటూ ఉంటాం. కానీ నిజానికి జబ్బుపడిన కాలేయం త్వరగా కోలుకోవడం కోసం బలవర్థకమైన ఆహారం తీసుకోవడం అవసరం. కామెర్లు సోకినప్పుడు గ్లూకోజ్‌, చెరకు రసం, నూనె, ఉప్పు, కారం లేకుండా వండిన పదార్థాలు, పెరుగన్నం తీసుకుంటూ ఉంటాం. కానీ ఈ సమయంలో ఎక్కువ క్యాలరీలుండే ఆహారం తీసుకోవాలి. కామెర్లు సోకిన వాళ్లందరూ ఇంట్లో వండిన, సాధారణ వంటకాలన్నింటినీ తినవచ్చు.

ప్రధానంగా మాంసాహారానికి బదులుగా శాకాహారం తీసుకోవాలి. మాంసాహారం తేలికగా అరగదు కాబట్టి కాలేయం మీద అదనపు భారం పడకుండా ఉండడం కోసం సమస్య అదుపులోకొచ్చేవరకూ మాంసాహారానికి దూరంగా ఉండాలి.

  • తీవ్ర కాలేయ సమస్యలో...

క్రానిక్‌ లివర్‌ డిసీజ్‌ మొదటి దశలో, స్కార్‌ ఏర్పడినా కాలేయం సమర్థంగానే పని చేస్తూ ఉండవచ్చు. రెండో దశలో కాలేయం పనిచేయడం మందగించే స్థితికి చేరుకుంటుంది. ఈ దశలో పొట్ట వాపు ఉంటుంది.

నిస్సత్తువ కూడా వేధిస్తుంది. ఆకలి కూడా తగ్గుతుంది. చివరి దశలో కాలేయం పని చేయడం మానేస్తుంది. పొట్ట, కాళ్లు వాపు, మైకం, చిగుళ్ల నుంచి రక్తస్రావం లాంటి లక్షణాలు ఈ దశలో ఉంటాయి. లివర్‌ ఫెయిల్యూర్‌ దశకు చేరుకున్న వాళ్లకు కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారం. కాబట్టి కాలేయ సమస్యను తొలి దశలోనే కనిపెట్టి సమర్థమైన చికిత్స తీసుకోవాలి.

కాలేయ కేన్సర్‌ సమస్య క్రమేపీ పెరుగుతోంది. ఇంతకు ముందు హెపటైటిస్‌ ‘బి’ వల్ల కేన్సర్‌ తలెత్తితే, ప్రస్తుతం ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ కారణంగా కేన్సర్‌ బారిన పడుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. అలా్ట్రసౌండ్‌ స్కాన్‌ చేసుకున్న వాళ్లలో ఎక్కువ మందికి ఫ్యాటీ లివర్‌ ఉంటూ ఉంటుంది.

కాబట్టి ఇదంత పట్టించకోవలసిన విషయం కాదనే ఒక ధోరణి సర్వత్రా పెరిగిపోయింది. దాంతో ఆ సమస్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఇదే సమస్య అంతిమంగా కాలేయ కేన్సర్‌కు దారి తీస్తుందనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి.

మెటబాలిక్‌ సిండ్రోమ్‌, మధుమేహం, డిస్‌లిపిడీమియా, హైపర్‌గ్లిసరైడీమియా, అధిక రక్తపోటు, ఒబీసిటీ, విల్సన్స్‌ డిసీజ్‌... ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాలు. కాబట్టి ఫ్యాటీ లివర్‌ కేన్సర్‌కు దారి తీయకుండా ఉండాలంటే, అందుకు మూల కారణాలను సరిదిద్దుకోవాలి.

  • బరువు తగ్గాలి

అధిక బరువును ఆహార నియమాలతో, వ్యాయామంతో తగ్గించుకోవాలి. అయితే బరువు తగ్గడం కోసం నచ్చిన డైట్‌లను అనుసరించేవాళ్లు ఉంటారు. కొందరు ఫ్రూట్‌ డైట్‌, మిల్లెట్‌ డైట్‌, ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌, కీటో, పాలియో... ఇలాంటి డైట్లను దీర్ఘకాలం పాటు కొనసాగించడం కష్టం.

కాబట్టి వీటికి బదులుగా హైపో క్యాలరిక్‌ డైట్‌ (శరీరం ఖర్చు చేసే క్యాలరీ కంటే, తక్కువ క్యాలరీలున్న ఆహారం) అనుసరించాలి.

ఉదాహరణకు 10 నుంచి 15ు అదనపు బరువు ఉన్నవాళ్లు, రోజులో తీసుకునే ఆహారంలో 300 నుంచి 500 కిలోక్యాలరీలను తగ్గించుకోవాలి. అలాగే ఎవరు, ఎంత సమయం పాటు వ్యాయామం చేయాలనేది వాళ్ల వయసు, గుండె గరిష్ఠ వేగం మీద ఆధారపడి ఉంటుంది. వారంలో 150 నుంచి 180 నిమిషాల పాటు కార్డియో వ్యాయామాలు చేయాలి. 50 నుంచి 75 నిమిషాల పాటు రెసిస్టెన్స్‌ ట్రైనింగ్‌ చేయాలి. అలాగే అధిక బరువును నెమ్మదిగా, స్థిరంగా తగ్గించుకోవాలి.

కాలేయంలో స్కార్‌ టిష్యూ ఉన్నవాళ్లు శరీర మొత్తం బరువులో 10ు బరువును తగ్గించుకోవాలి. ఉదాహరణకు 100 కిలోల బరువున్నవాళ్లు, ఆరు నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో పది కిలోల బరువు తగ్గడం లక్ష్యంగా పెట్టుకోవాలి.


  • నాటు మందులు వద్దు

కామెర్లకు నాటుమందులు వాడడం ప్రమాదకరం. వాటిలోని హెవీ మెటల్స్‌ కాలేయానికి కీడు చేసి, సమస్యను తీవ్రతరం చేస్తాయి. నాటుమందులు తీసుకోవడం వల్ల ప్రయోజనం లేకపోగా, కాలేయం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నాటు మందుల జోలికి వెళ్లకుండా అవసరాన్ని బట్టి వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి. ఒకవేళ పదే పదే కామెర్లు వేధిస్తున్నా, నిస్సత్తువ, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నా కాలేయ వ్యాధిగా పరిగణించి, వైద్యులను ఆశ్రయించాలి.

  • సప్లిమెంట్లు వద్దు

ఏం తిన్నా కాలేయానికి చేరుతుంది. కాబట్టి అదనపు హెల్త్‌ సప్లిమెంట్లు, ప్రొటీన్‌ పౌడర్ల వాడకం మానేయాలి. వైద్యులు సూచించనిదే ఎలాంటి సొంత వైద్యం చేసుకోకూడదు. శరీర బరువు తగ్గించుకోవాలన్నా, పెంచుకోవాలన్నా ఆ ఫలితం ఆహారం ద్వారా దక్కేలా చూసుకోవాలి.

శరీర బరువులో ప్రతి కిలోకు 20 నుంచి 30 కిలోక్యాలరీల చొప్పున లెక్కించి, సరిపడా క్యాలరీలున్న ఆహారం తీసుకోవాలి. అలాగే ఒక కిలో శరీర బరువుకు ఒకటి నుంచి ఒకటిన్నర గ్రాము ప్రొటీన్‌ అందేలా చూసుకోవాలి. అలాగే ఉప్పు, రోజుకు 4 నుంచి 5 గ్రాములకు మించకుండా చూసుకోవాలి.

Updated Date - Apr 29 , 2024 | 11:35 PM