Share News

నమామి దేవి నర్మదే!

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:28 AM

సృష్టిలోని ప్రతి జీవికి నీరే ఆధారం. అందుకే ‘ఆపోమయః ప్రాణః’ అన్నారు పూర్వులు. ‘ప్రాణం జలమయం’ అన్నది ఛాందగ్యోపనిషత్తు. అటువంటి ప్రాణదాయకమైన నీటితో ప్రవహించేవి నదులు. అందుకే భారతీయ సంస్కృతిలో నదులను మాతృస్వరూపాలుగా భావిస్తారు.

నమామి దేవి నర్మదే!

నమామి దేవి నర్మదే!

నర్మదానదిని ‘రేవా నది’ అని కూడా వ్యవహరిస్తారు. పుష్కర నదుల్లో నర్మద ప్రత్యేకమైనది. ఇది రుద్రసంభవ... అంటే

సాక్షాత్తూ శివుని శరీరం నుంచి ఆవిర్భవించింది. నామృతా నర్మదా అంటారు. అంటే మృతము లేనిది, శాశ్వతమైనది

అని అర్థం.

మే ఒకటి నుంచి నర్మదా పుష్కరాలు

సృష్టిలోని ప్రతి జీవికి నీరే ఆధారం. అందుకే ‘ఆపోమయః ప్రాణః’ అన్నారు పూర్వులు. ‘ప్రాణం జలమయం’ అన్నది ఛాందగ్యోపనిషత్తు. అటువంటి ప్రాణదాయకమైన నీటితో ప్రవహించేవి నదులు. అందుకే భారతీయ సంస్కృతిలో నదులను మాతృస్వరూపాలుగా భావిస్తారు.

మనిషి మనుగడ కూడా నదీతీరాల్లోనే మొదలయింది. ఎన్నో నదులు మన దేశానికి జీవనరేఖలుగా... నిరంతరం ప్రవహిస్తున్నాయి. పాడి పంటలకు దోహదం చేస్తూ ఆహారాన్నీ, ఆరోగ్యాన్నీ, దేహశుద్ధినీ, ఆధ్యాత్మికంగా అంతిమ ఆకాంక్ష అయిన ముక్తినీ ప్రసాదిస్తున్నాయి.

అటువంటి వాటిలో కొన్ని నదులు పుష్కర సమయంలో మరింత పవిత్రమవుతాయనీ, పాపాలను హరిస్తాయనీ, ఓషధీ గుణాలతో నిండి రోగ నివారకాలు అవుతాయనీ తరతరాలుగా విశ్వాసం ఉంది.

పుష్కరం అంటే పవిత్ర సమయం. ఒక్కో నదికి ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ సమయంలో చేసే నిత్య, నైమిత్తిక కర్మలు, స్నానాలు, దానాలు, పితృకర్మలు విశేష ఫలితాలు ఇస్తాయనీ పురాణాలు చెబుతున్నాయి.

ప్రత్యేకించి పన్నెండు పవిత్రమైన నదులకు పుష్కరాలు జరుగుతాయి. వాటిని స్మరించినంత మాత్రానే పాపాలు తొలగుతాయనేది అనాది నమ్మకం. అందుకే స్నానం చేసే సమయంలో సంకల్పం చెప్పుకొంటూ... ఆ నదీమతల్లులను స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

అవే గంగ, యమున, సరస్వతి, సింధు, నర్మద, గోదావరి, కృష్ణ, తుంగభద్ర మొదలైనవి. ఆ నదుల కోరిక మేరకు... ఏడాదికి ఒక నదిలో నివసించడానికి పుష్కరుడు (వరుణుడు) అంగీకరించాడని, నవగ్రహాల్లో శుభుడైన గురుడు (బృహస్పతి) ఒక రాశి నుంచి మరొకరాశికి మారుతున్నప్పుడు... అతనితో పాటు సంబంధిత నదిలోకి పుష్కరుడితో పాటు, బ్రహ్మాది దేవతలు ఆ నదిలో కొలువవుతారనీ కథ ఉంది. ఈ ఏడాది చైత్ర బహుళ అష్టమి నాడు (మే ఒకటిన) గురువు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు నర్మదానదికి పుష్కరాలు ఆరంభమవుతాయి.

గురు ప్రవేశం తరువాత... ఆ నదిలో తొలి పన్నెండు రోజులు చేసే స్నానాలు, నదీతీరాల్లో చేసే దానాలు, పితృకర్మలకు విశేష ఫలితాలు లభిస్తాయి.

నర్మదానదిని ‘రేవా నది’ అని కూడా వ్యవహరిస్తారు. పుష్కర నదుల్లో నర్మద ప్రత్యేకమైనది. ఇది రుద్రసంభవ... అంటే సాక్షాత్తూ శివుని శరీరం నుంచి ఆవిర్భవించింది. ‘నామృతా నర్మదా’ అంటారు. అంటే మృతము లేనిది, శాశ్వతమైనది అని అర్థం. వింధ్య పర్వత శ్రేణిలో... తూర్పున అమర్‌కంటక్‌లో ఆవిర్భవించి, పశ్చిమ దిశగా... మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లలో వేలాది మైళ్ళు ప్రవహించి... పారిశ్రామిక నగరమైన సూరత్‌ను అక్కున చేర్చుకొని, అరేబియా సముద్రంలో సంగమించే నర్మదా నదీ తీరంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, పారిశ్రామికవాడలు, పాడిపంటలకు నెలవైన ఊళ్ళు ఉన్నాయి.

స్వయంసిద్ధమైన, శివ స్వరూపాలుగా భావించే బాణలింగాలకు కాణాచి నర్మదా నది.

సుప్రసిద్ధమైన ఓంకార క్షేత్రం కూడా నర్మదా తీరంలోనే ఉంది. వింధ్యపర్వత రాజు (వింధ్యుడు) శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు.

శివుడు అతనికి సాక్షాత్కరించగా... తనపై కొలువు ఉండాలని కోరాడు. వింధ్యుడి కోరికను మన్నించిన శివుడు... ఓంకారేశ్వరుడిగా వెలిశాడు. ఓంకారేశ్వర లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధమైనది. ఇక... వింధ్యుడు ఆరాధించిన పార్థివ లింగం... అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్న క్షేత్రం... అమరేశ్వరంగా ప్రసిద్ధమయింది. ఇవి రెండూ నర్మదకు ఇరువైపులా ఉంటాయి.

ఆది శంకరులు తన గురువైన గోవింద భగవత్పాదులను కలిసి, సన్యాస దీక్ష స్వీకరించిన ప్రదేశంగా ఓంకారేశ్వర్‌ ప్రసిద్ధి. అక్కడ గోవింద భగవత్పాదుల గుహ ఉంది.

అలాగే అహల్యాబాయి రాజధాని మాహిష్మతి (మహేశ్వరం) లాంటి ఎన్నో ప్రదేశాలు నర్మదా పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. అంతటి ప్రసిద్ధమైన నర్మదానదిని పుష్కర సమయంలో సందర్శించి, భక్తి శ్రద్ధలతో స్న్నానాలు, దానాలు, ధ్యానాలు, పితృకర్మలు ఆచరిస్తే అనంతమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయనేది పెద్దలమాట.

ఆయపిళ్ళ రాజపాప

Updated Date - Apr 26 , 2024 | 12:29 AM