Share News

అగ్ర నేతల పర్యటనలపై భారీ ఆశలు!

ABN , Publish Date - May 07 , 2024 | 12:02 AM

కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పర్యటనలపై భారీ ఆశలు పెట్టుకున్నాయి.

అగ్ర నేతల పర్యటనలపై భారీ ఆశలు!

10న తాండూరులో జన జాతరకు ప్రియాంకాగాంధీ

11న వికారాబాద్‌లో అమిత్‌ షా బహిరంగ సభ

భారీ జన సమీకరణే లక్ష్యంగా కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ ఏర్పాట్లు

వికారాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పర్యటనలపై భారీ ఆశలు పెట్టుకున్నాయి. చేవెళ్ల లోక్‌సభ స్థానంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఎవరికి వారు దూకుడు పెంచారు. మినీ ఇండియాగా భావించే చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపును కాంగ్రెస్‌, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎక్కువ సంఖ్యలో ఓటర్లను ప్రభావితం చేసేలా ఆయా పార్టీల అభ్యర్థులు వ్యూహాత్మకంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో నిర్వహించే బహిరంగ సభలు అభ్యర్థుల ఫలితాలను నిర్దేశిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నెల 10న సాయంత్రం 4గంటలకు తాండూరులో ప్రియాంకాగాంధీ జనజాతర సభకు హాజరయ్యేలా పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రియాంక బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జి కొంపల్లి యాదవరెడ్డి, తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ఈ నెల 11న కేంద్ర హోం శాఖ మంత్రి వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. అమిత్‌ షా పర్యటనను బీజేపీ అతి కీలకంగా తీసుకుంటోంది. తటస్థ ఓటర్లు అమిత్‌ షా పర్యటనతో బీజేపీ వైపు మొగ్గు చూపుతారని ఆ నేతలు భావిస్తోంది. అమిత్‌ షా వికారాబాద్‌ పర్యటన మొదట 9న ఖరారైంది. అయితే రద్దవుతుందని భావించిన ప్రియాంకాగాంధీ పర్యటన ఈ నెల 10న ఉండడంతో బీజేపీ తన సభను 11వ తేదీకి వాయిదా వేసింది. మొదట ఈ నెల 4న వికారాబాద్‌కు మోదీ వస్తారని ఆ పార్టీ నాయకులు భావించినా ఉత్తరాదిన బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆయన పర్యటన రద్దయింది. ఈ నేపథ్యంలోనే అమిత్‌ షాతోనైనా బహిరంగ సభ నిర్వహించాలని పట్టుదలతో ప్రయత్నించారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అమిత్‌ షా, మోదీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీల బహిరంగ సభలు ఎప్పుడు జరిగినా హైదరాబాద్‌ నగర శివార్లలోనే నిర్వహిస్తూ వచ్చారు. గ్రామీణ ప్రాంతమైన వికారాబాద్‌ జిల్లాలో ఈ సారి పార్టీ అగ్రనేతల బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పట్టుదలతో ప్రయత్నించడంతో జిల్లాలో జరిగే సభలకు హాజరవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ఓటర్లే టార్గెట్‌గా వికారాబాద్‌లో బహిరంగ సభలకు పార్టీలు మొగ్గు చూపుతున్నాయి.

భారీ జన సమీకరణ, బల నిరూపణే లక్ష్యం!

ఇదిలా ఉంటే, ప్రియాంకగాంధీ, అమిత్‌షాలు పాల్గొనే బహిరంగ సభలకు వేలాదిగా జనాన్ని సమీకరించి ప్రజల్లో పార్టీకి ఎంత ఆదరణ ఉందో చూపాలని ప్రతిష్ఠాత్మకంగా సభలను నిర్వహించనున్నాయి. ఎన్నికల అంకం కీలక దశకు చేరడంతో పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు నిర్వహించే బహిరంగ సభలకు వేలాదిగా జనం వస్తే పార్టీకి బూస్ట్‌పగా పనికొస్తుందని నేతలు భావిస్తున్నారు. తాండూరులో నిర్వహించే ప్రియాంకగాంధీ సభకు లక్ష జన సమీకరణ చేయాలనే లక్ష్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ నిర్దేశించుకుంది. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ సభకు ప్రజలను తరలించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. తాండూరు, వికారాబాద్‌, పరిగి నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో జన సమీకరణ చేసేలా ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండడంతో కాంగ్రె్‌సకు జన సమీకరణ, సభ ఏర్పాట్ల పనులు త్వరత్వరగా పూర్తవుతున్నాయి. పార్టీ శ్రేణలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ నేతలు వినియోగించుకుంటూ సభను సక్సెస్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా వికారాబాద్‌లో నిర్వహించే అమిత్‌ షా బహిరంగ సభకు కూడా వేలాదిగా కార్యకర్తలు, ప్రజలను తరలించాలని బీజేపీ భావిస్తోంది. వికారాబాద్‌, తాండూరు, పరిగి నియోజకవర్గాల నుంచి లక్ష వరకు జన సమీకరణ చేయాలనే లక్ష్యం పెట్టుకోవాలని అఽధిష్ఠానం నిర్దేశించినట్లు తెలుస్తోంది. ప్రియాంకాగాంధీ, అమిత్‌ షాల బహిరంగ సభలకు సంబంధించి జన సమీకరణతో పాటు సభల ఏర్పాట్లలో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు తలమునకలై ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేతల పర్యటనలు లేనట్లేనా?

ఇదిలా ఉంటే, లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్‌ఎస్‌ అగ్రనేతల పర్యటనలు ఇంకా ఖరారు కాలేదు. వికారాబాద్‌, పరిగి నియోజకవర్గాల్లో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సన్నాహక సమావేశాలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తరువాత గులాబీ దళపతి కేసీఆర్‌, లేదా కేటీఆర్‌, హరీ్‌షరావుల్లో ఎవరైనా ఒకరు జిల్లాలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. అయితే ఇంత వరకు బీఆర్‌ఎస్‌ అగ్రనేతల జిల్లా పర్యటన ఖరారు కాలేదు. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు కేసీఆర్‌ బస్సుయాత్ర షెడ్యూల్‌ ముందుగానే ఖరారు కావడంతో ఆయన పర్యటన జిల్లాలో లేదు. ఎన్నికల ప్రచార గడువు ముగిసే వరకు కేటీఆర్‌, హరీ్‌షరావుల్లో ఎవరైనా జిల్లాలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేస్తారా? లేక మాజీ మంత్రి, చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జి సబితారెడ్డి, అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కె.మహే్‌షరెడ్డి, రోహిత్‌రెడ్డిలే అన్నీ తామై ప్రచారాన్ని నిర్వహించి ముగిస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది. కాగా ఈ నెల 11 సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది.

కాంగ్రెస్‌, బీజేపీల్లో కొత్త ఊపు

జిల్లాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు కాంగ్రెస్‌, బీజేపీల ఇద్దరు అగ్రనేతలు జిల్లాకు రావడం ఆ పార్టీల్లో కొత్త ఊపు తెస్తోంది. ప్రియాంక గాంధీ బహిరంగ సభపై కాంగ్రెస్‌ శ్రేణులు గంపెడాశలు పెట్టుకున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పర్యటనపై బీజేపీ భారీ ఆశలు పెంచుకుంది. అగ్ర నేతల ప్రచారం తమకే లాభిస్తుందని కాంగ్రెస్‌ భావిస్తుండగా, తమకే కలిసి వస్తుందని బీజేపీ ఆశిస్తోంది.

Updated Date - May 07 , 2024 | 12:02 AM