ఖాళీ స్థలాలకూ పన్ను!

ABN , First Publish Date - 2021-10-12T04:19:54+05:30 IST

ఖాళీ స్థలాలకూ పన్ను!

ఖాళీ స్థలాలకూ పన్ను!

  • జిల్లాలో 37,223 స్థలాలపై వీఎల్‌టీ విధింపు
  • ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ఆధారంగా పన్ను పరిధిలోకి
  • రంగం సిద్ధం చే సిన అధికార యంత్రాంగం


ఇంటి నిర్మాణానికి ప్లాట్‌ కొనుగోలు చేసి అలాగే ఖాళీగా వదిలేశారా ? అయితే మీరు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందే. ఖాళీ స్థలాలకూ పన్ను విధించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ఆధారంగా ఖాళీ స్థలాలకూ పన్ను విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఉన్నతాధికారులు పంపించారు. డేటాబేస్‌ ఆధారంగా వీఎల్‌టీ మదింపు చేసి సంబంధిత యజమానులకు డిమాండ్‌ నోటీసులు పంపించనున్నారు.  


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి)

ఎస్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకున్న ఖాళీ స్థలాల యజమానుల నుంచి (వీఎల్‌టీ-వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌) రూపంలో పన్ను వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. లేఅవుట్‌ క్రమబద్దీరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా ప్రభుత్వం ఈ పన్ను వసూలు చేయనుంది. మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అనుమతి పొందిన లేఅవుట్లు, ప్లాట్లకు వీఎల్‌టీ వర్తిస్తుండగా, అనధికార లేఅవుట్లు, ప్లాట్లు వీఎల్‌టీ పరిధిలోకి రాలేవు. అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు నెలాఖరులో ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎ్‌సకు జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న అక్రమ ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం వేలాది దరఖాస్తులు వచ్చాయి. 

పట్టణాలు, గ్రామాల్లో ఖాళీ ప్లాట్లు కళ్ల ముందు కనిపిస్తున్నా అనుమతి లేని ఆ ప్లాట్లకు సంబంధించి ఖాళీ స్థలం పన్ను వసూలు చేయలేకపోయారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ఆధారంగా ఖాళీ స్థలాలకూ పన్ను విధించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించడంతో ఇక నుంచి ఆ స్థలాల యజమానుల నుంచి వీఎల్‌టీ వసూలు చేయనున్నారు. అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్దీకరించుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వివరాల ఆధారంగా పన్ను విధించనున్నారు. ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఇచ్చిన సర్వే నెంబర్‌, ప్లాట్‌ సంఖ్య, విస్తీర్ణం, యజమాని పేరు, చిరునామా, ఆధార్‌ సంఖ్య, ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలు అందజేసిన విషయం తెలిసిందే. 

రంగం సిద్ధం చేసిన అధికారులు

ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాసు చేసుకున్న అనుమతి లేని ప్లాట్లను క్రమబద్ధీకరించడంతో పాటు ఖాళీ స్థలాలకు విధించే వీఎల్‌టీని ఆ ప్లాట్లకు కూడా వర్తింపజేసే దిశగా ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద మొత్తం 37,223 దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల వివరాలను ఇప్పటి కే ప్రభుత్వం డేటాబే్‌సలో నిక్షిప్తం చేసింది. క్రమబద్దీకరణ కోసం వచ్చిన అక్రమ ప్లాట్లు, లేఅవుట్లను త్వరలో వీఎల్‌టీ పరిధిలోకి తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఉన్నతాధికారులు పంపించారు. డేటాబేస్‌ ఆధారంగా ఖాళీ ప్లాట్లపై మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు వీఎల్‌టీ మదింపు చేసి సంబంధిత యజమానులకు డిమాండ్‌ నోటీసులు పంపించనున్నారు. 

గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఇంటింటి సర్వేలో జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో ఆస్తి పన్ను పరిధిలోకి రాని 3,359 గృహాలు, భవనాలను మునిసిపల్‌ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. తాండూరులో 1,928, వికారాబాద్‌లో 928, కొడంగల్‌లో 492, పరిగిలో 11 గృహాలు ఆస్తి పన్ను పరిధిలోకి రాలేవని గుర్తించి వాటికి ఆస్తి పన్ను మదింపు చేసే విధంగా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఖాళీ స్థలాలకు దాని విలువ ఆధారంగా 0.05 శాతం పన్ను విధించడం ద్వారా అన్ని మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని భావించిన ప్రభుత్వం పన్ను విధించాలనే నిర్ణయం తీసుకుంది. మునిసిపల్‌ చట్టం- 2019 ప్రకారం ఖాళీ స్థలాలపై దాని విలువలో కనిష్టంగా 0.05 శాతం నుంచి గరిష్ఠంగా 0.20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. 

జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల వివరాలు

తాండూరు : 12,347

పరిగి :  4,239

వికారాబాద్‌ :  4,041

కొడంగల్‌ :   414 

గ్రామ పంచాయతీలు : 16,182 

మొత్తం దరఖాస్తులు : 37,223 

Updated Date - 2021-10-12T04:19:54+05:30 IST