జిల్లాకు 200 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు

ABN , First Publish Date - 2021-05-09T06:28:38+05:30 IST

జిల్లాలో ఆక్సిజన్‌ కొరతను తగ్గించడానికి 200 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేయనున్నాం. పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా పడకల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ద్వారా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి’ అని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు.

జిల్లాకు 200 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు
సమావేశంలో ప్రసంగిస్తున్న నాని

కొవిడ్‌ను కలసికట్టుగా కట్టడి చేద్దాం

‘రెమ్‌డెసివిర్‌’ బ్లాక్‌మార్కెట్‌ని కట్టడి చేస్తాం

నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీకి 

50 శాతం పడకలు కేటాయించాల్సిందే

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని



తిరుపతి, మే 8 (ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో ఆక్సిజన్‌ కొరతను తగ్గించడానికి 200 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేయనున్నాం. పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా పడకల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ద్వారా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి’ అని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు. శనివారం తిరుపతి ఎస్వీయూలోని సెనేట్‌ హాల్‌లో మరో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి కొవిడ్‌ నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై సమీక్షించారు. నాని మాట్లాడుతూ.. సీఎం జగన్‌ కొవిడ్‌ నియంత్రణకు సమర్ధవంతంగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అధికారులు, ప్రజలు కలిసికట్టుగా కొవిడ్‌ను కట్టడి చేద్దామని పిలుపునిచ్చారు. గతంలో కన్నా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచేలా చేయడంతోపాటు బ్లాక్‌మార్కెట్‌లో అమ్మకాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘ఆక్సిజన్‌ను అవసరమైన చోట వినియోగించేలా వైద్యసిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 50 శాతం పడకలను బాధితులకు కేటాయించాల్సిందే. ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించడానికి అదనపు సిబ్బందిని నియమించుకోవాలి. ప్రతి ఆస్పత్రిలో హెల్ప్‌డెస్క్‌ ద్వారా కొవిడ్‌ బాధితుల సమాచారాన్ని వారి బంధువులకు అందించాలి. పరీక్షల ఫలితాలు సత్వరమే అందేలా చూడాలి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వంద పడకల ఆస్పత్రికి అవసరమైన సిబ్బంది నియామకం, సత్యవేడు నియోజకవర్గంలో ఆస్పత్రి ఏర్పాటుకున్న పరిస్థితులను పరిశీలించాలి. తిరుపతిలోని కొవిడ్‌ మృతదేహాలను ఖననం చేసేందుకు అటవీ ప్రాంతంలోని సమస్యను పరిష్కరించాలి. కర్ఫ్యూను పటిష్ఠంగా అమలు చేయాలి. రుయాస్పత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల జీతాలకు సంబంధించిన నివేదికను ఇవ్వండి’ అని అధికారులకు నాని ఆదేశాలిచ్చారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. కొవిడ్‌ నియంత్రణకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 10 కొవిడ్‌ కేర్‌ సెంటర్లతోపాటు అదనంగా ఏడు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల వసూలు నియంత్రణకు సంబంధించి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పనిచేస్తోందన్నారు. కలెక్టర్‌ హరినారాయణన్‌ మాట్లాడుతూ.. తొమ్మిది ప్రభుత్వాస్పత్రుల్లో జిల్లా వ్యాప్తంగా 2,874 పడకల సామర్థ్యంతో 294 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 37 ప్రైవేటు ఆస్పత్రుల్లో 2,275 పడకల సామర్థ్యంతో వైద్యసేవలు అందిస్తున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా ఫీవర్‌ సర్వే నిర్వహించడం జరుగుతోందని, 17 ట్రయేజ్‌ సెంటర్ల ద్వారా కొవిడ్‌ బాధితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. జిల్లాలో 2021 జనవరి నుంచి మే ఏడో తేదీవరకు 5,43,135 పరీక్షలు చేయగా, 50,456 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. అంటే పాజిటివ్‌ కేసుల శాతం 9.29గా ఉందని వివరించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీలు యండపల్లి శ్రీనివాసులురెడ్డి, గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకనాధ్‌రెడ్డి, నవాజ్‌ బాష, తిరుపతి మేయర్‌ శిరీష, ఎస్పీలు సెంథిల్‌కుమార్‌, వెంకట అప్పలనాయుడు, నగర పాలక కమిషనర్‌ గిరీష, జేసీ వీరబ్రహ్మం, ఆర్డీవో కనకనరసా రెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు.


ఆరోగ్యశ్రీ కింద చేర్చుకోకుంటే వారం తర్వాత మళ్లీ వస్తా : నాని


నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అర్హత కల్గిన కొవిడ్‌ బాధితులను చేర్చుకోకుంటే వారం తర్వాత మళ్లీ వచ్చి సమీక్షించి, చర్యలు తీసుకుంటానని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో సమావేశమయ్యారు. సీఎం ఆదేశాలనుగుణంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలు అటుంచితే.. ఒక్కరిని కూడా ఆరోగ్యశ్రీ కింద చేర్చుకోవడంలేదని ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’ మంత్రి దృష్టికి తెచ్చారు. అందుకాయన మాట్లాడుతూ.. ఈ విషయమై ఇపుడే సమీక్షించానని, వారంలో సమస్య పరిష్కారం కాకుంటే తన సెల్‌ నెంబరుకు మెసేజ్‌ పెట్టాలని చెప్పారు. అలాగే పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒకటి రెండు పొరబాట్లు జరిగి ఉండవచ్చన్నారు. అధికార యంత్రాంగం ఎంతో ఒత్తిడితో పనిచేస్తోందని, ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తామన్నారు. 

Updated Date - 2021-05-09T06:28:38+05:30 IST