రెండేళ్లుగా గోదాముల్లోనే!

ABN , First Publish Date - 2021-06-22T05:40:36+05:30 IST

విజిలెన్స్‌ అధికారుల దాడుల్లో పట్టుబడిన 255 టన్నుల రేషన్‌ బియ్యం శ్రీకాళహస్తి పౌరసరఫరాల శాఖ గోదాముల్లో మగ్గుతున్నాయి.

రెండేళ్లుగా గోదాముల్లోనే!
శ్రీకాళహస్తి పౌరసరఫరాల శాఖ గోదాములో నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం

మగ్గుతున్న 255 టన్నుల రేషన్‌ బియ్యం


శ్రీకాళహస్తి, జూన్‌ 21: అక్రమ రవాణా అడ్డుకట్టకు విజిలెన్స్‌ అధికారులు తరచూ దాడులు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో పట్టుబడిన 255 టన్నుల రేషన్‌ బియ్యాన్ని ప్రభుత్వ, ప్రైవేటు గోదాముల్లో నిల్వచేశారు. రెండేళ్లవుతున్నా వీటి విక్రయం పట్ల పౌరసరఫరాల శాఖ యంత్రాంగం చొరవ చూపక పోవడం విమర్శలకు దారితీస్తోంది. 

 శ్రీకాళహస్తి పరిసరప్రాంతాల్లో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జోరందుకుంది. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. సేకరించిన సబ్సిడీ బియ్యాన్ని పాలిష్‌ చేసి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై ఫిర్యాదులు అందగానే తిరుపతి విజిలెన్సు అధికారులు దాడులు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా పట్టుబడిన బియ్యాన్ని శ్రీకాళహస్తి పట్టణంలోని పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలించి నిల్వ చేస్తున్నారు. ఆ మేరకు రెండేళ్ల కాలంలో పట్టుబడిన 155 టన్నులు(3,644 బస్తాలు) రేషన్‌ బియ్యం ఇక్కడే మగ్గుతోంది. కొంతకాలంగా జరిగిన దాడుల్లోనూ దాదాపు వంద టన్నులకుపైగా(2వేల బస్తాలు) సబ్సిడీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పౌరసరఫరాల శాఖ గోదాములో స్థలం లేక ఈ బియ్యం బస్తాలను పలు పాఠశాలలు, ప్రైవేటు గోదాముల్లో నిల్వచేశారు. అయితే నిబంధనల మేరకు.. విజిలెన్స్‌ దాడుల్లో పట్టుబడిన సబ్సిడీ బియ్యాన్ని నిర్ణీత వ్యవధిలోగా టెండర్ల ద్వారా విక్రయించాల్సి ఉంది. టెండరు నిర్వహణ అధికారం కలెక్టరుకు మాత్రమే ఉంటుంది. ఈ విషయమై పౌరసరఫరాల శాఖ పర్యవేక్షించాల్సినా, పట్టించుకోక పోవడంతో రెండేళ్లుగా 255 టన్నుల రేషన్‌ బియ్యం ప్రభుత్వ, ప్రైవేటు గోదాముల్లో మగ్గుతోంది. వీటికి పురుగు పట్టడంతో ఎందుకూ పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సబ్సిడీ బియ్యం విక్రయానికి చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సి ఉంది. 

Updated Date - 2021-06-22T05:40:36+05:30 IST