91 మందికి కరోనా పాజిటివ్‌, ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-08-08T10:30:28+05:30 IST

సిద్దిపేట జిల్లాలో 91 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అందులో 37 కేసులు సిద్దిపేట అర్బన్‌ మండలంలోనే ఉన్నాయి

91 మందికి కరోనా పాజిటివ్‌, ఇద్దరి మృతి

సిద్దిపేట అర్బన్‌లో 37 మందికి, గజ్వేల్‌లో 15 మందికి కరోనా

ఒక ఇంట్లో పది, మరో ఇంట్లో ఏడు కేసులు నమోదు


సిద్దిపేట,  ఆగస్టు 7: సిద్దిపేట జిల్లాలో 91 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అందులో 37 కేసులు సిద్దిపేట అర్బన్‌ మండలంలోనే ఉన్నాయి. సిద్దిపేట పట్టణంలోని పాతగంజు ప్రాంతంలోని ఒక ఇంట్లో పదిమందికి, హనుమాన్‌నగర్‌లోని మరో ఇంట్లో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. భారత్‌నగర్‌లో ఐదు, అంబేడ్కర్‌నగర్‌లో ఒకరికి, బారాఇమాంలో ఒకరికి, గణేశ్‌నగర్‌లో ముగ్గురికి, గీతాభవన్‌ ప్రాంతంలో ఇద్దరికి, ఖాదర్‌పురలో ఒకరికి, ముర్షద్‌గడ్డలో ఒకరికి, కోటిలింగాల ప్రాంతంలో ఒకరికి, పటేల్‌పురలో ఒకరికి, సాజిద్‌పురలో ఇద్దరికి ఇలా సిద్దిపేట అర్బన్‌లో 37 మందికి వైరస్‌ సోకింది. సిద్దిపేట పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు విస్తరించినట్లు ప్రజలు భావిస్తున్నారు. మండలాల వారీగా కొండపాకలో పదమూడు మందికి, చిన్నకోడూరులో ఎనిమిది మందికి, దుబ్బాకలో ఆరుగురికి, గజ్వేల్‌లో పదిహేను మందికి, మర్కుక్‌, బెజ్జంకిలో ఇద్దరి చొప్పున, ములుగు, హుస్నాబాద్‌, జగదేవ్‌పూర్‌, కొమురవెల్లి, కోహెడలో ఒక్కొక్కరకి కరోనా సోకింది.


దుబ్బాక: తిమ్మాపూర్‌ పీహెచ్‌సీలో శుక్రవారం నిర్వహించిన ర్యాపిడ్‌ టెస్టు పరీక్షలో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. అందులో ఒక దివంగత నేత వ్యక్తిగత సహాయకుడు కూడా ఉన్నాడు. దుబ్బాక పట్టణానికి చెందిన తండ్రి, కొడుకులకు, ఆకారం గ్రామానికి చెందిన ఒక్కరికి, రాజక్కపేటకు చెందిన ఓ దుకాణ యజమాని, సిద్దిపేటలో ఉంటున్న ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 


కొండపాక : కొండపాక మండలం కుకునూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో పదమూడు మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నా మండలంలోని ఎర్రవల్లికి చెందిన ఇద్దరిని సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. కొడకండ్లకు చెందిన నలుగురికి, కోనాయిపల్లిలో ఒకరికి, పాములపర్తి మల్లన్నసాగర్‌ కెనాల్‌ పని చేసే ఒకరికి, సిద్దిపేట నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిని హోం క్వారంటైన్‌లో ఉంచినట్టు సిబ్బంది తెలిపారు.


బెజ్జంకి: మండలంలోని లక్ష్మీపూర్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తోటపల్లి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ లింగారెడ్డి తెలిపారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తిని హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో బెజ్జంకి మండలంలో ఇప్పటివరకు 15 మందికి కరోనా సోకింది. అలాగే మండలంలోని గుగ్గిళ్ల గ్రామానికి చెందిన ఓ మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.


కోహెడ: కోహెడలో ఒక మహిళ ప్రజాప్రతినిధికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి విజయరావు తెలిపారు. ఆమెను హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  12 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి నిర్ధారణ అయ్యింది. 


చేర్యాల : కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొమురవెల్లి మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శుక్రవారం 12మందికి ర్యాపిడ్‌  టెస్ట్‌లు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. 

Updated Date - 2020-08-08T10:30:28+05:30 IST