అయ్యో.. చిన్నా!

ABN , First Publish Date - 2022-10-08T04:59:02+05:30 IST

పెళ్లయిన రెండేళ్లకు పుట్టాడు. తన గారాల బిడ్డను కన్నవారికి చూపించాలని, వాడికి పేరు పెట్టాలని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కన్నవారింటికి బిడ్డను తీసుకొచ్చి సరదాగా గడిపింది. నాలుగు నెలలకు నాలుగు రోజుల తక్కువ నాడు నామకరణం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ప్రస్తుతం బిడ్డకు 45 రోజుల కావడంతో వ్యాక్సిన్‌ వేయించేందుకు ఆటోలో తన అన్నతో కలిసి ఆస్పత్రికి బిడ్డను తీసుకెళ్లింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆ బిడ్డను కాటేసింది.

అయ్యో.. చిన్నా!
తల్లడిల్లుతున్న షర్మిళ.. ఇన్‌సెట్‌లో బాలుడి మృతదేహం

- రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
- యారబాడు వద్ద ఆటోను ఢీ కొన్న కారు
- తల్లి ఒడి నుంచి ఎగిరి కింద పడిన బాలుడు
- పుట్టిన 45 రోజులకే కబళించిన మృత్యువు
(నరసన్నపేట)

పెళ్లయిన రెండేళ్లకు పుట్టాడు. తన గారాల బిడ్డను కన్నవారికి చూపించాలని, వాడికి పేరు పెట్టాలని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కన్నవారింటికి బిడ్డను తీసుకొచ్చి సరదాగా గడిపింది. నాలుగు నెలలకు నాలుగు రోజుల తక్కువ నాడు నామకరణం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ప్రస్తుతం బిడ్డకు 45 రోజుల కావడంతో వ్యాక్సిన్‌ వేయించేందుకు ఆటోలో తన అన్నతో కలిసి ఆస్పత్రికి బిడ్డను తీసుకెళ్లింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆ బిడ్డను కాటేసింది. వారు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీ కొనగా.. బోల్తా పడింది. తల్లి ఒడిలో ఉన్న బిడ్డ ఎగిరి ఆటో కింద పడింది. బిడ్డ తల్లి.. మేనమామ చెరోవైపు ఎగిరి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వచ్చి సపర్యలు చేసి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బిడ్డ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ తల్లికి కడుపుకోత మిగిలింది. నిర్జీవంగా ఉన్న ఆ బిడ్డను చూసి.. ఆమె రోదన మిన్నంటింది.  
........................

నరసన్నపేట మండలం యారబాడు వద్ద రోడ్డు ప్రమాదంలో 45 రోజుల బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కోమర్తి గ్రామానికి చెందిన సింహాద్రి షర్మిళకు సత్యప్రభుతో 2020 ఆగస్టు 10న వివాహమైంది. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఈ ఏడాది ఆగస్టు 22న కుమారుడు జన్మించాడు. ఆ బాబుకు నామకరణోత్సవం కోసం షర్మిళ గత నెల 17న పుట్టింటికి వచ్చింది. నాలుగు నెలలకు నాలుగు రోజుల తక్కువ నాడు నామకరణోత్సవం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ప్రస్తుతం 45 రోజుల వ్యాక్సిన్‌ వేయించేందుకు శుక్రవారం షర్మిళ తన సోదరుడు శ్రీధర్‌తో కలిసి.. బాబును ఉర్లాం పీహెచ్‌సీకి ఆటోలో తీసుకెళ్లారు. వ్యాక్సిన్‌ వేయించుకుని తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న ఆటోను యారబాడు వద్ద ఓ కారు(ఏపీ 39 కేఏ 6617) వెనుక నుంచి ఢీ కొంది. దీంతో ఆటో అదుపు తప్పి.. బోల్తా పడింది. తల్లి షర్మిళ ఒడిలో ఉన్న ఆ బాలుడు ఎగిరి.. ఆటో కింద పడి చిక్కుకున్నాడు. షర్మిల, శ్రీధర్‌లు చెరోవైపు పడి గాయపడ్డారు. ఆటోడ్రైవర్‌ మామిడి శ్రీనుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. లేవలేని స్థితిలో ఉన్నా సరే.. షర్మిళ తన బాబుకోసం వెతకసాగింది. బిడ్డ ఎక్కడ ఉన్నాడో తెలియక ఆందోళన చెందింది. సంఘటన స్థలానికి  స్థానికులు చేరుకున్నారు. ఆటో కింద బాలుడు ఉన్నట్టు గుర్తించి.. ఆ వాహనాన్ని లేవనెత్తారు. బాలుడితో పాటు క్షతగాత్రులను నరసన్నపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ముగ్గురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ సింహాచలం పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు.

పాపం... విధి వంచన
విధి వంచన కారణంగా షర్మిళ పండంటి బిడ్డను కోల్పోయింది. బిడ్డకు వ్యాక్సిన్‌ వేయించాలని ఆశ కార్యకర్త సూచించింది. దీంతో ద్విచక్ర వాహనంపై సోదరుడితో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇంతలో వర్షం కురవడంతో ఆటోలో ముగ్గురూ ఆస్పత్రికి వెళ్లారు. తిరిగి వస్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పుట్టిన బిడ్డకు పేరు పెట్టకముందే రోడ్డు ప్రమాదంలో మృత్యవు కాటేయడంతో షర్మిళ కన్నీరుమన్నీరుగా రోదిస్తోంది. బిడ్డ ఎక్కడ అని అడిగితే.. బాలుడు మృతి చెందిన విషయాన్ని తన భర్తకు ఎలా చెప్పాలని.. కన్నీటిపర్యంతమవుతోంది.   

రోడ్లపై గుంతలే కారణమా..
యారబాడు-లింగాలపాడు గ్రామాల మధ్య రోడ్లపై గుంతలు ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.  కోమర్తి -బద్రి వయా ఉర్లాం రోడ్డు పనులు నాలుగేళ్లుగా సాగుతున్నాయి. విస్తరణ పనుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

Updated Date - 2022-10-08T04:59:02+05:30 IST