12రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ

ABN , First Publish Date - 2022-07-03T07:15:58+05:30 IST

ప్రకృతి వ్యవసాయ రైతుల నుంచి 12 రకాల ఉత్పత్తులను సేకరించనున్నాం అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

12రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ
ధర్మారెడ్డితో మాట్లాడుతున్న ప్రద్యుమ్న

మధ్యవర్తుల్లేకుండా రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం: టీటీడీ ఈవో 


తిరుపతి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ‘ప్రకృతి వ్యవసాయ రైతుల నుంచి 12 రకాల ఉత్పత్తులను సేకరించనున్నాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని  పద్మావతి అతిథి గృహంలో శనివారం రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌ ఉన్నతాధికారులతో సమీక్షించారు. తొలివిడతలో 500 మెట్రిక్‌ టన్నుల శనగలు కొనుగోలు చేశామన్నారు. మలి విడతలో బియ్యం, శనగలు, బెల్లం, కందిపప్పు, పెసలు, పసుపు, వేరుశనగ, మిరియాలు, ధనియాలు, ఆవాలు, చింతపండు, ఉద్దిపప్పు సేకరించాలని నిర్ణయించామన్నారు. వీటిని ప్రకృతి వ్యవసాయ రైతుల నుంచి రాష్ట్ర రైతు సాధికార సంస్థ కొనుగోలు చేస్తుందని ఈ సంస్థ నుంచి మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసి తగిన విధంగా మార్పు చేసి టీటీడీకి అందిస్తుందన్నారు.  రైతులు కూడా భక్తిశ్రద్ధలతో పంటలు పండించి.. ఎలాంటి పరిస్థితుల్లోనూ రసాయన ఎరువులు వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. రైతు సాధికార సంస్థ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌ మాట్లాడుతూ.. మార్క్‌ఫెడ్‌ కలిసి గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన శనగపప్పును టీటీడీకి సరఫరా చేసినట్టు తెలిపారు. మొదటిదశలో 1300 మెట్రిక్‌ టన్నుల శనగలను రైతుల నుంచి సేకరించి, రసాయన అవశేషాలను పరిశీలించామన్నారు. టీటీడీ స్వీకరించనున్న 12 రకాల ఉత్పత్తుల కోసం ప్రకృతి వ్యవసాయ రైతుల ఎంపిక జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డి మాట్లాడుతూ.. లడ్డూల తయారీ కోసం ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల నుంచి శనగలను ప్రయోగాత్మకంగా సేకరించామన్నారు. మార్క్‌ఫెడ్‌ ఎండీ ప్రద్యుమ్న మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు కనీస మద్ధతు ధరకంటే 10 శాతం ఎక్కువగా చెల్లించటం ద్వారా అటు రైతులకు లాభదాయకంగా ఉంటుందని, ఇటు టీటీడీకీ నాణ్యమైన ఆరోగ్యకరమైన సరుకులు అందుతాయన్నారు. ప్రకృతి వ్యవసాయ రైతులకు ఏడు నుంచి 10 రోజుల్లోపు మార్క్‌ఫెడ్‌ సొమ్ము చెల్లిస్తుందని, ఆ తర్వాత టీటీడీ నుంచి రీయింబర్స్‌మెంట్‌ తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఎఫ్‌.ఏ.సీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ-2 జగదీశ్వర్‌ రెడ్డి, మార్కెటింగ్‌ జీఎం సుబ్రహ్మణ్యం, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ప్రొఫెసర్‌ వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T07:15:58+05:30 IST