నరక కుప్పం

ABN , First Publish Date - 2022-09-24T06:47:05+05:30 IST

కుప్పంలో భిన్నమైన వాతావరణం కనిపించింది. ఇళ్లముందు బారికేడ్లు నిర్మించి కుప్పం పట్టణాన్ని పోలీసులు దిగ్బంధించారు.

నరక కుప్పం

1 : కుప్పం సభలో సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి


సీఎం వస్తే ఇన్ని ఆంక్షలా?

దుకాణాలు బంద్‌ ఫ ఇళ్ల ముందు బారికేడ్లు

రహదారులన్నీ దిగ్బంధం

తాగునీరు లేక అల్లాడిన ప్రయాణికులు

స్థానికులను కుప్పంలోకి పంపకుండా అడ్డగింత

సభకు తెచ్చిన జనం ఆకలి కేకలు, శాపనార్థాలు

ముఖ్యమంత్రి తమ ఊరికి వస్తున్నాడంటే సంబరంగా ఉండాలి. పండుగ వాతావరణం కనిపించాలి. తమ రోడ్లు బాగుపడతాయనీ, తమ సమస్యలన్నీ తీరుతాయనీ జనంలో ఆనందంతో కూడిన ఆశ వినిపించాలి. కానీ శుక్రవారంనాడు కుప్పంలో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. ఇళ్లముందు బారికేడ్లు నిర్మించి కుప్పం పట్టణాన్ని పోలీసులు దిగ్బంధించారు. పట్టణంలోకి వచ్చే అన్ని ముఖ్యమైన దారులూ మూసేశారు. కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఆగిపోయి, మంచినీళ్లు కూడా దొరక్క ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బయటి ప్రాంతాల నుంచి బస్సులకొద్దీ జనాన్ని తరలించి కుప్పాన్ని నింపేసిన వైసీపీ పెద్దలు, తెచ్చిన జనానికి తిండీ, నీళ్లు సక్రమంగా ఇవ్వడంలోనూ విఫలమయ్యారు. వచ్చిన జనం, తమను తెచ్చిన నేతలను శాపనార్థాలు పెడుతూ వెనుదిరిగారు. గంట ఉపన్యాసం ఇచ్చిన సీఎం జగన్‌ కూడా ప్రజల్ని ఉత్సాహపరచలేకపోయారు. ఈలలూ కేకలూ, చప్పట్లు లేకుండా సీఎం సభ చప్పగా ముగియడం విశేషం. 

కుప్పానికి తోడుగా ఉంటా : సీఎం 

కుప్పం, సెప్టెంబరు 23: ‘కుప్పానికి తోడుగా ఉంటా. దీన్ని నా నియోజకవర్గంగా భావించి అభివృద్ధి చేస్తా’ అని ముఖ్యమంత్రి జగన్‌ కుప్పం నియోజకర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. కుప్పంలో శుక్రవారం ఆయన చేయూత మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 30 ఏళ్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కుప్పానికి ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం కొళాయిల్లో మంచినీళ్లు రావడంలేదన్నారు. అందుకే ఇక్కడి ప్రజలు అభివృద్ధివైపు మొగ్గి, వైసీపీకి ఓటేశారన్నారు. కుప్పాన్ని మున్సిపాలిటీ చేయడమేకాక, రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. హంద్రీ-నీవా బ్రాంచి కాలువను ఆరు నెలల్లో పూర్తి చేసి తాగు, సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గుడుపల్లె మండలం యామగానిపల్లె వద్ద 0.77 టీఎంసీ, శాంతిపురం వద్ద రూ.0.3 టీఎంసీలతో రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.250 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.పాలారు ప్రాజెక్టును రూ.180 కోట్లతో పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీకి రూ.66 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరో రూ.100 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానన్నారు. అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. జగన్‌ సీఎం అయ్యాకే కుప్పంలో అభివృద్ధి కనబడుతోందన్నారు. హంద్రీ-నీవా కాలువను పూర్తి చేయాలని, పాలారు ప్రాజెక్టు న్యాయవివాదాలు పరిష్కరించి నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ భరత్‌ కోరారు. చేయూత లబ్ధిదారులైన గుడుపల్లె, బంగారుపాళ్యం మండలాల మహిళా గ్రూపు సభ్యురాళ్లు సుబ్బమ్మ, మరియమ్మ చేత అధికారులు మాట్లాడించారు.మంత్రులు ఉష శ్రీచరణ్‌, ఆర్‌కే రోజా, ఎంపీలు రెడ్డెప్ప, మిథున్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ద్వారకనాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, వెంకటేగౌడ, ఎంఎస్‌ బాబు, ఆరణి శ్రీనివాసులు, సంజీవయ్య,సీఎం పర్యటన కార్యక్రమాల కోఆర్డినేటర్‌ తలశిల రఘు రాం, ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ విజయానందరెడ్డి, రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌కుమార్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

దారులన్నీ బంద్‌..

కుప్పంలోకి వచ్చే అన్ని రహదారులనూ పోలీసులు దిగ్బంధనం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ద్విచక్ర వాహనాలను కూడా అడ్డుకున్నారు. తాము స్థానికులమని తమ ఇళ్లు పక్కనే ఉన్నాయని ఎంత ప్రాధేయపడినా పోలీసులు ససేమిరా అన్నారు. కృష్ణగిరి హైవేలో నడింపల్లె వద్దే భారీ వాహనాలతో పాటు బస్సులు, కార్లు, ఇతర అన్ని రకాల వాహనాలను ఆపేశారు. చంటిబిడ్డలతో తాగునీరైనా లేకుండా  ఇబ్బంది పడుతున్నామని ఎంత చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కృష్ణగిరి ఆస్పత్రికి వెళ్ళి తిరిగి వచ్చిన ఓ కుటుంబాన్ని ఎంత బతిమలాడినా కుప్పం పట్టణంలోకి పోలీసులు అనుమతించలేదు. సీఎం ప్రోగ్రాం ముగిసేవరకు వదిలేది లేదని తెగేసి చెప్పారు. చంటిపిల్లలతో ఉన్న ఆ కుటుంబం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నడుమూరు వద్ద గంటల తరబడి వేచిఉన్న ప్రయాణికులు అసలు జాతీయ రహదారిపై పోలీసుల ఆంక్షలు ఏమిటని ప్రశ్నించారు.

వలంటీర్లకు నీళ్ల పనులు

వలంటీర్లను పూర్తిగా వినియోగించుకున్నారు. బారికేడ్ల పొడవునా నిలబెట్టి, జనాలకు స్నాక్స్‌, నీళ్లు అందించే విధులు కేటాయించారు. జనంనుంచి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తే అటువంటి వారిని గుర్తించి సమాచారమివ్వాలన్న ఆదేశాలు కూడా వారికి పార్టీ నేతలు, అధికారులనుంచి అందాయని తెలిసింది.

కుప్పం ఎన్టీఆర్‌ కూడలిలో బంద్‌ వాతావరణం

కుప్పంలో రెండు రోజులనుంచే బంద్‌ వాతావరణం ఏర్పడింది. సీఎం ప్రయాణించే మార్గంలోనే కాదు, హెలిప్యాడ్‌తోపాటు పక్కనే ఉన్న వీధులకు అడ్డంగా కూడా రెండంచెల బారికేడ్లు ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది పోలీసు బలగాలు దిగిపోయి ఎక్కడికక్కడ కుప్పాన్ని అష్టదిగ్బంధనం చేసేశారు. శుక్రవారంనాడు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. కనీసం ఉద్యోగులు తమ ఇళ్లనుంచి విధులకు వెళ్లడానికి, జనం ఇతర అవసరాలకు రాకపోకలు సాగించడానికి కూడా వీలుకాకుండా పోయింది. ఇది చాలదన్నట్లుగా ఇతర ప్రాంతాలనుంచి బస్సుల్లో రప్పించిన జనాన్ని బారికేడ్ల నిండుగా కుక్కేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఉన్న అన్ని దుకాణాలను మూయించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. 

చెట్లూపుట్టలు పట్టుకుని జనం

శుక్రవారం తెల్లవారుజామునుంచే సభాస్థలికి జనం తరలింపు ప్రారంభమైంది. సభా స్థలి చిన్నది కావడంతో ఉదయం 8గంటలకే  నిండిపోయింది. మిగిలిన జనం చెట్లూపుట్టలు పట్టుకుని తిరిగారు. ఇతర ప్రాంతాలనుంచి బలవంతంగా తరలించినవారు కావడంతో సభ పట్ల వారిలో ఆసక్తి కనిపించలేదు. చెట్ల వద్ద, వాహనాల నీడలో సేద తీరుతూ కనిపించారు. 

ఆకలి కేకలు

 చిత్తూరుతోపాటు తిరుపతి జిల్లానుంచి కూడా జనాలను రప్పించే ఉత్సాహం వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో చూపలేదు. నియోజకవర్గాల వారీగా భోజనాలను అందజేయడానికి స్టాళ్లవంటివి ఏర్పాటు చేశారు కానీ, ముందుగా వచ్చినవారికి తప్ప, చాలామందికి భోజనాలు అందలేదు. కనీసం దాహమేస్తే నీళ్లు అందించేవారు కూడా లేకుండా పోయారు. స్టాళ్ల దగ్గర భోజనాలకోసం  నిర్వాహకులతో గొడవకు దిగడం కనిపించింది.

కనీసం విండో తీయని సీఎం

ముఖ్యమంత్రి జగన్‌ కుప్పం పట్టణంలో ర్యాలీగా వస్తారని, ఆ దారిలో బారికేడ్ల పొడవునా ఇతర ప్రాంతాలనుంచి తెచ్చిన జనాన్ని నింపేశారు. అయితే జగన్‌, హెలిప్యాడ్‌నుంచి సభాస్థలిదాకా బస్సులోనే ప్రయాణించారు. కనీసం విండో కూడా తీయలేదు. లోపలివైపునుంచే చేయి ఊపుతూ వెళ్లిపోయారు. 

స్పష్టమైన హామీలివ్వని జగన్‌

చంద్రబాబు కుప్పానికి ఏమీ చేయలేదని పదేపదే ఆక్షేపించడానికే సీఎం జగన్‌ తన ప్రసంగంలో ఎక్కువ సమయం కేటాయించుకున్నారు. అయితే అధికారానికి వచ్చిన ఈ మూడేళ్లలో తాను ఏం చేశారో చెప్పుకోలేకపోయారు.మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.66 కోట్లు మంజూరు చేయడం తప్ప, ఇంకేమీ చెప్పుకోవడానికి లేకుండా పోయింది. హంద్రీ-నీవా కాలువను ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్నారు కానీ, ఈ మూడేళ్లలో చేయలేనిది, ఆరు నెలల్లో ఎలా చేస్తారో చెప్పలేదు.


Updated Date - 2022-09-24T06:47:05+05:30 IST