Advertisement

దళితులను బహిష్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలి

Jan 24 2021 @ 00:53AM

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ను కోరిన డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌ 

విచారణ చేపట్టాలని డీఎస్పీకి చైర్మన్‌ ఆదేశం 


మెదక్‌, జనవరి 23: మెదక్‌ మండలం రాయిన్‌పల్లి గ్రామంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివా్‌సను డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌ కోరారు. అందుకు చైర్మన్‌ సానుకూలంగా స్పందించారని శంకర్‌ తెలిపారు. ఈ మేరకు మెదక్‌ పోలీసులను కమిషన్‌ చైర్మన్‌ చర్యలకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. రాయిన్‌పల్లి గ్రామానికి చెందిన నీరుడి వెంకటస్వామి బీసీ కులానికి చెందిన యువతి ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. ఇది సహించలేని బీసీలు ఆ యువతికి రెండు నెలల క్రితం బలవంతంగా వివాహం చేశారన్నారు. అయితే సదరు యువతి తనను తీసుకెళ్లాలని దళిత  యువకుడిని ఫోన్‌ ద్వారా కోరినట్లు తెలిపారు. ఇది సహించలేని బీసీలు గ్రామంలో పంచాయితీ పెట్టి దళిత కుటుంబానికి రూ.12 లక్షల జరిమానా విధించారని చైర్మన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దళిత కుటుంబాలను సాంఘికంగా బహిష్కరించాలని గ్రామస్థులు తీర్మానించినట్లు వివరించారు. తమకు జరిగిన అన్యాయంపై శనివారం దళిత బహుజన ఫ్రంట్‌ (డీబీఎఫ్‌) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు విన్నవించారు. బాధితుల వినతికి స్పందించిన చైర్మన్‌, మెదక్‌ డీఎస్పీకి ఫోన్‌ చేసి సంఘటనా పూర్వపరాలను తెలుసుకున్నారు.  సాంఘిక బహిష్కరణను ఎత్తివేసి దళితులకు న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్‌ రాష్ట్ర నాయకులు పులి కల్పన, బాధితుడు పోచయ్య, విశ్వనాథ్‌, చంద్రం తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement