ఆ‘పే’శారు ఎందుకో?

ABN , First Publish Date - 2021-05-19T05:17:18+05:30 IST

-నెహ్రూ పార్కు...పలాస-కాశీబుగ్గ జంట పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఏకైక ఉద్యానవనం. మునిసిపల్‌ తొలి పాలకవర్గం హయాంలో ముత్యాలమ్మ కోనేరును పార్కుగా తీర్చిదిద్దారు. వాకింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటుచేశారు. దీంతో నిత్యం వాకర్స్‌, పర్యాటకులతో పార్కు కిటకిటలాడేది. గత ఏడాది వరకూ విశేష సేవలందించేది. కానీ పాలకవర్గం లేని సమయంలో..ఏడాది కిందట అధికారులకు ఒక తలంపు వచ్చింది. రూ.70 లక్షలతో పార్కు ఆధునికీకరణ పనులు చేయడానికి నిర్ణయించారు. వెనువెంటనే టెండర్‌ ప్రక్రియను సైతం పూర్తిచేశారు

ఆ‘పే’శారు ఎందుకో?
అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు


నెహ్రూ పార్కు ఆధునికీకరణకు ముందస్తు చెల్లింపులు

20 శాతం పనులకు రూ.30 లక్షలు

అయినా మధ్యలో నిలిపేసిన కాంట్రాక్టర్లు

పెద్దఎత్తున చేతులు మారినట్టు ఆరోపణలు

(పలాస)

ఏవైనా నిర్మాణాలు చేపట్లినపుడు పనుల పురోగతిని చూసుకొని కాంట్రాక్టర్లకు విడతల వారీగా బిల్లులు చెల్లించడం సహజం. కానీ పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీలో మాత్రం వింత పరిస్థితి. ఇక్కడ ఓ పార్కు నిర్మాణ పనులు పూర్తికాకుండానే రూ.30 లక్షలు చెల్లించారు. మొత్తం రూ.70 లక్షలతో పార్కు సుందరీకరణ పనులు చేపడుతుండగా...20 శాతం పనులు కాకుండానే సగం నిధులు చెల్లించడం విమర్శలకు తావిస్తోంది. గతంలో పూర్తయిన పనులకే బిల్లులు చెల్లించని పరిస్థితులు ఉండగా... ఇందుకు విరుద్ధంగా చేయని పనులకు ఎలా చెల్లించారో మునిసిపల్‌ అధికారులకే తెలియాలి.  

-నెహ్రూ పార్కు...పలాస-కాశీబుగ్గ జంట పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఏకైక ఉద్యానవనం. మునిసిపల్‌ తొలి పాలకవర్గం హయాంలో ముత్యాలమ్మ కోనేరును పార్కుగా తీర్చిదిద్దారు. వాకింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటుచేశారు. దీంతో నిత్యం వాకర్స్‌, పర్యాటకులతో పార్కు కిటకిటలాడేది. గత ఏడాది వరకూ విశేష సేవలందించేది. కానీ పాలకవర్గం లేని సమయంలో..ఏడాది కిందట అధికారులకు ఒక తలంపు వచ్చింది. రూ.70 లక్షలతో పార్కు ఆధునికీకరణ పనులు చేయడానికి నిర్ణయించారు. వెనువెంటనే టెండర్‌ ప్రక్రియను సైతం పూర్తిచేశారు. పనుల్లో భాగంగా పార్కులో మొక్కలు, పచ్చికబయళ్లు, ఆటవస్తువులు, ఫ్లోరింగ్‌ టైల్స్‌ మొత్తం అన్నీ యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. పార్కు గట్టుపై మీటరు ఎత్తులో మట్టిని పోశారు. చెరువు చుట్టూ రాళ్లతో గోడ నిర్మించారు. దాదాపు నెలరోజుల పాటు పనులు చకచకా సాగడంతో జంట పట్టణవాసులు ఎంతో ఆనందించారు. కానీ ఎందుకో కాంట్రాక్టర్లు మధ్యలో పనులు నిలిపివేశారు. 20 శాతం పనులు కూడా పూర్తికాలేదు. నిధుల కొరత అంటే అదీ లేదు. మొత్తం రూ.70 లక్షలకుగాను..రూ.30 లక్షలు ముందుగానే చెల్లించారు. మునిసిపాల్టీలో రహదారులు, కాలువలు, వీధి ధీపాలు, తాగునీటి కోసం వినియోగించాల్సిన సాధారణ నిధులు రూ.20 లక్షలు,  14వ ఆర్ధిక సంఘం నిధుల్లో రూ.10 లక్షలు కాంట్రాక్టర్లకు చెల్లించారు. కేవలం మట్టి, గోడలకు ఇంత భారీ మొత్తంలో చెల్లించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చేసిన పనులకే బిల్లులు చెల్లించని ఇంజనీరింగ్‌ శాఖ... పార్టు పేమెంట్లే భారీ మొత్తంలో చెల్లించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మునిసిపాల్టీలో లక్షలాది రూపాయలతో పనులు పూర్తిచేసినా చాలామంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో మునిసిపాల్టీలో పనులంటేనే వారు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నెహ్రూ పార్కు ఆధునికీకరణ విషయంలో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలని జంట పట్టణవాసులు కోరుతున్నారు. 


వివరణ కోరాం

ముత్యాలమ్మ కోనేరు-నెహ్రూ పార్కు ఆధునికీకరణ పనులు నిలిపివేయడం దురదృష్టకరం. దీనిపై సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లకు వివరణ కోరాం. ముందస్తుగా రూ.30 లక్షలు ఎందుకు చెల్లించారో ఆరా తీస్తున్నాం. దీనిపై విచారణ చేపట్టి అవకతవకలు జరిగి ఉంటే చర్యలకు సిఫారసు చేస్తాం.

-బళ్ల గిరిబాబు, మునిసిపల్‌ చైర్మన్‌

-రాజగోపాలరావు, కమిషనర్‌, పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీ




Updated Date - 2021-05-19T05:17:18+05:30 IST