దూకుడు

ABN , First Publish Date - 2021-02-28T06:00:28+05:30 IST

రంగారెడ్డి- హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారింది. అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

దూకుడు

  • పట్ట భద్రుల ఎమ్మెల్సీప్రచారంలో సీనియర్లు
  • జిల్లాల వారీగా ఇన్‌చార్జిల నియామకం
  • ఉమ్మడి జిల్లా బాధ్యతలు హరీష్‌కు అప్పగించిన టీఆర్‌ఎస్‌
  •  బీజేపీ అభ్యర్ధి తరపున సీనియర్లు రంగ ప్రవేశం 
  •  కాంగ్రెస్‌ తరపున రేవంత్‌రెడ్డి విస్తృత ప్రచారం
  •  ఫ్రొఫెసర్‌ నాగేశ్వర్‌ తరపున వామపక్షాలు,  ప్రజాసంఘాలు

 

రంగారెడ్డి- హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల  నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారింది.  అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. శాసనమండలి ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి కీలకం కావడంతో ఆయా రాజకీయ పార్టీలు  జిల్లాపైనే దృష్టి సారించాయి.  ప్రచారం ఊపందుకుంటోంది.  భారీ సంఖ్యలోనే అభ్యర్ధులు పోటీ చేస్తున్నప్పటికీ  ప్రధానంగా చతుర్ముఖ పోటీ  నెలకొంది. 


(ఆంరఽధజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ  ఎన్నిక ప్రచారం హోరెత్తుతోంది.  ఎమ్మెల్సీఎన్నికలు  ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారడంతో గెలుపునకు  సర్వశక్తులు ధారబోస్తున్నాయి. శాసనమండలి ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డిజిల్లానే కీలకం కావడంతో ఆయా రాజకీయ పార్టీలు ఇక్కడ ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాయి.  ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు పోటీపడి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.   ఈ ఎన్నికలో భారీ సంఖ్యలోనే అభ్యర్ధులు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా చతుర్ముఖపోటీ జరుగుతోంది. అధికార టీఆర్‌ఎ్‌సతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌, స్వతంత్య్ర అభ్యర్ధి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మధ్య పోటీ ఉత్కంఠ నెలకొంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీదేవీ పోటీ చేస్తుండగా, బీజేపీ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్సీ  రామచంద్రరావు మళ్లీ బరిలో దిగారు. ఇక కాంగ్రెస్‌ తరపున మాజీ మంత్రి చిన్నారెడ్డి, టీడీపీ తరపున పార్టీ రాష్ట్ర అధ్యక్షడు ఎల్‌ రమణ పోటీ చేస్తున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్ధిగా  బరిలో దిగిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో పకడ్భందీగా ఎన్నికల వ్యూహరచన చేస్తోంది.  క్షేత్రస్థాయిలో ప్రచార కమిటీలు ఏర్పాటు చేస్తోంది. ప్రతి రోజూ ప్రచార సభలు, సమావేశాలు ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక  ఇన్‌చార్జిలను కూడా నియమించింది. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాకు మంత్రి హరీ్‌షను ఇన్‌చార్జిగా నియమించింది. శనివారం ఆయన ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరో వైపు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో మంత్రి సబితారెడ్డి కూడా విస్తృతంగా ప్రచార సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్లు ఎన్నికల  ప్రచారాల్లో పాల్గొంటున్నారు.  మేడ్చల్‌ జిల్లాలో మంత్రి  మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక బీజేపీ తరపున రాష్ట్ర  నాయకులంతా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ  అనుబంధ సంఘాలు క్షేత్రస్థాయిలో చాపకింద నీరులా ప్రచారం నిర్వహిస్తున్నాయి. సిట్టింగ్‌ స్థానం కావడంతో    నిలబెట్టుకునేందుకు బీజేపీ నాయకత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ కేంద్ర నాయకులు కూడా రానున్నారు. ఇక కాంగ్రెస్‌ కూడా ఉనికి కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. టీపీసీసీ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా అంతటా తిరుగుతున్నారు. అభ్యర్ధి చిన్నారెడ్డికి మద్ధతుగా ఆయన నగర శివారు ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం  నిర్వహిస్తున్నారు. వీడియో,  టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా మరో సారి బరిలో దిగిన  నాగేశ్వర్‌ తరపున వామపక్షాలు, ప్రజాసంఘాలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. నాగేశ్వర్‌ గతంలో మాదిరిగానే ఆర్భాటం లేకుండా వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండుసార్లు నెగ్గిన ఆయన మూడోసారి  గెలుపు కోసం కష్టపడుతున్నారు. 

Updated Date - 2021-02-28T06:00:28+05:30 IST