కదలిక లేని కల్లాలు

ABN , First Publish Date - 2021-02-24T05:11:25+05:30 IST

కష్టపడి పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు స్థలం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

కదలిక లేని కల్లాలు
యాచారం మండలం చౌదర్‌పల్లి గ్రామంలో నిర్మాణ దశలో కల్లం

  • నత్తలు నవ్వేలా పనులు
  • ఇప్పటి వరకు 147 నిర్మాణాలే పూర్తి
  • అడ్డంకిగా మారుతున్న నిబంధనలు


కష్టపడి పండించిన ధాన్యాన్ని  ఆరబెట్టుకునేందుకు స్థలం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట చేతికొచ్చిన ప్రతీసారి తాత్కాలిక కల్లాలు ఏర్పాటు చేసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వాలు కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. కానీ, వీటి నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. అదేవిధంగా నిబంధనలు కూడా అడ్డంకిగా మారుతున్నాయి. అధికారులు అవగాహన కల్పించడంలో విఫలమవ్వడంతో కల్లాల ఏర్పాటుకు రైతులు ముందుకు రావడం లేదు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టిన కల్లాల నిర్మాణాలు రంగారెడ్డి జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. ధాన్యాన్ని ఆరబెట్టాలన్నా... వర్షం వస్తే తడవకుండా కాపాడుకోవాలన్నా.. తూర్పార పట్టాలన్నా స్థలం లేకపోవడం, ధాన్యంలో మట్టి పెల్లలు కలిసి నాణ్యత తగ్గిపోవడం, ఫలితంగా సరైన ధర రాకపోవడం వంటి సమస్యలు రైతులకు ఎదురవుతున్నాయి. వీటిని నివా రించేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కల్లాల నిర్మాణాలు ముందుకు కదలడం లేదు. 

పంట కాలానికి ప్రారంభంలో పెట్టుబడి సాయం అందిం చడం నుంచి వివిధ రకాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథ కాలు అమలు చేస్తున్నాయి. పంట కొనుగోలు చేసే సమయంలో కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కల్లాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. రైతులు తమ సొంత భూముల్లో వినూత్నంగా కల్లాలు నిర్మించు కునేందుకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోంది. ఉపాధిహామీ పథకం నిధులు ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, మిగతా వారికి 90 శాతం సబ్సిడీ ఇవ్వనుంది.


నిర్మాణ స్వరూపం

రైతులు తమ వ్యవసాయక్షేత్రాల్లో కల్లాలు నిర్మించుకునేందుకు ప్రభు త్వం మూడు రకాల డిజైన్లు తయారు చేసింది. వీటిలో అనుకూల మైన దాన్ని ఎంచుకొని నిర్మించుకోవచ్చు. రూ.56 వేలతో 50 స్క్వేర్‌ మీటర్లతో 538 ఫీట్లు, రూ.68 వేల ఖర్చుతో 60 స్క్వేర్‌ మీటర్లతో 645 ఫీట్లు, రూ.85వేల ఖర్చుతో 75 స్క్వేర్‌ మీటర్లతో 807 ఫీట్ల కల్లాలు నిర్మించు కునేలా డిజైన్లు చేసింది. వీటిని ఎక్కడపడితే అక్కడ కాకుండా.. సం బంధిత రైతు పంట భూమిలోనే నిర్మించాల్సి ఉం టుంది. సదరు భూమి సర్వేనెంబరు లైవ్‌ లొకేషన్‌ నిర్ధారించిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలి. ఇందుకు బీసీ రైతులకు అయితే 10 శాతం కట్‌చేసి వారికే మిగిలిన శాతం డబ్బు చెల్లిస్తారు.


అనాసక్తికి కారణాలు..!

ఈ పథకానికి రైతులకు ఐదెకరాలలోపు వ్యవసాయ భూమి ఉండి.. తప్పనిసరిగా జాబ్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం ఉండాలనే నిబంధనలు కల్లాల నిర్మా ణాలకు అడ్డంకిగా మారాయి. గ్రామాల్లో అధికశాతం రెండు నుంచి నాలుగు ఎకరాలున్న రైతులే ఉన్నారు. తక్కువ భూమిలో 50 నుంచి 75 చదరపు గజాల్లో కల్లం నిర్మించడానికి ముందుకు రావడం లేదని తెలు స్తోంది. డబ్బులు లేక కొందరు, మరికొంత మంది ఉపాధిహామీ బిల్లులు సకాలంలో అందవనే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. ఆసక్తిలేని వారి రైతుల స్థానంలో నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.


డబ్బుల కోసం తిరుగుతున్నా..

రూ.85 వేల ఖర్చుతో 75 స్కేర్‌మీటర్లతో 807 ఫీట్ల ఫ్లాట్‌ ఫాంను పొలంలో నిర్మించుకు న్నాను. ఇప్పటివరకు రూ. 13 వేలు ఇచ్చారు. ఇంకా మిగతా డబ్బులు ఇవ్వలేదు. డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అప్పు చేసి కల్లాన్ని నిర్మించుకున్నాను. అధికారులు త్వరగా డబ్బులు ఇప్పించాలి. 

- పర్వత్‌రెడ్డి, రైతు, మధురాపూర్‌ గ్రామం, ఫరూక్‌నగర్‌ మండలం.


పనుల్లో వేగం పెంచుతున్నాము

లబ్ధిదారులు ముందుగా డబ్బు ఖర్చు చేసుకుని కల్లాలు నిర్మించుకోవాలి. తర్వాత ఉపాధిహామీ ద్వారా డబ్బు మంజూరవుతుంది. ఇప్పటి వరకు 147 కల్లాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో సగం వరకు పేమెంట్‌ జరిగింది. ఇంకా 387కల్లాల నిర్మాణాలు కొనసాగు తున్నాయి. నిర్మాణాల్లో వేగం పెంచేలా కృషి చేస్తున్నాం.

- నీరజ, ఈజీఎస్‌ ఏపీడీ


చిన్న సన్నకారు  రైతులు : 2,11,321

జిల్లాలో కల్లాల లక్ష్యం 6,782  

కేటాయించిన రూ.37.97 కోట్లు

మంజూరైన కల్లాలు : 4,970 

పూర్తయినవి : 147

పురోగతిలో ఉన్నవి : 387

ఇంకా ప్రారంభం కానివి : 4,436



Updated Date - 2021-02-24T05:11:25+05:30 IST