మూడో దశపై అప్రమత్తం

ABN , First Publish Date - 2021-06-10T04:01:39+05:30 IST

కరోనా మహమ్మారి వివిధ రూపాల్లో ప్రజలను పీల్చిపిప్పి చేస్తోంది. ఒకవైపు రెండో దశ విజృంభణ కొనసాగుతుండగానే మూడో దశ కలవరపెడుతోంది. రెండో దశ దెబ్బకు అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇప్పుడు మూడో దశ వైరస్‌ వ్యాప్తి ప్రధానంగా పదేళ్లలోపు చిన్నారులపై ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకటి, రెండోదశల కంటే మూడో దశ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూడో దశపై అప్రమత్తం


 చిన్నారులపైనే ప్రభావం ఎక్కువ!

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా మహమ్మారి వివిధ రూపాల్లో ప్రజలను పీల్చిపిప్పి చేస్తోంది. ఒకవైపు రెండో దశ విజృంభణ కొనసాగుతుండగానే మూడో దశ కలవరపెడుతోంది. రెండో దశ దెబ్బకు అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇప్పుడు మూడో దశ వైరస్‌ వ్యాప్తి ప్రధానంగా పదేళ్లలోపు చిన్నారులపై ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకటి, రెండోదశల కంటే మూడో దశ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తత, స్వీయ నియంత్రణతో దీన్ని అడ్డుకొనేందుకు ప్రతిఒక్కరూ సిద్ధం కావాలని సూచిస్తున్నారు. తొలి దశలో ఈ మహమ్మారికి వయసు మళ్లినవారు ఎక్కువమంది బలయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న రెండో దశలో 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారిని పొట్టన పెట్టుకుంటోంది. జిల్లాలో సుమారు ఐదు వందల మంది కరోనా బారిన పడి మృతిచెందారు. తాజాగా మూడో దశ కలవరపెడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులపై, పౌష్టికాహారం లోపం ఉన్న పిల్లలపై మూడో దశ ప్రభావం చూపుతుంది. ప్రతిరోజూ రిమ్స్‌, జెమ్స్‌, తదితర కొవిడ్‌ ఆసుపత్రులకు పదుల సంఖ్యలో చిన్నారులు వస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.   


జాగ్రత్తలు తప్పనిసరి 

ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడా చిన్నారులు కరోనా వైరస్‌ బారిన పడలేదు. కలెక్టర్‌ ఆదేశాలతో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం. ఐసీడీఎస్‌ అధికారులతో కలిసి గ్రామీణ ప్రాంతాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కల్పిస్తున్నాం. చిన్నారులపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు చెబుతున్నాం.  

- చంద్రనాయక్‌, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం



Updated Date - 2021-06-10T04:01:39+05:30 IST