అందరి దృష్టి ఆయన పైనే

ABN , First Publish Date - 2021-07-27T03:55:18+05:30 IST

చిల్‌పచెడ్‌ జడ్పీటీసీకి, టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన శేషసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతున్నది.

అందరి దృష్టి ఆయన పైనే

రాజీనామా అనంతరం అందుబాటులో లేని జడ్పీటీసీ శేషసాయిరెడ్డి 

బుజ్జగించేందుకు టీఆర్‌ఎస్‌ యత్నం

కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల ఆసక్తి

నర్సాపూర్‌, జూలై 26: చిల్‌పచెడ్‌ జడ్పీటీసీకి, టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన శేషసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతున్నది. దివంగత  సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నేత కిషన్‌రెడ్డి కుమారుడైన శేషసాయిరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి కూడా సమీప బంధువు. శేషసాయిరెడ్డి జూలై 10న పార్టీకి రాజీనామా చేస్తూ ఏకంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు లేఖ పంపగా నాలుగు రోజుల తర్వాత జడ్పీటీసీ పదవికి సైతం రాజీనామా చేస్తూ మరో లేఖను జడ్పీ సీఈవోకు పంపించారు. ప్రస్తుతం ఈ రెండూ ఆమోదం పొందనప్పటికీ ఆయనను బుజ్జగించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పదవికి  రాజీనామా చేసిన శేషసాయిరెడ్డి మరునాటి నుంచే ఎవరికీ అందుబాటులో ఉండకుండా యాత్రకు వెళ్లడంతో ఆయన భవిష్యత్‌ నిర్ణయం ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే విషయమై టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఎదురు చూస్తుండగా, మరోవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ కూడా పార్టీ మారే అవకాశంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కాగా నర్సాపూర్‌ నియోజకవర్గంలోని టీఆర్‌ఎ్‌సలో అసంతృప్తులు చాలా మందే ఉన్నట్టు సమాచారం. వీరు కూడా శేషసాయిరెడ్డి అడుగు జాడల్లో నడిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-07-27T03:55:18+05:30 IST