ఎల్లమ్మ చెరువు నుంచి నీటి వృథా

ABN , First Publish Date - 2021-05-07T05:39:47+05:30 IST

హుస్నాబాద్‌ ఎల్లమ్మ చెరువు తూము నుంచి నీరు వృఽథాగా పోతున్నా, నీటి పారుదల శాఖ అఽధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు.

ఎల్లమ్మ చెరువు నుంచి  నీటి వృథా
చెరువు తూము నుంచి వృథాగా పోతున్న నీరు

ఐదారు నెలలుగా తూము నుంచి  లీకేజీ

పంట కోత సమయంలో రైతులకు ఇక్కట్లు

అధికారుల నిర్లక్ష్యంతో భవిష్యత్తులో నీటి గండం

హుస్నాబాద్‌,మే 6: హుస్నాబాద్‌ ఎల్లమ్మ చెరువు తూము నుంచి నీరు వృఽథాగా పోతున్నా, నీటి పారుదల శాఖ అఽధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో భవిష్యత్తులో నీటి గండం పొంచిఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1600 ఎకరాల ఆయకట్టుకు హుస్నాబాద్‌ ఎల్లమ్మ చెరువు నుంచి సాగునీరందుతున్నది. ఈసారి సమృద్ధిగా వర్షాలు కురియడంతో చెరువుకు జలకళ ఉట్టిపడుతున్నది. ఒకసారి ఈ చెరువు నిండితే రెండేళ్లదాక ఆయకట్టు రైతులకు నీటి గోస ఉండదు. అంతే కాకుండా హుస్నాబాద్‌ పరిసర ప్రాంత బావుల్లో భూగర్భ జలాలకు సైతం లోటుండదు.  


వరి కోతల వేళ తప్పని ఇక్కట్లు 

 చెరువుకు పడమర వైపు ఉన్న తూము నుంచి ఐదారు నెలలుగా  లీకేజీ ఏర్పడి నీరు వృఽథాగా పోతున్నది. మొన్నటి వరకు ఈ తూము ద్వారా లీకైన నీటితో  వ్యవసాయ పొలాలు పారాయి. ప్రస్తుతం కోతల సమయంలో కూడా నీరు వస్తుండటంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వరి పొలాల్లో హర్వేస్టర్లు నడువలేక కోతలు సాగడం లేదు. వడగండ్ల వర్షాలు వచ్చినట్లయితే తీవ్రంగా నష్టపోతామని రైతులు పేర్కొంటున్నారు. తూము వద్ద ఇసుక బస్తాలు వేసి నీరు లీక్‌ కాకుండా చూడాలని పలుమార్లు సంబంధిత అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు.ఇలాగే చెరువులోని నీరు వృథాగా పోయినట్లయితే వచ్చే సంవత్సరం సాగు నీటికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తూము నుంచి నీరు పోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.   

Updated Date - 2021-05-07T05:39:47+05:30 IST