అతిథిగృహానికి నోచుకోని ఆమనగల్లు

ABN , First Publish Date - 2021-04-24T04:46:06+05:30 IST

అతిథిగృహానికి నోచుకోని ఆమనగల్లు

అతిథిగృహానికి నోచుకోని ఆమనగల్లు
ఆమనగల్లులోని అటవీ శాఖ అతిథి గృహం(ఫైల్‌)

  • చొరవ చూపని ప్రజాప్రతినిధులు, అధికారులు 
  • ప్రతిపాదనతోనే సరి.. హామీలిచ్చి మరిచిన నాయకులు

ఆమనగల్లు : పట్టణం(ఆమనగల్లు)లో ఆర్‌అండ్‌బీ అతిథి గృహ నిర్మాణం హామీలకే పరిమితమైంది. నాలుగు మండలాల ప్రధాన కూడలిగా, శ్రీశైలం-హైద్రాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న ఆమనగల్లులో అతిథి గృహం లేకపోవడంతో అతిథులు, పర్యాటకులు, ముఖ్యంగా ఉన్నతాధికారులు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఇక్కడ ఉన్న నిజాం కాలం నాటి అటవీశాఖ అతిథి గృహాన్ని మావోస్టులు పేల్చివేశారు. ఆ తర్వాత మూడు దశాబ్దాలు గడిచినా పునరుద్ధరణకు నోచుకోలేదు. కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. కాగా ఆమనగల్లు మండలంలో ఏ ఒక్క శాఖకు కూడా అతిథి గృహం లేదు. జిల్లా ఉన్నతాధికారులు, మంత్రులు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి, కనీసం కాలకృత్యాలు తీర్చుకోడానికి పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కావు. వారంతా రాజకీయ నాయకులు, కార్యకర్తల ఇళ్లలోనే విలేకరుల సమావేశాలు, విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. పట్టణంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నిర్మించాలని మండల సర్వసభ్య సమావేశాల్లో కూడా అనేక పర్యాయాలు ఏకగ్రీవ తీర్మానం చేసి ఉన్నతాధికారులకు నివేదించినా స్పందన లేదు. గతంలో అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అతిథి గృహ నిర్మాణానికి హామీలిచ్చినా అమలుకు నోచుకోలేదు. అయితే ఆమనగల్లు పట్టణంలో అనేకచోట్ల ప్రభుత్వ స్థలాలు అతిథి గృహ నిర్మాణానికి అనువుగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని అతిథి గృహాన్ని నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-04-24T04:46:06+05:30 IST