యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జా

ABN , First Publish Date - 2022-08-12T05:06:00+05:30 IST

శంకర్‌పల్లి మండలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రెచ్చిపోతున్నారు.

యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జా
ప్రొద్దటూర్‌లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన భవనం

  • పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు
  • న్యాయం చేయాలంటున్న ప్రొద్దటూర్‌ గ్రామ రైతులు


శంకర్‌పల్లి, ఆగస్టు 11 : శంకర్‌పల్లి మండలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నా రెవెన్యూ అధికారులు నిద్ర మత్తు వీడడం లేదు. మండలంలోని ప్రొద్దటూర్‌, మోకిల, జన్‌వాడ, ఇంద్రారెడ్డి నగర్‌, పిల్లిగుండ్ల తదితర గ్రామాలలో అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను దౌర్జన్యంగా కబ్జా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రొద్దటూర్‌ గ్రామంలో భారత ఆర్మీ జవాన్‌కు చెందిన భూములను కొనుగోలు చేసి అనుమతులు లేకుండా కొందరు నిర్మాణాలు చేపట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రొద్దటూర్‌ గ్రామంలో నగరానికి చెందిన సినీ నిర్మాత  సర్వేనెం 351లోని 4 ఎకరాల అసైన్డ్‌ భూమిని కొనుగోలు చేసి చుట్టూ ప్రహరీ గోడలను నిర్మించడమే కాకుండా పెద్దచెరువు, ఎనె చెరువులలో కొంతభాగాన్ని కబ్జా చేశారని, బొందలను సైతం పూడ్చి ఆక్రమించుకున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. నగరానికి చెందిన రియల్టర్‌ 337 సర్వే నెంబర్‌లోని ప్రభుత్వ భూమిని కబ్జాచేసి చుట్టూ ప్రహరీ నిర్మించి రైతులు పొలాలకు వెళ్లే దారులను మూసివేశారని రైతులు వాపోయారు. సర్వే నెం 256, 257, 258, 296, 270లలో రైతులు తమ పొలాలకు వెళ్లకుండా చుట్టూ ప్రహరీ నిర్మించి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా, వారి భూములను తక్కువ ధరకే అమ్మాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన స్థానిక నాయకుల అండదండలతో కాసులకు కక్కుర్తి పడి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా కబ్జా దారులకే వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. 292, 296 సర్వే నెంబర్‌లో 6 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎలాంటి పత్రాలు లేకుండా ఫాంహౌజ్‌ నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తే నామమాత్రపు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, జిల్లా ఉన్నత అధికారులు స్పందించి రైతులకు, గ్రామస్థులకు న్యాయం చేయాలని కోరారు.


ప్రభుత్వ భూములను కాపాడండి 

శంకర్‌పల్లి మండలం ప్రొద్దటూర్‌ గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కుల బారినుంచి రక్షించాలని గతంలో తహసీల్దార్‌, ఆర్డీవోకు వినతిపత్రాలు అందచేశాం. అధికారులు, స్థానికనాయకుల అండతో గ్రామంలో అక్రమార్కులు యథేచ్ఛగా భూ ములను కబ్జా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా. రైతుల న్యాయం చేయడానికి ఎంత దూరమైన వెళ్తా.

- మందుమూల లక్ష్మణ్‌, బీఎస్పీ మండల అధ్యక్షుడు


ప్రభుత్వ భూములను అమ్మినా.. కొన్నా చట్టరీత్యా నేరం

ప్రభుత్వ భూములను విక్రయించినా.. కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరం. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

- నయీముద్దీన్‌ శంకర్‌పల్లి తహసీల్దార్‌ 



Updated Date - 2022-08-12T05:06:00+05:30 IST