దొంగ ఓట్లు వేసుకున్న మంత్రులు ఇప్పుడేమయ్యారు?

ABN , First Publish Date - 2021-11-26T06:47:13+05:30 IST

‘దొంగ ఓట్లు వేసుకున్న మంత్రులు ఈ వరద పరిస్థితుల్లో మాయమయ్యారు. సీఎం జగన్‌ గాల్లో చక్కర్లు కొట్టారు.

దొంగ ఓట్లు వేసుకున్న మంత్రులు ఇప్పుడేమయ్యారు?
వరద బాధితులతో మాట్లాడుతున్న చింతామోహన్‌

వరదసాయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం 

కేంద్రమాజీ మంత్రి చింతామోహన్‌ విమర్శ 


తిరుపతి(కొర్లగుంట), నవంబరు 25: ‘దొంగ ఓట్లు వేసుకున్న మంత్రులు ఈ వరద పరిస్థితుల్లో మాయమయ్యారు. సీఎం జగన్‌ గాల్లో చక్కర్లు కొట్టారు. వరద నీటి ప్రవాహన్ని అరికట్టడం, బాధితులకు సాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది’ అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ ఆరోపించారు. తిరుపతిలో వరద ముంపు ప్రాంతమైన న్యూఇందిరానగర్‌లో గురువారం ఆయన పర్యటించి బాధితులతో మాట్లాడారు. వరదనష్టం ఏమేరకు జరిగింది? ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డారా? ప్రభుత్వ సాయం అందిందా? అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సుమారు 10వేల ఎకరాల్లో పంటనష్టంతో  రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు, నిరుపేదలకు ప్రతి ఇంటికి రూ.10వేలు తక్షణ సాయంగా అందించాలని డిమాండు చేశారు. పెరిగిన ధరలతో రాష్ట్రప్రభుత్వం ఇచ్చే రూ.2వేల సాయం ఏమూలకు సరిపోతుందని ప్రశ్నించారు. వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు విశాఖ తరహాలో రూ.కోటి చెల్లించాలన్నారు. తిరుపతిలో నీటమునిగిన 42 మురికివాడల్లో మహిళలపేరిట డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండు చేశారు. వరదలతో అతలాకుతలమైన రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం స్పందన లేదన్నారు. 30ఏళ్ల క్రితం ఇలా భారీవర్షాలు కురవగా.. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి ఇంటికి రూ.5వేలు, పాతిక కిలోల బియ్యం పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. 

Updated Date - 2021-11-26T06:47:13+05:30 IST