కాలనీ దాటితే అర్హులు కాదా?

ABN , First Publish Date - 2022-07-07T05:13:28+05:30 IST

ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. కేవలం తండాలు, కాలనీల్లో ఉండేవారికే ఉచిత విద్యుత్‌ను పరిమితం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీకావడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.

కాలనీ దాటితే అర్హులు కాదా?
ఈదుపురంలోని సబ్‌స్టేషన్‌

ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ వినియోగదారులపై సర్వే
ఆంక్షల పేరుతో సబ్సిడీకి మంగళం
3,452 మంది అనర్హులుగా గుర్తింపు
(ఇచ్ఛాపురం రూరల్‌)

ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. కేవలం తండాలు, కాలనీల్లో ఉండేవారికే ఉచిత విద్యుత్‌ను పరిమితం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీకావడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్లలోపు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏ ప్రాంతంలో ఉన్నా కుల ధ్రువీకరణ పత్రం చూపిస్తే రాయితీ వర్తింపజేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం నిబంధనలను సమూలంగా మార్చింది. అనర్హులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో మండల కేంద్రాలు, పట్టణాల్లో నివాసముండే లబ్ధిదారులకు రాయితీ తొలగించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం రాయితీ తొలగించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో 30 శాతం వరకూ అనర్హులు ఉన్నట్టు తేల్చింది. వాస్తవానికి ఈ ప్రతిపాదనను 2020లో తెచ్చినప్పటికీ కొవిడ్‌ వ్యాప్తితో ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టేసింది. ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చింది.

 ఇదీ పరిస్థితి
 జిల్లాలో 52,474 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఉన్నారు. ఇందులో ఎస్సీ వినియోగదారులు 37,989 మంది, ఎస్టీ  వినియోగదారులు 14,485 మంది  ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలు నివసించే ఇళ్లల్లో ఇప్పుడు వేరేవారు ఎవరైనా నివసిస్తున్నారా? వారి పేరిట వీరు లబ్ధిపొందుతున్నారా? లబ్ధిదారుడి ఆధార్‌ కార్డుతో విద్యుత్‌ కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయా? తదితర పూర్తి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్యుత్‌ సహాయకులతో సర్వే నిర్వహించారు. ఎస్సీలో 2517 మంది. ఎస్టీలో 937 మంది మొత్తం 3452 మందిని అనర్హులుగా గుర్తించారు. కాలనీల్లో కాకుండా వెలుపల ఉన్నవారిని  గుర్తించే పనిలో పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు వారి భార్య, పిల్లల పేరిట కనెక్షన్లు తీసుకుని ఉచిత విద్యుత్‌ పొందుతున్నట్లు గుర్తించారు. అలాంటి వారి నుంచి ఇప్పటివరకూ పొందిన రాయితీ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని నిర్ణయించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకే..
ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ వినియోగదారుల్లో ఉచిత విద్యుత్‌కు ఎంత మంది అర్హులు? అనర్హులు ఎంతమంది? అనే దానిపై ఆరాతీస్తున్నాం. అనర్హులకు రాయితీ నిలిపివేస్తాం.  
- ఎల్‌.దైవప్రసాద్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ, శ్రీకాకుళం

 

Updated Date - 2022-07-07T05:13:28+05:30 IST