కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

ABN , First Publish Date - 2021-05-11T05:07:39+05:30 IST

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు
వైద్యాధికారులతో మాట్లాడుతున్న డీఎంఅండ్‌హెచ్‌వో

  •  రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి
  •  షాద్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రి సందర్శన
  •  వాక్సినేషన్‌, కొవిడ్‌ పరీక్షల నిర్వహణపై ఆరా..

షాద్‌నగర్‌ : కరోనా కట్టడికి పకడ్చందీ చర్యలు తీసుకుంటున్నట్లు రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు, వాక్సిన్‌, కొవిడ్‌ పరీక్షల నిర్వహణపై జిల్లా డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్‌ దామోదర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇతర రోగాలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకుగాను కొవిడ్‌ పరీక్షలను ఆస్పత్రి సమీపంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలకు మార్చాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించారు. అలాగే కరోనా బారినపడి  ఐసోలేషన్‌ కేంద్రంలో ఉన్న పేషెంట్ల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో నిర్వహిస్తున్న జ్వర సర్వే వివరాలపై ఆరా తీశారు. ఎవరైతే జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారో వారందరికీ ఐసోలేషన్‌ కిట్లు అందివ్వాలని ఈ సందర్భంగా ఆమె వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాస్‌, చించోడ్‌ పీహెచ్‌సీ వైద్యులు సాయిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. 

  • ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

షాబాద్‌ : ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి అన్నారు. సోమవారం షాబాద్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో 16మంది సిబ్బందికి కేవలం ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో రంగారెడ్డి జిల్లా వెద్యాధికారి స్వరాజ్యలక్ష్మికి ఫోన్‌ చేసి సమస్యను వివరించారు. షాబాద్‌ పీహెచ్‌సీలో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వారంరోజుల్లో పోస్టులు భర్తీ చేస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పీఎసీఎస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకట్‌యాదవ్‌, నాయకులు రాజేందర్‌గౌడ్‌, సత్యనారాయణ, రాంచంద్రయ్య, ఇమ్రాన్‌, ముక్రంఖాన్‌, వైద్యసిబ్బంది శంకర్‌, రజాక్‌, తాహెర్‌, నవీన్‌, గోపాల్‌ తదితరులున్నారు. 

  • కొవిడ్‌ పరీక్షలు పెంచాలి 

మంచాల: కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను మరింత ఎక్కువ చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గొర్రెంకల నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పీహెచ్‌సీలో వైద్యాధికారులతో మాట్లాడారు. గ్రామాల్లో కరోనా నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. 

  • కరోనాపై అవగాహన కల్పించాలి

యాచారం: ప్రజలు కరోనా బారిన పడకుండా అవగాహన కల్పించాలని ఎంపీపీ కొప్పు సుకన్యబాషా అన్నారు. సోమవారం మండల పరిషత్‌లో కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు ప్రజలకు జాగ్రత్తలు వివరించాలన్నారు. ఎంపీడీవో మమతాబాయి, ఏపీవో లింగయ్య పాల్గొన్నారు.

  •  ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి

మొయినాబాద్‌ రూరల్‌: ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షుడు, తోలుకట్ట గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని తోలుకట్ట గ్రామంలోని పలు వీధుల్లో రసాయనాలు పిచికారీ చేసే కార్యక్రమాన్ని పంచాయతీ సిబ్బందితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది తదితరులున్నారు. 

  • హోం ఐసోలేషన్‌ కిట్ల పంపిణీ 

తలకొండపల్లి: ఎంజీ తండాలో సోమవారం ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ కరోనా అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రస్ట్‌ చైర్మన్‌, జడ్పీటీసీ వెంకటేశ్‌ సమకూర్చిన హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేశారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజవకర్గంలోని గ్రామాల్లో కరోనా పీడితులకు ఉచిత ఐసోలేషన్‌ కిట్లను అందజేస్తున్నట్లు ట్రస్ట్‌ సభ్యుడు బుచ్చిబాబు తెలిపారు. సర్పంచ్‌ శంకర్‌ పాల్గొన్నారు.

  • కరోనా రోగులకు ఉచితంగా భోజనం అందజేత

చేవెళ్ల : కరోనా వైరస్‌ సోకి ఇంటిళ్లిపాది పస్తులు ఉండకూడదన్న భరోసానిస్తూ కరోనా రోగుల ఇంటివద్దకు వెళ్లి ఉచితంగా భోజనం అందించేందుకు చేవెళ్లలో ఓ హోటల్‌ యజమాని ముందుకు వచ్చాడు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో స్ఫూర్తి రెస్టారెంట్‌ యాజమని గోటురి దయాకర్‌గౌడ్‌ కరోనా సోకినా కుటుంబ సభ్యులు ఆకలితో అలమటించకుండా ఉండొద్దని కరోన బాధితులకు ఉదయం, రాత్రి రెండు పూటలా భోజనం వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఉచితంగా అందిస్తున్నాడు. గత మూడు రోజులుగా చేవెళ్ల పట్టణ కేంద్రంతో పాటు, పరిసర గ్రామాల్లో కరోనా సోకిన వారు అడ్రస్‌ చెబితే నేరుగా హోటల్‌ నుంచి భోజనాన్ని ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు నిర్వహకుడు దయాకర్‌గౌడ్‌ తెలిపారు. 

  • కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలి

కీసర: కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలని సీఐ నరేందర్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మండల పరిధి చీర్యాల్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ తుంగ ధర్మేందర్‌ అధ్యక్షతన కరోనాపై అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. గ్రామపంచాయతీ తీర్మానం మేరకు మధ్యాహ్నం 12గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని, ఆదేశాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

  •  కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ఘట్‌కేసర్‌ రూరల్‌ : ప్రతిఒక్కరూ కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని అవుషాపూర్‌ సర్పంచ్‌ ఏనుగు కావేరిమశ్చేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అవుషాపూర్‌, కొర్రెముల గ్రామపంచాయతీలు సోమవారం అత్యవసర సమావేశాలు నిర్వహించాయి. అవుషాపూర్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామస్థులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని తెలిపారు. నేటి నుంచి గ్రామంలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నిర్వహించాలని తీర్మానించారు. దుకాణాలు ఉదయం నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే తెరిచి ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ అయిలయ్య యాదవ్‌, కార్యదర్శి ఉమాదేవి, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

  • కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి 

మేడ్చల్‌ :  కరోనాను ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చి వైద్యం అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మండలంలోని శ్రీరంగరం పీహెచ్‌సీలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను, ఆసుపత్రుల వద్ద వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేందర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ అమరం మోహన్‌రెడ్డి, నాయకులు జగన్‌గౌడ్‌, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.

  • మొదటి రోజు లాక్‌డౌన్‌ సంపూర్ణం

ఘట్‌కేసర్‌ : ఘట్‌కేసర్‌ మున్సిపలిటీలో మొదటిరోజు లాక్‌డౌన్‌ విజయవంతమైంది. సోమవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని జంగయ్య యాదవ్‌ లాక్‌డౌన్‌ను పరిశీంచారు. కౌన్సిలర్లతో కలిసి ప్రధాన రోడ్లలో పర్యటించారు. ముందస్తు ప్రచారంతో దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఘట్‌కేసర్‌లోని పాత జాతీయ రహదారి జనసంచారం లేక బోసిపోయి కనిపించింది. లాక్‌డౌన్‌ను మద్యం దుకాణాలు, బార్లకు సైతం వర్తింపజేయాలని పలువురు డిమాండ్‌ చేశారు.

  • స్వచ్ఛంద లాక్‌డౌన్‌ వైపు గ్రామాలు

మూడుచింతలపల్లి/ఘట్‌కేసర్‌ రూరల్‌ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో పంచాయతీ పాలకవర్గం సోమవారం స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సర్పంచ్‌ జ్యోతి మాట్లాడుతూ మధ్యాహ్నం 2గంటల నుంచి ఉదయం 6గంటల వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని, ఈనెల 22వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెలిపారు. వారంతపు సంతలు, దుకాణాలు, చికెన్‌, మటన్‌షాపులు, సెలూన్లు, హోటల్స్‌, తోపుడు బండ్లు, దుకాణ సముదాయాలను మూసివేయాలని తెలియజేశారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఘట్‌కేసర్‌ రూరల్‌ గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో పంచాయతీలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. మండలంలోని ఎదులాబాద్‌, మర్రిపల్లిగూడలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని తీర్మానం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని సర్పంచులు హెచ్చరించారు. లాక్‌డౌన్‌ అమలుతో గ్రామాల్లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

  • పూడూరులో పాక్షిక లాక్‌డౌన్‌

మేడ్చల్‌ : మేడ్చల్‌ మండలం పూడూరు గ్రామంలో నేటి నుంచి పాక్షికంగా లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు సర్పంచ్‌ బాబూయాదవ్‌ తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో పాలకవర్గం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నేటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచాలని, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.2వేలు జరిమానా విధించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-05-11T05:07:39+05:30 IST