ఆదాయం రాక.. అద్దెలు చెల్లించలేక

ABN , First Publish Date - 2021-05-23T04:06:37+05:30 IST

కరోనా ప్రభావంతో చిరు వ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారు. కరోనా కట్టడిలో భాగంగా జిల్లాలో ఈ నెల 5 నుంచి కర్ఫ్యూ అమలవుతోంది. ఈ మేరకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కపూటే దుకాణాలు తెరవడంతో వ్యాపారాలు సక్రమంగా సాగడం లేదు. కనీస స్థాయిలో ఆదాయం రావడం లేదు. దీంతో దుకాణాల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదాయం రాక.. అద్దెలు చెల్లించలేక
ఇచ్ఛాపురంలో మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌

ఆదాయం రాక.. అద్దెలు చెల్లించలేక

 కర్ఫ్యూతో అంతంతమాత్రంగా వ్యాపారాలు

 కరోనాతో చితికిపోయిన చిరువ్యాపారులు

(ఇచ్ఛాపురం)

కరోనా ప్రభావంతో చిరు వ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారు. కరోనా కట్టడిలో భాగంగా జిల్లాలో ఈ నెల 5 నుంచి కర్ఫ్యూ అమలవుతోంది. ఈ మేరకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కపూటే దుకాణాలు తెరవడంతో వ్యాపారాలు సక్రమంగా సాగడం లేదు. కనీస స్థాయిలో ఆదాయం రావడం లేదు. దీంతో దుకాణాల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, దుకాణాల నిర్వహణకు వ్యాపారులు అద్దెకు గదులు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారు. వచ్చిన కొద్ది ఆదాయంలో అద్దెలు, నిర్వహణ ఖర్చులతో నెట్టుకొచ్చేవారు. ప్రస్తుతం కరోనా ఉధృతి, కర్ఫ్యూ ప్రభావంతో హోటళ్లు తెరచుకోవడం లేదు. మరోవైపు కూరగాయల మార్కెట్‌, ఇతర దుకాణాల్లో వ్యాపారాలు మందగించాయి. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు అద్దెలు చెల్లించలేక.. ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కుటుంబ పోషణ భారమవుతోందని ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా నష్టపోయారు. ఆ నష్టాల నుంచి కొలుకోక ముందే కర్ఫ్యూ విధించారు. పరిస్థితులు చక్కబడుతున్న సమయంలో కరోనా రెండో దశ ఉధృతి ఎక్కువైంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో పరిస్థితి మొదటకు వచ్చిందని వాపోతున్నారు.

ఇదీ పరిస్థితి

- ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలో పాతబస్టాండ్‌, మార్కెట్‌ ఎదురుగా, యూకాంప్లెక్స్‌, మునిసిపల్‌ కార్యాలయం ఎదుట...ఇలా వివిధ ప్రాంతాల్లో మొత్తం 160షాపులు ఉన్నాయి. నెలకు సుమారుగా రూ.8.40 లక్షలు అద్దెలు మునిసిపల్‌ అధికారులు వసూలు చేస్తున్నారు. 

- పలాస మునిసిపాలిటీలో 150 షాపుల వరకు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు అద్దెల రూపంలో రూ.ఏడు లక్షల వరకు వసూలవుతున్నాయి. 

- ఆమదాలవలస మునిసిపాలిటీలో 37 షాపుల ద్వారా నెలకు అద్దెల రూపంలో రూ.లక్ష వరకు ఆదాయం వస్తోంది. 

- శ్రీకాకుళం మునిసిపల్‌ కార్పొరేషన్‌, రాజాం మునిసిపాలిటీ, పాలకొండ నగర పంచాయతీలో కూడా షాపుల ద్వారా రూ.లక్షల్లో అద్దెలు చెల్లిస్తున్నారు. 

- ఇక మునిసిపాలిటీల్లో కీలక జంక్షన్లలో ప్రైవేటు దుకాణాల యజమానులు భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. టిఫిన్‌, కిరాణా, పాన్‌షాపులు, సెల్‌పాయింట్లు, రెడీమేడ్‌ దుకాణాలు అద్దెకు తీసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. కర్ఫ్యూ కారణంగా ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు తెరవడంతో వ్యాపారాలు అంతంతమ్రాతంగానే సాగుతోందని వ్యాపారులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కరోనా వేళ అద్దెలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


ఇబ్బందులు పడుతున్నాం

దాబా హోటల్‌ నిర్వహించి జీవిస్తున్నా. జంక్షన్‌లో నెలకు రూ.15 వేలు చెల్లించి హోటల్‌ నిర్వహిస్తున్నాం. కర్ఫ్యూ కారణంగా మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఇవ్వడంతో వ్యాపారాలు సాగక హోటల్‌ను మూసేశాం. ఆదాయం లేక, అద్దెలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాం. ఇలాగే కొనసాగితే మరింత అప్పుల బారినపడతాం.

-పూర్ణ ధనరాజ, డాబా నిర్వాహకుడు, ఇచ్ఛాపురం


ఆర్థికంగా చితికిపోయాం

చిన్న దుకాణంలో వ్యాపారం చేసుకుంటున్నాను. ఉదయం నుంచి 12 గంటల వరకే వ్యాపారం సాగిస్తున్నాం. కరోనా వల్ల వ్యాపారాలు కూడా అంతంతమాత్రంగా సాగుతున్నాయి. దీంతో ఆర్థికంగా చితికిపోయాను. నాలాగే చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎంతో కొంత ఆర్థికసాయం చేయాలి.

-పూర్ణ సాహు, చిరు వ్యాపారి, ఇచ్ఛాపురం



Updated Date - 2021-05-23T04:06:37+05:30 IST