బాకీ డబ్బులు అడిగినందుకు హత్యాయత్నం

ABN , First Publish Date - 2021-01-17T05:43:13+05:30 IST

బాకీ డబ్బులు అడిగినందుకు ఓ యువకుడిని బీరు సీసాలు, కర్రలతో తీవ్రంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

బాకీ డబ్బులు అడిగినందుకు హత్యాయత్నం
నిందితులను చూపుతున్న ఏసీపీ మహేందర్‌

నిందితులపై రౌడీషీట్‌ : ఏసీపీ మహేందర్‌

హుస్నాబాద్‌, జనవరి 16 : బాకీ డబ్బులు అడిగినందుకు ఓ యువకుడిని బీరు సీసాలు, కర్రలతో తీవ్రంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం హుస్నాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఏసీపీ సందెపోగు మహేందర్‌ వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన వరియోగుల అరవిందస్వామి వద్ద మహ్మద్‌ మైనోద్దీన్‌ 20 రోజుల క్రితం రూ.2500ను అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వాలని అరవిందస్వామి 10 రోజుల క్రితం మైనోద్దీన్‌ను అడగగా చిన్న గొడవ జరిగింది. మైనోద్దీన్‌ అన్న బాబా విషయం తెలుసుకుని మైనోద్దీన్‌ను కొట్టాడు. దీన్ని అవమానంగా భావించిన అతను అరవిందస్వామిని ఎలాగైనా చంపాలనుకున్నాడు. తన స్నేహితుడైన పిట్టల అరుణ్‌కుమార్‌, వరుసకు మామ అయిన కుక్కల అలియాస్‌ గంగరబోయిన మల్లేశం, మరో స్నేహితుడు జువైనల్‌ నేరస్థుడితో కలిసి 11న రాత్రి అరవిందస్వామి స్నేహితుడైన శనిగరం అఖిలే్‌షకుమార్‌కు అరుణ్‌కుమార్‌ ఫోన్‌చేసి డబ్బులు ఇస్తాం.. పట్టణంలోని లక్ష్మీ గార్డెన్‌ నాగారం రోడ్డు వద్దకు రావాలని చెప్పాడు. వారిద్దరు అక్కడికి రాగానే అప్పటికే మద్యం సేవించేందుకు తెచ్చుకున్న బీరు సీసాలు, కర్రలతో మైనోద్దీన్‌, అరుణ్‌కుమార్‌, మల్లేశం వారిపై విచక్షణారహితంగా దాడిచేశారు. అయితే దాడిచేస్తున్న దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించారు. దీన్ని మైనోద్దీన్‌ తన వాట్సాప్‌ నంబరుకు స్టేట్‌సలో పెట్టుకున్నాడని ఏసీపీ తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పై ముగ్గురిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మల్లేశం, అరుణ్‌కుమార్‌పై ఇదివరకే కేసులున్నాయని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీషీట్లు ఓపెన్‌ చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో సీఐ రఘునాథరెడ్డి, ఎస్‌ఐ ఎస్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T05:43:13+05:30 IST