టీడీపీకే ఓటు అడిగే హక్కు

ABN , First Publish Date - 2021-03-06T06:51:38+05:30 IST

తెలుగుదేశం పార్టీ హయాంలోనే హిందూపురాన్ని అభివృద్ధి చేశా. ఓట్లు అడగ డానికే మీ ముందుకు వచ్చా. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలి’ అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

టీడీపీకే ఓటు అడిగే హక్కు
హిందూపురంలో టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

30 ఏళ్ల వరకూ నీటి సమస్య పదమే వినపడకుండా చేశా

హిందూపురాన్ని అభివృద్ధి చేసి మీ ముందుకు వచ్చా

వైసీపీకి అవకాశమిస్తే పంచభూతాలను అమ్మేస్తారు

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ

హిందూపురం, మార్చి 5 : ‘తెలుగుదేశం పార్టీ హయాంలోనే హిందూపురాన్ని అభివృద్ధి చేశా. ఓట్లు అడగ డానికే మీ ముందుకు వచ్చా. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలి’ అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులతో కలిసి పట్టణంలోని చిన్నమార్కెట్‌, మెయిన్‌ బజార్‌, వీడీ రోడ్‌, బాలాజీ నగర్‌, హస్నాబాద్‌, పరిగి రోడ్‌ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూపురాన్ని ఎన్టీఆర్‌ కాలం నుంచి విద్యా, వైద్యం, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. గత ఐదేళ్లలో వందల కోట్లను తీసుకువచ్చి పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కళ్ల ముందు అభివృద్ధి కన్పిస్తోంది. రెండేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం ఒక్క రోడ్డైనా వేసిందా అని ప్రశ్నించారు. హిందూపురంలో తాగునీరు సమస్య చూచి పిల్లనిచ్చేందుకు వెనుకాడే రోజులుండేవి, ప్రతి కుటుంబం సంపాదనలో సగం తాగు నీటికే చెల్లించాల్సి వచ్చేది. దశాబ్దాలుగా నెలకొన్న తాగునీటి సమస్యకు గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి రూ. 194 కోట్లతో ప్రత్యేక పైపులైన్‌ వేసి పరిష్కారం చూపామన్నారు. ఇంటింటికి తాగునీరు ఇచ్చాం. రాబోయే 30 ఏళ్ల వరకు హిందూపురంలో నీటి సమస్య అనే పదమే తలెత్తకుండా చేశామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందంటే అది ఒక్క టీడీపీకే నన్నారు. వైసీపీకి అవశాశమిస్తే హిందూపురంలో పంచ భూతాలు అమ్మేస్తారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుకను అమ్మేస్తున్నారని, కార్మికులు రోడ్డు పడ్డారని, అర్ధంతరంగా నిర్మాణాలు ఆపేయాల్సివస్తోందని, ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిపిస్తే ఇంటింటికీ ఉచిత నీరు అందిస్తామని, మున్సిపాల్టీపై టీడీపీ జెండా ఎగురవేయాలంటే మీ సహకారం కావాలన్నారు. వైసీపీ మాటలు విని మోసపోవద్దని పట్టణ ప్రజలకు విన్నవించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి రక్షించుకుందామన్నారు. ఆయన వెంట అహుడా మాజీ చైర్మన్‌ అంబికా లక్ష్మీనారాయణ,  టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, టీడీపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ప్రచారంలో ప్రధానంగా పట్టణానికి టీడీపీ హయాంలో తాగునీరు ఇవ్వడంపై ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రస్తావిస్తుండటంతో పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన కన్పించింది. 

Updated Date - 2021-03-06T06:51:38+05:30 IST