వైసీపీ అన్నింటా విఫలం

ABN , First Publish Date - 2021-06-17T06:46:30+05:30 IST

కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌ పంపిణీతోపాటు వైరస్‌ మృతుల కుటుంబాలను ఆదుకోవడంలోనూ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు.

వైసీపీ అన్నింటా విఫలం
పుట్టపర్తిలో నిర్వహించిననిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

మాజీ మంత్రులు కాలవ, పల్లె డిమాండ్‌

జిల్లా వ్యాప్తంగా టీడీపీ నిరసనలు

అనంతపురం వైద్యం, జూన్‌ 16: కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌ పంపిణీతోపాటు వైరస్‌ మృతుల కుటుంబాలను ఆదుకోవడంలోనూ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ప్రభుత్వ వైఫల్యాలతోపాటు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లా వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు నిరసనలు చేపట్టారు. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టి, వినతలు అందజేశారు. పుట్టపర్తిలో పల్లె ఆధ్వర్యంలో తమ్ముళ్లు నిరసన సాగించారు. గుంతకల్లు, గుత్తి, కదిరి, కళ్యాణదుర్గం, రాప్తాడు తదితర నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ప్రభుత్వ తీరుపై మండి పడుతూ నిరసన సాగించారు. మాజీ మంత్రులు కాలవ, పల్లె మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం వల్లే అనేకమంది మరణించారన్నారు. దీంతో ఆయా కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఆర్థికసాయం చేసి, ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. చంద్రన్న బీమా కొనసాగించి ఉన్నా.. కొవిడ్‌ మృతులకు రూ.10 లక్షల బీమా వచ్చేదన్నారు. కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వైద్య వర్గాలతోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పారిశుధ్య కార్మికులు, కాంట్రాక్ట్‌ సిబ్బంది సైతం కొవిడ్‌ బారిన పడి మృతి చెందారన్నారు. ఆ కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలన్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకే జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టి, ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని మాజీ మంత్రి కాలవ హెచ్చరించారు.

Updated Date - 2021-06-17T06:46:30+05:30 IST