హాజరు 9శాతమే

ABN , First Publish Date - 2021-02-25T05:36:55+05:30 IST

ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, ఫిబ్రవరి 24 : సుదీర్ఘకాలం తర్వాత ప్రారంభమైన 6, 7, 8 తరగతులకు స్పందన కానరాలేదు.

హాజరు 9శాతమే
మాస్కులు ధరించి వస్తున్న సిద్దిపేటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

ప్రారంభమైన 6,7,8 తరగతులు

మొదటి రోజు అంతంతే

కొవిడ్‌ భయంతో పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రుల తర్జన భర్జన


ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, ఫిబ్రవరి 24 : సుదీర్ఘకాలం తర్వాత ప్రారంభమైన 6, 7, 8 తరగతులకు స్పందన కానరాలేదు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి కేవలం 9శాతం మంది విద్యార్థులే హాజరయ్యారు.   ఇప్పటికే 9, 10 తరగతులు నిర్వహిస్తుండగా బుధవారం నుంచి 6, 7, 8 తరగతుల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈనెలాఖరు వరకు అన్ని పాఠశాలలు తెరవాలని సూచించింది. ఈ క్రమంలో జిల్లాలోని దాదాపు పాఠశాలల్లో ఈ తరగతుల నిర్వహణకు నిర్వాహకులు సమాయత్తమయ్యారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం తరగతి గదులను శానిటైజ్‌ చేశారు. విద్యార్థులు మాస్కులను ధరించేలా సూచనలు ఇచ్చారు. ప్రతీ ఒక్కరికీ శానిటైజర్‌ స్ర్పే చేశారు. వారి ఆరోగ్య పరిస్థితినీ పరిశీలించారు.


జిల్లాలో 6,7,8 తరగతులకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 42,968 మంది విద్యార్థులు ఉన్నారు. బుధవారం ప్రభుత్వ పాఠశాలల్లో 2,580 మంది విద్యార్థులు, ప్రైవేట్‌ పాఠశాలల్లో 1,391 మంది విద్యార్థులు హాజరయ్యారు. పాఠశాలల వారీగా లెక్కిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 8శాతం, ప్రైవేట్‌ పాఠశాలల్లో 12 శాతం హాజరు నమోదైంది. మొత్తంగా తొలిరోజు 9 శాతం హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 20 రోజుల క్రితం ప్రారంభమైన 9,10 తరగతులకు సంబంధించి 78శాతం విద్యార్థులు హాజరయ్యారు. కాగా మొదటి రోజు తమ పిల్లలను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు తర్జనభర్జన పడినట్లు తెలుస్తోంది. 






జగదేవ్‌పూర్‌: పాఠశాలలో తరగతుల ప్రారంభమైనందున బుధవారం ఎంపీడీవో మల్లిఖార్జున్‌ జగదేవ్‌పూర్‌లోని పలు స్కూళ్లను తనిఖీ చేశారు.  ప్రాథమికోన్నత పాఠశాలల్లో తరగతులు ప్రారంభించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని కానీ విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో కరోనా జాగ్రత్తలు పాటించే విధంగా అన్ని వసతులు ప్రభుత్వం కల్పించాలని పీఆర్‌టీయూ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదరాసుపల్లి శశిధర్‌ ప్రభుత్వాన్ని కోరారు. 


నంగునూరు: ప్రతి విద్యార్థి కొవిడ్‌ నిబంధనలను పాటించాలని వైద్యాధికారి డాక్టర్‌ రాధిక అన్నారు. బుధవారం నంగునూరు హైస్కూల్‌లో పాఠశాల విద్యార్థులకు కరోనాపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈవో దేశి రెడ్డి, పాఠశాల సిబ్బంది, స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


మద్దూరు: దూళిమిట్ట మండలం బైరాన్‌పల్లి పాఠశాలను బుధవారం ఎంపీడీవో శ్రీనివా్‌సగౌడ్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం 6, 7, 8 తరగతుల ప్రారంభానికి చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఎంపీడీవో పాఠశాలను సందర్శించి పరిస్థితులపై ఆరా తీసి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మీనాంజనేయులు, పాల్గొన్నారు. 


మిరుదొడ్డి: మిరుదొడ్డి మండలం అల్వాల్‌లోని జడ్పీహెచ్‌ఎ్‌స పాఠశాలను బుధవారం మండల విద్యాధికారి ప్రభుదాస్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కరోనా నిబందనలను అనుగుణంగా విద్యాభోదన చేయాలని ఉపాద్యాయులకు సూచించారు. ఆయన వెంట ఉప సర్పంచు దిలీప్‌, ఉపాద్యాయులు తదితరులున్నారు. 

Updated Date - 2021-02-25T05:36:55+05:30 IST