వైసీపీవారి బంకు

ABN , First Publish Date - 2022-07-22T05:34:57+05:30 IST

ఆయన అధికార పార్టీ ప్రజా ప్రతినిధి. ఆయన కుమారుడు స్థానిక మాజీ ప్రజాప్రతినిధి. రాప్తాడు సమీపంలో జాతీయ రహదారి పక్కన కొన్నేళ్ల క్రితం వారు పెట్రోలు బంకు ఏర్పాటు చేశారు.

వైసీపీవారి బంకు


పంచాయతీ గుత్త కట్టిందే లేదు
రాప్తాడు, జూలై 21:
ఆయన అధికార పార్టీ ప్రజా ప్రతినిధి. ఆయన కుమారుడు స్థానిక మాజీ ప్రజాప్రతినిధి. రాప్తాడు సమీపంలో జాతీయ రహదారి పక్కన కొన్నేళ్ల క్రితం వారు పెట్రోలు బంకు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పంచాయతీకి పన్ను (గుత్త) చెల్లించలేదని సమాచారం. రామినేపల్లి సమీపంలోని ఈ పెట్రోలు బంకుకు సంబంధించిన పన్ను వివరాలు ఏవీ పంచాయతీ రికార్డుల్లో లేవు. పంచాయతీ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా గుత్త చెల్లించలేదని సమాచారం. గ్రామ పంచాయతీ పరిధిలో పెట్రోలు బంకు ఏర్పాటు చేయాలంటే పంచాయతీ అనుమతి తీసుకోవాలి. బంకు నిర్వహణకు కొంత మొత్తాన్ని మొదట పంచాయతీకి చెల్లించాలి. ఆ తర్వాత ఏడాదికోమారు పెట్రోలు బంకు విస్తీర్ణాన్ని బట్టి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ గుత్త చెల్లించాలి. కానీ బంకు ఏర్పాటై ఆరేళ్లు అవుతున్నా పైసా ఇవ్వలేదని సమాచారం. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై పెట్రోల్‌ బంకు మేనేజర్‌ను వివరణ కోరగా, గుత్త చెల్లించామని అన్నారు. రసీదులు చూపమని కోరితే స్పందించకపోవడం గమనార్హం.

విచారిస్తాం..
పెట్రోలు బంకు నిర్వాహకులు పంచాయతీకి గుత్త చెల్లించాల్సిందే. లేకపోతే నోటీసులు జారీ చేస్తాం. ఏటా సకాలంలో గుత్త వసూలు అయ్యేలా చర్యలు తీసుకుంటాం.
- మాధవి, ఈఓఆర్డీ, రాప్తాడు

నోటీసులు జారీ చేస్తాం..
వారం క్రితం బదిలీపై రాప్తాడుకు వచ్చాను. పెట్రోలు బంకు నిర్వాహకులు గుత్త చెల్లించకపోతే నోటీసులు జారీ చేస్తాం. స్పందించకపోతే ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
- ఈశ్వరయ్య,  పంచాయతీ కార్యదర్శి, రాప్తాడు

Updated Date - 2022-07-22T05:34:57+05:30 IST