కరోనా వైరస్‌పై అప్రమత్తమవ్వాల్సిందే!

ABN , First Publish Date - 2021-02-23T04:54:06+05:30 IST

కరోనా మహమ్మారి ముప్పు మరోసారి పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో వేలాదిగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సింది పోయి అంతటా నిర్లక్ష్యం నెలకొంది. బయటకు వస్తున్నా చాలామంది మాస్కులు ధరించడం లేదు. నిబంధనలు పాటించడం లేదు. వరుస ఎన్నికలు, పండుగలు, జాతరల నేపథ్యంలో కొవిడ్‌ మళ్లీ విజృంభించే అవకాశముంది. మరోవైపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. నెల రోజుల్లో 51,922 మందికి వ్యాక్సిన్‌ వేయాల్సి ఉన్నా..ఇప్పటి వరకూ 32,534 మందికి మాత్రమే వేశారు. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు అధికారుల చర్యలతో పాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కరోనా వైరస్‌పై   అప్రమత్తమవ్వాల్సిందే!

తగ్గిందని తేలిగ్గా తీసుకోవద్దు!

రెండో దశ విజృంభణతో ప్రమాద ఘంటికలు

జిల్లాలో కానరాని నిబంధనలు

ముందుగా మేలుకోకుంటే ముప్పే

హెచ్చరిస్తున్న నిపుణులు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

కరోనా మహమ్మారి ముప్పు మరోసారి పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో వేలాదిగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సింది పోయి అంతటా నిర్లక్ష్యం నెలకొంది. బయటకు వస్తున్నా చాలామంది మాస్కులు ధరించడం లేదు. నిబంధనలు పాటించడం లేదు. వరుస ఎన్నికలు, పండుగలు, జాతరల నేపథ్యంలో కొవిడ్‌ మళ్లీ విజృంభించే అవకాశముంది. మరోవైపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. నెల రోజుల్లో 51,922 మందికి వ్యాక్సిన్‌ వేయాల్సి ఉన్నా..ఇప్పటి వరకూ 32,534 మందికి మాత్రమే వేశారు. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు అధికారుల చర్యలతో పాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

----------------------

‘అత్యవసర సమయాల్లో బయటకు వచ్చేవారు. వచ్చినా విధిగా మాస్కు ధరించేవారు. జనం ఉన్నచోట భౌతిక దూరం పాటించేవారు. పావుగంటకు ఒకసారి శానిటైజ్‌ చేసేవారు’... కొద్దినెలల కిందట వరకూ ప్రజలు ఈ జాగ్రత్తలన్నీ పాటించేవారు. కానీ ఇప్పుడు వాటన్నింటినీ గాలికొదిలేశారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టిందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు పాఠశాలలు తెరచుకున్నాయి. మరోవైపు శుభకార్యాలు, వివాహ మహోత్సవాలు, పూజలు, జాతరలు ఇలా అన్నింటికీ జనం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. జిల్లాలో ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ఆదివారం 8 మందికి, సోమవారం మరో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మొత్తంగా ఇప్పటివరకు  8,70,407 నమూనాలు సేకరించగా..  కరోనా బాధితుల సంఖ్య 46,475కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. తాజాగా సోమవారం ముగ్గురు డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 14 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో నలుగురు చికిత్స పొందుతున్నారు. ఇలా ప్రస్తుతం జిల్లాలో రోజుకు సగటున ఐదు, ఆరు కేసులు నమోదవుతున్నాయి. పదిహేను.. ఇరవై మంది మాత్రమే బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ చాలామంది ప్రజలు నిపుణుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం మూలంగా కేసులు మళ్లీ పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కరోనా వ్యాప్తి చెందిన తొలినాళ్లలో జిల్లాలో కేసులు లేవు. ఏప్రిల్‌, మే, జూన్‌లో అంతంతమాత్రంగానే ఉన్నాయి. తరువాత ప్రమాద ఘంటికలు మోగాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు తరువాత లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి రావడం, నిబంధనలు పాటించకపోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందింది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అంతటా బాధితులయ్యారు. ప్రస్తుతం అదుపులోకి వచ్చినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వందలాది మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉంది. పండుగలకు, ఇటీవల పంచాయతీ ఎన్నికలకు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది వలస కూలీలు స్వస్థలాలకు వచ్చారు. కానీ ఎక్కడా కొవిడ్‌ నిబంధనలు పట్టకుండా వ్యవహరించారు. మరోవైపు విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి సంఖ్య కూడా వందల్లో ఉంది. ముఖ్యంగా బయటకు వచ్చినప్పుడు చాలామంది మాస్కును ధరించడం లేదు. కరోనా తగ్గిపోయిందిలే అంటూ తేలిగ్గా తీసుకుంటున్నారు. యంత్రాంగం కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోసారి వైరస్‌ విజృంభించక ముందే కఠినచర్యలకు ఉపక్రమించకపోతే మూల్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


ఫ నిర్లక్ష్యం వద్దు

ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. అలాగని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదు. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలి. బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. చేతులను శుభ్రం చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలి. 

-చంద్రానాయక్‌, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం

Updated Date - 2021-02-23T04:54:06+05:30 IST