భక్తి పారవశ్యం

ABN , First Publish Date - 2022-08-10T05:38:35+05:30 IST

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జలధి కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.

భక్తి పారవశ్యం
అగ్నిగుండ ప్రవేశం చేస్తున్న గూగూడు కుళ్లాయిస్వామి

వేడుకగా కుళ్లాయిస్వామి జలధి 

గోవింద  నామస్మరణతో మార్మోగిన గూగూడు

నార్పల, ఆగస్టు 9: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జలధి కార్యక్రమాన్ని  కన్నుల పండువగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే కుళ్లాయుస్వామి పీరును వీధుల గుండా ఊరేగించారు.  గోవింద నామస్మరణతో గూగూడు మార్మోగింది. ఉదయం 6 గంటలకు కుళ్లాయిస్వామి పీరును వెండి గొడుగులతో అగ్నిగుండ ప్రవేశం చేయించారు. సాయంత్రం 4 గంటలకు స్వామి పీరును మళ్లీ అగ్నిగుండం ప్రవేశం చేశారు. ఈ అగ్నిగుండం ప్రవేశాన్ని భక్తులు మిద్దెలు, చెట్లపైకి ఎక్కి తిలకించారు. అలాగే కుళ్లాయిస్వామి పీరుకు గ్రామ సమీపంలోని గంగనపల్లి బావిలో జలధి కార్యక్రమం చేశారు. స్వామి జలధి వెళ్లేటప్పుడు గోవింద నామస్మరణం చేస్తూ భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం మొక్కులు ఉన్న భక్తులు కందూరోత్సవం నిర్వహించారు. గూగూడుకు బంధువులతో కలిసి వచ్చిన వారు పరిసర ప్రాంతాల్లో చెట్లకింద, కొండలవైపు, గుడారాలు వేసుకొని ఎంతో ఆహ్లాదకరంగా మాంసాహారాన్ని వండుకుని భుజించారు. ఈ నెల 11న కుళ్లాయిస్వామి చివరి దర్శనం నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి శోభ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన శివశంకర్‌రెడ్డి, గ్రామపెద్దలు జాఫర్‌వలి, రాజన్న, తలారీ కుళ్లాయప్ప, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:38:35+05:30 IST