కొవిడ్‌తో ఎముకలు గుల్ల!

Jul 30 2021 @ 11:30AM

కొందరిలో అరుగుతున్న కీళ్లు, తుంటి భాగాలు.. మార్పిడికి దారి తీస్తున్న ఇబ్బందులు

పోస్టు కొవిడ్‌ బాధితుల అవస్థలు 

మందుల విచ్చలవిడి వాడకం వల్లే: వైద్యులు

కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడం, డి-విటమిన్‌ లోపమూ కారణాలేనని వెల్లడి


హైదరాబాద్‌ సిటీ,జూలై 29 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వచ్చినప్పుడే కాదు.. తగ్గిపోయి నెలలు గడుస్తున్నా ఇబ్బందులు వెంటాడుతునే ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న కొందరిలో ఎముకల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యనిపుణులు చెబుతున్నారు. చాలా మంది కూర్చుంటే లేవలేకపోతున్నారని.. లేస్తే నాలు గు అడుగులు వేయలేక పోతున్నారని.. కాలు కదిపితే నొప్పి, చేయి ఆడిస్తే ఇబ్బంది, తుంటిలో నొప్పితో బాధపడుతున్నారని చెబుతున్నారు. 


ఆర్థో డాక్టర్లు బిజీ..

ఇటీవలికాలంలో ఎముకల డాక్టర్ల వద్దకు వస్తున్న పోస్ట్‌ కొవిడ్‌ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్‌ వచ్చి తగ్గిన మూడు నెలల నుంచి ఆరు నెలల సమయంలో చాలా మం ది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు  వైద్యులు చెబుతున్నారు.  


కొవిడ్‌ సమయంలో మందులు అధిక మోతాదులో వినియోగించడం వల్ల ఎముకలపై తీవ్ర ప్రభావం పడుతోందని.. ఎముకల సమస్యలకు కారణం ఇదేనని వైద్యులు అం టున్నారు. వారు చెబుతున్నదాని ప్రకారం..  నీరసం, బలహీనత కారణంగా చాలామంది కుర్చీలు, మంచాలకే పరిమితమవుతున్నారు. ఉద్యోగులు ఆఫీసులలో/వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ లో.. గంటల తరబడి కూర్చున్న చోటనే ఉండిపొతున్నారు. ఇలా కదలికలు తగ్గిపోవడం వల్ల, ఎండ పొడ సోకక డి-విటమిన్‌ తగ్గిపోవడం వల్ల కూడా వారి కం డరాలు, ఎముకలు బలహీనంగా మారుతున్నాయని వైద్యులు వివరించారు. 


ఇలా చేస్తే మేలు..

మందుల వినియోగంతో కరోనా పేషెంట్లలో జాయింట్లు డ్రై వుతున్నాయి. ఫ్లూయిడ్‌ తగ్గిపోతుంది. పోస్టు కొవిడ్‌లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం. పౌష్టికాహారం అందక కండరాలు బలహీనంగా మారుతున్నాయి. కొందరిలో శరీర కదలికలు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా కండరాలు మందగిస్తున్నాయి. ముఖ్యంగా.. జాయింట్ల కదలికలు తగ్గుతున్నాయి. ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండిపోతుండడం వల్ల డి విటమిన్‌ బాగా తగ్గి ఎముకలు బలహీనపడుతున్నాయి. డి-విటమిన్‌ తీసుకోవడం వల్ల కొవిడ్‌ నుంచి, పోస్టు కొవిడ్‌ ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు. అవసరం మేరకు డి-విటమిన్‌ లభిస్తే ఎముకలకు బలం పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కండరాలు కూడా బలంగా ఉంటాయి. ఎముకల సమస్యలు ఎదుర్కొనే వారు మెల్లగా వ్యాయమాలు మొదలు పెట్టాలి. కీళ్ల నొప్పులు తగ్గడానికి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ఉద్యోగులు ప్రతి అరగంటకూ ఒకసారి కుర్చీలో నుంచి లేచి అటూ ఇటూ నడవాలి. రోజు ఉదయం ఎండలో కాసేపు గడపాలి.


 డాక్టర్‌ మనోజ్‌ కుమార్‌ , సీనియర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌, కేర్‌ ఆస్పత్రి 


మొదట్లోనే గుర్తిస్తే..

కొవిడ్‌ వచ్చి తగ్గిన తర్వాత  ఎముకల సమస్యలేవైనా వస్తే వెంటనే ఆర్థోపెడిక్‌ వైద్యులను సంప్రందించాలి. ఆరంభంలోనే దీనిని గమనిస్తే మందులు, వ్యాయమాలు, మంచి ఆహారంతో చెక్‌ పెట్టవచ్చు. ఆలస్యం చేస్తే మార్పిడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటీవలికాలంలో ఇలా బోన్‌ సెప్సి్‌సతో బాధపడుతున్న అయిదుగురికి తుంటి మార్పిడి  చేయాల్సి వచ్చింది. కాబట్టి జాగ్రత్త.


డాక్టర్‌ కృష్ణకిరణ్‌,  చీఫ్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌, మెడికవర్‌ ఆస్పత్రి 


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.