‘తోటపల్లి’కి బ్రేక్‌!

ABN , First Publish Date - 2020-11-19T04:57:10+05:30 IST

తోటపల్లి ప్రాజెక్టు పనులకు బ్రేక్‌ పడింది. పెండింగ్‌ పనులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి ఐదేళ్ల పాటు ఏ పనులూ చేపట్టవద్దంటూ అధికారులను ఆదేశించింది. దీంతో చివరి దశలో ఉన్న లైనింగ్‌, పిల్ల కాలువ, తదితర పనులు నిలిచిపోనున్నాయి. తద్వారా శివారు భూములకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రభుత్వ నిర్ణయంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

‘తోటపల్లి’కి బ్రేక్‌!
తోటపల్లి ప్రదాన కాలువ

 పెండింగ్‌ పనుల రద్దుకు ప్రభుత్వ ఆదేశాలు

 భూసేకరణను సాకుగా చూపిస్తున్న వైనం

 నిలిచిపోనున్న లైనింగ్‌, పిల్ల కాలువ పనులు

 శివారు భూములకు సాగునీరు ప్రశ్నార్థకం

 ఆందోళన చెందుతున్న అన్నదాతలు

(రాజాం) 

తోటపల్లి ప్రాజెక్టు పనులకు బ్రేక్‌ పడింది. పెండింగ్‌ పనులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి ఐదేళ్ల పాటు ఏ పనులూ చేపట్టవద్దంటూ అధికారులను ఆదేశించింది. దీంతో చివరి దశలో ఉన్న లైనింగ్‌, పిల్ల కాలువ, తదితర పనులు నిలిచిపోనున్నాయి. తద్వారా  శివారు భూములకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రభుత్వ నిర్ణయంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోటపల్లి ప్రాజెక్టుకు శంకు స్థాపన చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సాగు, తాగునీటి సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో దీనికి రూపకల్పన చేశారు. కుడి ప్రధాన కాలువ ద్వారా శివారు ఆయకట్టు వరకూ నీరు ఇచ్చేందుకు గతంలో పనులు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, జి.సిగడాం, లావేరు, రణస్థలం మండలాల పరిధిలోని భూములను తోటపల్లి కుడికాలువ ఆయకట్టు కిందకు చేర్చారు. రాజాం, లావేరు, రణస్థలం మండలాలను షాడో జోన్లుగా పరిగణిస్తున్నారు. జిల్లాలో నమోదయ్యే సగటు వర్షపాతం 400 మి.మీ. ఈ మండలాల్లో మాత్రం అంతకంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. దీంతో ఈ మండలాలను షాడో జోన్ల కింద లెక్కించారు. ఈ మూడు మండలాల్లో 63 వేల ఎకరాల మెట్ట భూములను అధికారులు గుర్తించి సాగులోకి తీసుకురావాలని కాలువ పనులు చేపట్టారు. ఇవి చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ సమయంలో భూసేకరణను సాకుగా చూపి పనులు రద్దు చేశారు. ఇంతవరకు మొత్తం ప్రాజెక్టులో భాగంగా ప్రధాన కుడికాలువ పనులు 118 కిలో మీటర్ల వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. నాలుగు బ్రాంచి కాలువలు, 25 డిస్ట్రిబ్యూటరీలు నిర్మించారు. మరో పది ప్రత్యేక కాలువల పనులు పూర్తిచేశారు. వీటికి సంబంధించి పిల్లకాలువలు తవ్వితే ఆయకట్టు కింద ఉన్న భూములకు సాగునీటిని అందించవచ్చు. ఎంపిక చేసిన ఆయకట్టు ప్రాంతంలో 386 వరకు చెరువులు ఉన్నాయి. వీటిని నీటితో నింపి ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని తోటపల్లి ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఇంతవరకు 39 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. మిగిలిన ఆయకట్టును స్థిరీకరించాల్సి ఉంది. 


నిలిచిపోనున్న సాగునీరు

ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ప్రస్తుత పనులు అర్ధాంతరంగా నిలిచిపోనున్నాయి. దీంతో ఆయకట్టు మొత్తానికి ఖరీఫ్‌లో సాగునీరు అందించడానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జలవనరుల శాఖ ముందస్తు ఒప్పందాల రద్దులో భాగంగా తీసుకున్న నిర్ణయం ఈ ప్రాజెక్టుపై పడింది. ప్రధాన కాలువ నుంచి బ్రాంచ్‌ కెనాళ్లకు, అక్కడి నుంచి పిల్లకాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరు చేరాలి. భూసేకరణ పూర్తికాక పోవడంతో పిల్ల కాలువల నిర్మాణాలు ముందుకు సాగలేదు. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఐదేళ్లు కావస్తున్నా, పిల్ల కాలువల విషయం కొలిక్కి రాలేదు. దీంతో రైతులు సాగునీటి కోసం  చెరువులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇది రైతుల మధ్య జల వివాదాలకు కారణమవుతోంది. ఎగువ ఉన్న రైతులు కాలువ  ప్రవాహానికి అడ్డుకట్ట వేసి... నిలువరిస్తుండడంతో దిగువకు నీరు అందడంలేదు. ప్రధాన కాలువ ద్వారా నీటి ప్రవాహం తగ్గడమే దీనికి కారణం. కాలువ ద్వారా 1200 క్యూసెక్కుల నీరు ప్రవహించాల్సి ఉండగా... 600 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. దిగువకు వచ్చేసరికి 50శాతం మేర తగ్గుతుంది. దీంతో వారాబందీని అమలు చేసి అవసరానికి నీరు ఇవ్వకుండా రైతులను బలి చేయాల్సిన దుస్థితి నెలకొంది.


భూసేకరణపై కోర్టులో కేసులు

తోటపల్లి ప్రాజెక్టు ద్వారా రాజాం మండల పరిధిలో 12,390 ఎకరాలకు, వంగర 2,634, సంతకవిటి 2,262, లావేరు 11,009, రణస్థలం 21,591, జి.సిగడాం 6,374, రేగిడి ఆమదాలవలస మండల పరిధిలో 7,547 ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు.  ఈ మేరకు ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తిచేశారు. వీటిలో కొన్ని కాలువలకు లైనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. ఇంకా కొన్ని పిల్లకాలువలు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం 65 కిలోమీటర్ల మేర పిల్లకాలువలు తవ్వడానికి 60 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ విషయంలో రెండు చోట్ల కోర్టు కేసులు నడుస్తున్నాయి. దీని కారణంగా పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పరిధిలో నిర్ణీత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలంటే గరిష్ట నీటి నిల్వ ఉండాలి. దీనికి సంబంధించి జిల్లా పరిధిలో 161 ఎకరాలు సేకరించాలి. ముందునుంచే అధికారులు స్థానిక నాయకుల సహకారంతో వివాదాలు లేని ప్రాంతాల్లో కాలువల తవ్వకాలు, లైనింగ్‌ పనులపై దృష్టి సారించి ఉంటే ఈపాటికే పనులు పూర్తయ్యే అవకాశం ఉండేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.


 పెండింగ్‌ పనులు రద్దు

తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌ పనులు రద్దయ్యాయి. వివాదాలు పరిష్కరించి... అవసరమైన మేరకు భూమిని అందుబాటులోకి తీసుకువస్తాం. ఆ తరువాతే పనులు పునఃప్రారంభించే అవకాశం ఉంది.  

- ఆర్‌.రామచంద్రరావు, తోటపల్లి ప్రాజెక్టు ఈఈ, రాజాం

Updated Date - 2020-11-19T04:57:10+05:30 IST