వైసీపీ సేవలో అధికారయంత్రాంగం

ABN , First Publish Date - 2021-11-11T07:39:25+05:30 IST

కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా... చేసిందే శాసనంగా చెల్లుబాటవుతోంది.

వైసీపీ సేవలో అధికారయంత్రాంగం

పోలీసు వ్యవస్థ మీదా మాయని మచ్చ

మున్సిపల్‌ యంత్రాంగం తీరుపై విమర్శలు


కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా... చేసిందే శాసనంగా చెల్లుబాటవుతోంది. మొత్తం అధికార యంత్రాంగమంతా జీ హుజూర్‌ అంటూ వైసీపీ నేతల ముందు సాగిలబడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలీసు, మున్సిపల్‌ యంత్రాంగాలు మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే నడుస్తున్నాయనే నిందను మోస్తున్నాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా వున్న ఐకేపీ, మెప్మా సిబ్బంది దాదాపుగా కుప్పంలోనే మకాం వేసి అడుగడుగునా అధికార పార్టీ నేతల సేవలో తరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిందటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు జిల్లాస్థాయి ఉన్నతాధికారులపై వేటు పడిన ముద్ర మాయకముందే కుప్పం మచ్చ అధికార యంత్రాంగంపై పడుతోంది. 


తిరుపతి - ఆంధ్రజ్యోతి

ఎన్నికల విధుల పేరిట పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ కె.ఎల్‌.వర్మను ప్రత్యేకంగా కుప్పంలో నియమించారు. ఆయన వచ్చీ రాగానే మహిళా సంఘాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. వెలుగు సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసి మహిళల ఓట్లు వైసీపీకి వేయించాలని వారికి హెచ్చరికలు జారీ చేశారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే వార్డుల వారీ టీడీపీ అభ్యర్థులకు ఓటర్ల జాబితాలు అందజేయడంలో మున్సిపల్‌ అధికారులు జాప్యం చేసి ఇబ్బంది కలిగించారు. ఉపసంహరణ గడువు ముగిశాక బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితా విడుదలలోనూ అధికారులు జాప్యం చేశారు. టీడీపీ నేతలు వెళ్ళి నిలదీశాక సుమారు ఐదు గంటల ఆలస్యంగా జాబితా ప్రకటించారు.14వ వార్డు వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచినట్టు ప్రకటించి వివాదానికి కారకులయ్యారు. అక్కడ టీడీపీ తరపున నామినేషన్లు వేసిన ఇద్దరు అభ్యర్థులు తాము ఉపసంహరించుకోకనే ఏకగ్రీవం ఎలా సాధ్యమైందని ప్రశ్నించినా సమాధానం చెప్పేవారు లేరు. మంత్రి పెద్దిరెడ్డి వెంట పలువురు అధికారులు కనిపిస్తున్నారు. ద్రావిడ వర్శిటీ రిజిస్ట్రార్‌ ఏకంగా ఎన్నికల సభా వేదిక మీద మంత్రితో మంతనాలు జరుపుతూ కనిపించారు. చివరికి మంత్రి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రభుత్వ శాఖకు చెందిన సిబ్బందే ఫొటోలు, వీడియోలు తీస్తుండడం గమనార్హం. ఇక 16వ వార్డులో టీడీపీ అభ్యర్థి మెడికల్‌ షాపును అధికారులు మూయించారు. కాగా పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ కె.ఎల్‌.వర్మను కుప్పం ఎన్నికల విధుల్లో నియమించడాన్ని టీడీపీ నేతలు హైకోర్టులో సవాల్‌ చేయడం జిల్లాలో అధికార యంత్రాంగం విశ్వసనీయత దెబ్బతీసినట్టు భావించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఏ మున్సిపాలిటీలోనూ లేని విధంగా కుప్పానికి మాత్రమే మరో మున్సిపల్‌ కమిషనర్‌ను ప్రత్యేకాధికారిగా ఎలా నియమించారని హైకోర్టు కూడా ప్రశ్నించడం ఈ సందర్భంగా గమనార్హం.


ఏపీఎంలు, వెలుగు సీసీలంతా కుప్పంలోనే 

 కుప్పం మున్సిపల్‌ పరిధిలోని సంఘమిత్రలు, వెలుగు సీసీలను తొలి రోజునుంచీనే ఎన్నికల అవసరాలకు వినియోగించుకుంటున్నారని ఇప్పటికే టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత మరింత రెచ్చిపోయి జిల్లావ్యాప్తంగా వున్న వెలుగు ఏపీఎంలను, సీసీలను అందరినీ కుప్పం రప్పించారని, ఎన్నికలు ముగిసే దాకా వారిని అక్కడే మకాం వేయిస్తున్నారని సమాచారం. మహిళా సంఘాల సభ్యులను ప్రభావితం చేయడానికి వారిని బలంగా వినియోగిస్తున్నారనే        ఆరోపణలున్నాయి. వలంటీర్లు తమ పరిధిలోని ఇళ్ళకు రోజూ వెళ్లి మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఆయా కుటుంబాలకు అవసరమైన పనులు చేయించి పెడతామని హామీలు ఇస్తున్నట్టు విమర్శలున్నాయి. అలాగే వార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనుల గురించి  కరపత్రాలు ముద్రించి ఇంటింటా చదివి వినిపిస్తున్నారని తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన మరుసటి రోజు అధికార పార్టీ నేతలు వలంటీర్లకు రూ. 10 వేల  చొప్పున నగదు పంపిణీ చేశారని, రెండో విడత మంగళవారం మళ్ళీ రూ. 10 వేల వంతున పంపిణీ చేశారని పట్టణంలో ప్రచారం జరుగుతోంది. 


విమర్శలకు తావిచ్చేలా పోలీసుల తీరు

వైసీపీ నేతల దౌర్జన్యానికి గురైన కుప్పం సీఐని సాక్షాత్తూ చంద్రబాబు అభినందించి, అండగా వుంటామని హామీ ఇచ్చిన రోజుల వ్యవధిలోనే కుప్పం పోలీసు అధికారులు తీవ్ర పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 14వ వార్డు టీడీపీ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి వెళుతున్న కుప్పం మాజీ సర్పంచ్‌, మాజీ ఎంపీపీ డాక్టర్‌ వెంకటే్‌షపై దాడి జరిగింది. అతని నామినేషన్‌ పత్రాలను ప్రత్యర్థులు లాక్కుని చించివేశారు. ఈ ఘటనలతోనే కుప్పంలో ఎన్నికలు ఏ వాతావరణంలో జరుగుతున్నాయో బయటి ప్రపంచానికి తెలిసొచ్చింది. బయటి ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు కుప్పంలో వుండకూడదన్న అర్థం లేని నిబంధన విధించి నేతలను బలవంతంగా కుప్పం నుంచీ తరలించిన పోలీసు అధికారులు వైసీపీ తరపున ప్రచారం చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి, ఇతర అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బందోబస్తు విధులు నిర్వహించడాన్ని కుప్పం ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. కుప్పం ఎన్నికల చరిత్రలోనే ఏనాడూ ఇంతమంది పోలీసులను నియమించింది లేదని స్థానికులు చెప్పుకుంటున్నారు. గతంలో వంద మంది వుంటే అదే గొప్పగా వుండేది.ఇపుడు పట్టణంలో వందలాదిమంది పోలీసులు ఎన్నికల విధుల్లో వున్నారు. వార్డుకు పదిమంది దాకా పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ఈ తరహా ఎన్నికల వాతావరణం పట్టణ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఏనాడూ వివాదాలు, గొడవలు, దౌర్జన్యాలు వంటివి తెలియని కుప్పం ప్రజలకు ఇవన్నీ కొత్త అనుభవాలు.

Updated Date - 2021-11-11T07:39:25+05:30 IST