బువ్వ పెట్టలేం..!

ABN , First Publish Date - 2021-11-14T06:34:59+05:30 IST

ప్రభుత్వం రోగులు, విద్యార్థులకు అందించే భోజనాలకు సైతం డబ్బు ఇవ్వడం లేదు.

బువ్వ పెట్టలేం..!
యాడికి హైస్కూల్‌

నెలలుగా రూ.కోట్లలో బిల్లులు పెండింగ్‌

అనంత ఆస్పత్రిలోనే రూ.కోటికిపైగా బకాయి

పైసా విడుదల చేయని ప్రభుత్వం

ఆస్పత్రులు, పాఠశాలల ఏజెన్సీల ఆందోళన

భోజనం పెట్టలేమంటూ చేతులెత్తేస్తున్న వైనం

హిందూపురం ఆస్పత్రిలో రోగులకు ఆగిన తిండి

యాడికి ఉన్నత పాఠశాలలోనూ ఇదే తంతు..

అనంతపురం వైద్యం, నవంబరు13: ప్రభుత్వం రోగులు, విద్యార్థులకు అందించే భోజనాలకు సైతం డబ్బు ఇవ్వడం లేదు. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో అన్నం పెట్టే ఏజెన్సీలు బువ్వ పెట్టలేం అంటూ చేతులెత్తేస్తున్నారు. హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అన్నం అందించే ఏజెన్సీకి లక్షల బిల్లులు పెండింగ్‌ ఉండటంతో సరఫరా చేయలేమని చేతులెత్తేశారు. యాడికిలోని జిల్లా పరిషత ఉన్నతపాఠశాలలో కూడా నెలలుగా బిల్లులు రాకపోవడంతో ఆ పాఠశాలకు భోజనం అందించే ఏజెన్సీ సైతం తప్పుకుంది. ఈక్రమంలో హిందూపురం ఆస్పత్రిలో రోగులకు అన్నం అందకుండా పోయింది. యాడికి జడ్పీ ఉన్నత పాఠశాల హెచఎం  సోమవారం నుంచి ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలని సర్క్యులర్‌ జారీ చేశారు. ఏళ్లుగా ఆస్పత్రిలో అడ్మిషన పొంది చికిత్స పొందే రోగులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి టిఫిన, భోజనం, స్నాక్స్‌ వంటి పదార్థాలు అందిస్తూ వస్తున్నారు. జనరల్‌ వ్యాధులతో అడ్మిషన పొంది చికిత్స పొందుతున్న వారికి రోజుకు 40 రూపాయులు, టీబీ పేషంట్లకు రూ.56, ప్రసవించిన మహిళలకు రోజుకు వంద రూపాయలు చెప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ మేరకు ఏజెన్సీ ద్వారా రోజువారీగా రోగులకు మెనూ ప్రకారం భోజనం, టిఫిన అందించాల్సి ఉంటుంది. జిల్లా సర్వజనాస్పత్రి, హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధికంగా రోగులు అడ్మిషన పొంది, చికిత్స పొందుతుంటారు. అధికారిక లెక్కల అనంతపురం ఆస్పత్రిలో రోజూ సగటున 800 మందికి భోజనం అందిస్తుండగా హిందూపురం ఆస్పత్రిలో 200మంది వరకు భోజనం పెడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ భోజనాలకు పైసా కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. హిందూపురం ఆస్పత్రి ఏజెన్సీకి దాదాపు రూ.20 లక్షలు బకాయి పడటంతో బిల్లులు రాక.. అప్పులు చేసి భోజనం అందించలేక చేతులెత్తేశారు. జిల్లా ఆస్పత్రి ఏజెన్సీకి అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రూ.కోటి బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ కూడా ఏజెన్సీ బిల్లులు అందక అవస్థలు పడుతూనే అప్పులు తెచ్చి, రోగులకు అన్నం పెడుతున్నారు. జిల్లాలో 3330 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 520 ఉన్నత పాఠశాలలు, 2810 ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో అధికారిక లెక్కల ప్రకారం 3.08 లక్షల మంది పిల్లలు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. ఈ పిల్లలకు రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇక్కడ కూడా ఏజెన్సీలకు నెలల తరబడి బిల్లులు అందక అవస్థలు పడుతున్నారు. కొందరు అప్పులు తెచ్చి, పిల్లలకు అన్నం పెడుతుండగా.. మరికొందరు సరఫరా చేయలేమని తప్పుకుంటున్నారు. కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఏజెన్సీలు అవస్థలు పడుతుంటే జిల్లా ఉన్నతాధికారులు మాత్రం మెనూ తప్పనిసరిగా అమలు చేయాలనీ, రోగులు, పిల్లలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కొన్నిచోట్ల కొంత మందికి షోకాజ్‌లు జారీ చేస్తుండగా మరికొంత మందిని సస్పెండ్‌ చేస్తున్నారు. 

ఈ కోట్ల బకాయిల విషయం తెలిసినా ఉన్నతాధికారులు పట్టీపట్టినట్లు ఉంటూ మరోవైపు మెనూ తప్పనిసరి అం టూ బెదరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోనే రూ.20కోట్ల వరకు ఆస్పత్రులు, పాఠశాలల మధ్యాహ్న భోజనానికి బిల్లులు బకాయి ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంగనవాడీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలో 5126 అంగనవాడీలుండగా ఇందులోనూ 3 లక్షల మంది వరకు పిల్లలు, గర్భిణులు, బాలింతలకు రోజూ పౌష్టికాహారం పేరుతో భోజనం అందిస్తున్నారు. బిల్లులు పెండింగ్‌ ఉండటంతో ఏజెన్సీలు సక్రమంగా నాణ్యమైన సరుకులు అందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కర్ణాటక నుంచి సరఫరా చేస్తున్న పాలకు కోట్లు చెల్లించాల్సి ఉండటంతో ఆ ఏజెన్సీ కూడా త్వరలో పాల సరఫరా నిలిపివేయడానికి ఇప్పటికే ప్రభుత్వానికి ఆల్టిమేటమ్‌ పెట్టినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.


రేపటి నుంచి బడిలో ‘మధ్యాహ్న భోజనం’ బంద్‌

యాడికి: స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో ఈనెల 15 నుంచి మధ్యాహ్న భోజనం బంద్‌ చేయనున్నారు. విద్యార్థులు ఇంటి వద్ద నుంచే మధ్యాహ్న భోజనం క్యారియర్లు తెచ్చుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయమ్మ వెల్లడించారు. ఈ మేరకు విద్యార్థుల కు తెలియజేయాలని హెచఎం శుక్రవారమే ఉపాధ్యాయులకు స్టాఫ్‌ఆర్టర్‌ జారీ చేశారు. వి ద్యాశాఖ తీరుతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఖం గుతిన్నారు. మండలకేంద్రంలోని హైస్కూల్‌లో 725 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో రోజూ 600 మందికి పైగానే పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటున్నారు. ఈక్రమంలో వంట ఏజెన్సీకి ప్రభుత్వం పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. ఆగస్టు నుంచి వంట మనుషుల వేతనాలతో కలిపి సుమారు రూ.2.5 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. ఈనేపథ్యంలో విద్యార్థులకు వంట వండి పెట్టడం ఇక తమవల్ల కాదంటూ ఏజెన్సీ నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో దిక్కుతోచని ప్రధానోపాధ్యాయురాలు స్టాఫ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. విద్యాశాఖ తీరుపై మండలవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద అంటూ ఉపన్యాసాలిచ్చి, ఫొటోలకు ఫోజులిచ్చిన ప్రభుత్వ పెద్దలు, అధికారులపై దుమ్మెత్తిపోస్తున్నారు. విద్యార్థుల నోటికాడ అన్నం ముద్దను కూడా ప్రభుత్వం లాగేసుకోవాలని చూస్తుందా అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నెలరోజుల క్రితం కూడా మధ్యాహ్న భోజనం ఏజెన్సీ బిల్లులు బకాయిల కారణంగా చేతులెత్తేశారు. దీంతో అప్పట్లో ప్రధానోపాధ్యాయురాలే కూరగాయలు, ఇతరత్రా వంట సామగ్రి తెచ్చి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వంటచేసి విద్యార్థులకు పెట్టారు. ఆతర్వాత ఏజెన్సీకి సర్దిచెప్పడంతో వంట వండి పెట్టారు. ఇప్పుడు మరలా అదే సీన పునరావృతమైంది. యాడికి హైస్కూల్‌లో మ ధ్యాహ్న భోజనం నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడతారా? ఇంటి నుంచి తెచ్చుకుంటారా? అనేది సందిగ్ధంగా మారింది.

Updated Date - 2021-11-14T06:34:59+05:30 IST