కేన్సర్‌ పలు రూపాల్లో...

Aug 18 2020 @ 12:12PM

ఆంధ్రజ్యోతి(18-08-2020)

కేన్సర్‌ సోకిన అవయవాన్ని బట్టి కేన్సర్‌కు వేర్వేరు పేర్లు ఉంటాయి. నాలుగు దశల్లో దాడి చేసే కేన్సర్‌, అది వ్యాపించిన ప్రాంతాన్ని బట్టి వర్గీకరించి చికిత్స ఇస్తారు. 


కణితి పరిమాణం, చుట్టుపక్కల విస్తరించిన లింఫ్‌ నోడ్స్‌, ఇతర భాగాలకు వ్యాపించడం... ఇలా కేన్సర్‌ వ్యాప్తిని బట్టి వ్యాధిని దశలవారీగా విభజించి చికిత్స చేస్తారు. కేన్సర్‌ ప్రారంభానికి ముందు దశ జీరో అయితే, ప్రారంభం అయిన దశను స్టేజ్‌ 1 అనీ, లింఫ్‌ గ్రంథులకు సోకితే స్టేజ్‌ 2 లేక 3 అనీ, ఇతర అవయవాలకు వ్యాప్తిస్తే స్టేజ్‌ 4 అనీ నిర్ధారిస్తారు. అలాగే చర్మానికి సోకిన కేన్సర్‌ను కార్సినోమా అని, కనెక్లివ్‌ టిష్యూకు, కండరాలకు సోకితే సార్కోమా అనీ, ఎముకమజ్జలో వ్యాపిస్తే లుకేమియా అనీ, లింఫ్‌ నాళాల్లో వ్యాపిస్తే లింఫోమా అనీ,   మైలోమా అనీ అంటారు.


ప్రాంతాలను బట్టి: శీతల దేశాల్లో, ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చర్మ కేన్సర్‌ ఎక్కువ. నికెల్‌ వంటి రసాయన పరిశ్రమలు, రేడియోధార్మికత, అణువిద్యుత్‌ పరిశ్రమలు, పొగాకు పరిశ్రమలు, రేడియేషన్‌కు గురయిన వారికి కేన్సర్‌ సోకే అవకాశాలూ ఎక్కువే! 


పరీక్షలు: ఎక్స్‌రే, అలా్ట్రసౌండ్‌ స్కాన్‌, సిటి స్కాన్‌, న్యూక్లియర్‌ స్కాన్‌, ఎమ్మారై, పెట్‌ స్కాన్‌, బయాప్సీ, రక్త, మలమూత్ర పరీక్షలు, కళ్లె పరీక్షలతో కేన్సర్‌ను నిర్ధారించవచ్చు. వ్యాధిని నిర్ధారించిన తర్వాత సర్జరీ, తదనంతర అవసర థెరపీలను వైద్యులు సూచిస్తారు. లేదా థెరపీల తర్వాత సర్జరీ చేయవచ్చు. చికిత్సలో భాగంగా కీమో, రేడియోథెరపీ, హార్మోన్‌ థెరపీ, జీన్‌ థెరపీ, బయలాజిక్‌, ఇమ్యునోథెరపీలు అవసరం కావచ్చు. కొందరికి ఎముకమజ్జ మార్పిడి, స్టెమ్‌సెల్‌ థెరపీలు కూడా ఉపయోగపడతాయి.


ఆధునిక చికిత్సలు: కీహోల్‌, లేజర్‌ల మాదిరిగానే కేన్సర్‌లో నేరుగా కణాన్ని గురిపెట్టి చేసే టార్గెటెడ్‌ థెరపీలు, విమ్యాట్‌ రేడియేషన్‌, త్రీడి రేడియేషన్‌ ఎక్స్‌రేలతోనే కాకుండా ప్రోటాన్‌ థెరపీ, బ్రాక్‌ థెరపీ లాంటివి అందుబాటులోకి వచ్చాయి. వీటికి తోడు మానసిక స్థైర్యాన్ని పెంచే కుటుంబసభ్యుల తోడ్పాటు కూడా అవసరమే! యోగా, ధ్యానం కూడా ఉపయోగపడతాయి. కీమోథెరపీతో ఆకలి మందగించడం, జుట్టు రాలడం, రోగనిరోధకశక్తి తగ్గడం లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి.


వేర్వేరు చికిత్సలు: కేన్సర్‌ కణం తత్వం వ్యక్తి శరీర తత్వాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టు చికిత్స ఎంచుకోవాలి. వయసు, కేన్సర్‌ కణం ప్రవర్తించే తీరులను బట్టి చికిత్స నెలల నుంచి సంవత్సరాల వరకూ సాగుతుంది.


వీటికి దూరం: ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉండాలి. నూనెను పదే పదే మరగకాచి వాడకూడదు. పొగల్లో పని చేయకూడదు. క్రిమిసంహారక మందుల నుంచి వెలువడే వాయువులను పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, నాలుక, గొంతు, పెదవి, మూత్రాశయం, గర్భాశయ ముఖద్వారం కేన్సర్‌కు గురి కావచ్చు. 


వ్యాధి ముదిరితే: చివరి దశకు చేరుకున్న కేన్సర్‌ వ్యాధిని నయం చేయడం కష్టం. ఈ దశలో రోగికి బాధలను తగ్గించి,  జీవన నాణ్యతను పెంచే పాలియేటివ్‌ చికిత్సలు ఇవ్వవలసి ఉంటుంది. ఇందులో భాగంగా కణితి పరిమాణం తగ్గించడానికి మత్తు మందులు ఇవ్వడంతో పాటు కీమో, రేడియోథెరపీలను ఇవ్వవలసి ఉంటుంది. ఈ చికిత్సలో అనస్థటిస్ట్‌, పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌, మెడికల్‌ ఆంకాలజిస్ట్‌, డైటీషియన్‌, నర్సులు, స్నేహితులు, కుటుంబసభ్యులు భాగస్వాములుగా ఉంటారు. కేన్సర్‌ చికిత్సలో కుటుంబసభ్యుల తోడ్పాటు అన్నింటికంటే కీలకం.


- డాక్టర్‌ మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌

ఒమేగా హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.

ఫోన్‌: 9848011421

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.