అరకొరగా ఆర్టీసీ లోకల్‌ బస్సు సర్వీసులు

ABN , First Publish Date - 2021-05-05T05:56:08+05:30 IST

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 4: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానున్న నేపథ్యం లో జిల్లా ఆర్టీసీ దూరప్రాంత సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. విశాఖపట్నం, విజయవాడ తదితర అంతర్‌జిల్లా సర్వీసులతోపాటు హైదరాబాద్‌కు బస్సు సర్వీసులను పూర్తి

అరకొరగా ఆర్టీసీ లోకల్‌ బస్సు సర్వీసులు
రాజమహేంద్రవరం కాంప్లెక్స్‌లో హైపోక్లోరైడ్‌ పిచికారీ చేస్తున్న దృశ్యం

విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌ సర్వీసులు నిలిపివేత

జిల్లాలోనూ చాలా వరకు కట్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 4: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానున్న నేపథ్యం లో జిల్లా ఆర్టీసీ దూరప్రాంత సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. విశాఖపట్నం, విజయవాడ తదితర అంతర్‌జిల్లా సర్వీసులతోపాటు హైదరాబాద్‌కు బస్సు సర్వీసులను పూర్తిగా రద్దుచేసింది. దూరప్రాంత రూట్లలో ఒక్క బస్సు కూడా నడపకూడదని మంగళవారం సాయం త్రం జరిగిన సమావేశంలో ఆర్టీసీ జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దూరప్రాంత సర్వీసులు పూర్తిగా నిలిపివేయడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 డిపోల నుంచి కనీసం లోకల్‌ సర్వీసులైనా నడపాలని అధికారులు భావిస్తున్నారు. ఆమేరకు ఆయా డిపో మేనేజర్లకు ఆర్టీసీ ఆర్‌ఎం ఆదేశాలు జారీ చేశారు. డిపోల నుంచి ఉదయం 6 గంటలకు బస్సులు బయలుదేరితే తిరిగి మధ్యాహ్నం 12 గంటల్లోగా డిపోలకు చేరుకోవాల్సి ఉన్నందున ఆ కొద్ది సమయంలో ఏఏ రూట్లలో బస్సులు తిప్పగలం అనేదానిపై డిపో మేనేజర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లావ్యాప్తం గా కనీసం 100 బస్సులైనా తిరుగుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక హైదరాబాద్‌కు ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్లు చేసుకోవడంతో మంగళవారం రాత్రి హైదరాబాద్‌ సర్వీసులు పంపించారు. ఈ బస్సు లు తిరిగి బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వస్తాయి. బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్‌ సర్వీసులు పూర్తిగా నిలిపివేస్తారు. ఇక రాజమహేంద్రవరం డిపో నుంచి అమలాపురం, కాకినాడకు సర్వీసులు నడవడం సందేహంగా మారింది. నాన్‌స్టాప్‌ బస్సులు కూడా నడిపే పరిస్థితి కనిపించడంలేదు. నాన్‌స్టాప్‌ బస్సు రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్లి రావాలంటే కనీసం 4 గంటల సమయం పడుతుంది. దీంతో ఈ రూటులో బస్సులు నడపడానికి అవకాశాలు తక్కు వగా ఉన్నాయి. ఇక అమలాపురం సర్వీసులన్నీ అమలాపురం డిపో నుంచే నడుస్తాయి. రాజమహేంద్రవరం డిపో నుంచి అమలాపురం సర్వీసులు లేవు. దీంతో అమలాపురం డిపో అధికారులు రాజమహేంద్రవరం సర్వీసులు నడిపే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో జిల్లా ఆర్టీసీ అరకొరగానే బస్సులు నడపనుంది. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి జిల్లా అంతటా కర్ఫ్యూ వాతావరణం ఉన్న సమయంలో ప్రయాణికులు ఏ మేరకు రాకపోకలు సాగిస్తారనేది చూడాల్సి ఉంది. 


లోకల్‌ సర్వీసులు మాత్రమే : ఆర్‌ఎం

కర్ఫ్యూ దృష్ట్యా దూరప్రాంత సర్వీసులన్నీ రద్దు చేశామని, కేవలం లోకల్‌ సర్వీసులు మాత్రమే తిప్పడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ ఆర్‌ఎం నాగేశ్వరరావు అన్నారు. కేవలం ఆరు గంటల స్వల్ప సమయంలో ఎన్ని బస్సులు తిరుగుతాయి, ఏఏ రూట్లలో తిప్పాలనేది బుధవారం క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని స్పష్టం చేశారు.


బస్సు సర్వీసులు నిలుపుదల : కాకినాడ డీఎం

కార్పొరేషన్‌(కాకినాడ), మే 4: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న దృష్ట్యా బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ విధించడంతో దూరప్రాంత బస్సు సర్వీసులు నిలుపుదల చేస్తున్నట్టు కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్‌ పీ భాస్కరరావు తెలిపారు. విశాఖపట్నం సర్వీసులు మాత్రం ఒకటి లేదా రెండు బస్సు లు తిరిగే విధంగా ప్లాన్‌ చేస్తున్నామన్నారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు డిపోకి బస్సులు చేరేలా ఆదేశాలిచ్చామన్నారు. రాజమహేంద్రవరం, అమలాపురం, రావులపాలెం, పెద్దిపాలెం, శాంతి ఆశ్రమం, కోటిపల్లి, అవసరాన్నిబట్టి తుని బస్సు సర్వీసులు తిరుగుతాయన్నారు. బస్సులో ప్రయాణించే వారందరూ మాస్కు ధరించాలని, శానిటైజర్‌ వాడాలని కోరారు.

Updated Date - 2021-05-05T05:56:08+05:30 IST