చెన్నమ్మ మరణం

ABN , First Publish Date - 2022-09-23T05:30:00+05:30 IST

పోయినోళ్లందరూ మంచోళ్లే అంటారు. కానీ ఆమె మాత్రం తన కుటుంబ సభ్యులు, బంధువులకు మంచిది కాకుండా పోయింది.

చెన్నమ్మ మరణం

    పోయినోళ్లందరూ మంచోళ్లే అంటారు. కానీ ఆమె మాత్రం తన కుటుంబ సభ్యులు, బంధువులకు మంచిది కాకుండా పోయింది. బతికుండగా ఏర్పడిన మనస్పర్థలు.. మరణం తరువాతా కొనసాగాయి. అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూసిన ఆమెను అక్కడే వదిలేసి వెళ్లారు. ‘మరీ అంత కఠినంగా ఎందుకు వ్యవహరించారో..! కారణాలు ఏవైనా.. అలా చేయాల్సింది కాదు...’ అని అక్కడున్నవారు వ్యాఖ్యానించారు. అనంతపురం నగరంలోని సర్వజన వైద్యశాలలో శుక్రవారం ఓ మహిళ మరణించింది. ఆమె పేరు పి.చెన్నమ్మ. వయసు నలభై ఏళ్లు. చెన్నేకొత్తపల్లి మండలం చిన్నరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెన్నమ్మ.. ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతూ ఈ నెల 21న సర్వజన వైద్యశాలలో చేరింది. కూడా బంధువులు వచ్చారు. చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం సాయంత్రం మరణించింది. ఆమె మృతదేహాన్ని తీసుకువెళ్లి.. అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సిన బంధువులు, కుటుంబ సభ్యులు నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లారు. దీంతో ఆస్పత్రి అధికారులు ఔట్‌ పోస్ట్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెన్నమ్మ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మూడు రోజులపాటు వేచి చూస్తామని, ఎవరూ రాకపోతే మున్సిపాలిటీకి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

      - అనంతపురం క్రైం

Updated Date - 2022-09-23T05:30:00+05:30 IST